నివేదనతో సమస్యల పరిష్కారం సులభతరం

Sat,August 24, 2019 02:04 AM

కొత్తగూడెం అర్బన్ : ప్రజల సమస్యల పరిష్కారంలో నివేదన యాప్ ప్రవేశపెడుతున్నామని, ఇకపై ప్రజల సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులకు నివేదన యాప్‌పై శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ యాప్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని, గ్రామస్థాయి సిబ్బందికి మండల స్థాయిలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ యాప్‌లో మూడు విభాగాలు ఉంటాయని, లైజన్1, లైజన్2, లైజన్3లకు అధికారులు ఉంటారన్నారు. మొదటి లైజన్‌కు గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ కానీ, వీఆర్వో కానీ సంబంధిత అధికారులు ఉంటారన్నారు.

లైజన్- 1 అధికారికి అందిన సమస్యపై స్పందన కోసం నాలుగు అంశాలుంటాయని, వీటిపై ఏ చర్య తీసుకున్నా లైజన్-2, లైజన్-3అధికారులకు మెస్సేజ్ రూపంలో సమాచారం వస్తుందని వివరించారు. లైజన్-2 అధికారి మండల అధికారులు ఎంపీడీవో, తహసీల్దార్, ఏపీవో, ఏపీఎంలు వారికి సంబంధించినవైటే వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. లైజన్-3 అధికారి జిల్లాస్థాయిలో ఉండి పరిశీలించి తగు సమాధానం పంపడంతో సమస్య త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు దోహదపడుతుందన్నారు. ఈ యాప్ లో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి సమస్య స్థితిగతులను వివరించేందుకు ఈ యాప్ ఉపయోగపకరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో యాప్‌ను రూపొందించి అందజేస్తామని, తద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, డీఆర్‌వో కిరణ్‌కుమార్, ఆర్డీవో స్వర్ణలత, డీఆర్‌డీవో జగత్‌కుమార్‌రెడ్డి, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles