అక్రమ వసూళ్ల ముఠాపై కేసు

Fri,August 23, 2019 04:25 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామంటూ అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళను మంజూరు చేస్తామని కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన పద్మారావు, అగస్టిన్, గుంటూరుకు చెందిన ఉదయ్ కిరణ్, అశ్వారావుపేట మండలం తిరమలకుంటకు చెందిన పాత నేరస్తుడైన కొత్తపల్లి సీతారాముడు (రౌడీ షీటర్) కలిసి మండలంలోని గిరిజన గ్రామాల్లో మొత్తం 900 మంది నుంచి రూ.1,500-2,500 చొప్పున రూ.20లక్షల వరకు వసూలు చేశారు. ఇళ్ళు మంజూరు కాకపోవటంతో దిబ్బగూడెం గ్రామానికి చెందిన ఆరుగురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమ వసూళ్ళ సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి ఆదేశాలతో వీఆర్వోలు కూడా లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎం.అబ్బయ్య తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

విలేకరులతో సీఐ మాట్లాడుతూ... ఇటువంటి వ్యక్తుల మోసాలకు ప్రజలు బలికావొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామంటూ ఎవరైనా అక్రమ వసూళ్ళకు పాల్పడితే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కేవలం కార్యాలయాల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని, ప్రయివేట్ వ్యక్తుల మాయ మాటలను నమ్మొద్దని చెప్పారు. ఇలాంటి మోసగాళ్ల సమాచారాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలపాలని ప్రజలను కోరారు. మోసగాళ్లబారిన పడవద్దని హెచ్చరించారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles