ఆడపడుచులకు ‘బతుకమ్మ’ చీరె...

Wed,August 21, 2019 01:03 AM

-చేనేతకు ఊతమిస్తున్న ప్రభుత్వం
-జిల్లాలో 2,02,396 మంది లబ్ధిదారులు
-తెల్లరేషన్‌ కార్డు ఆధారంగా అందజేత
-జిల్లాకు చేరిన 50 వేల చీరెలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సమైక్య పాలన కాలంలో తెలంగాణ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగయ్యాయి... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కించపరుస్తూ పండుగలు, పబ్బాలకు ఎలాంటి నిధులు కేటాయించకుండా సమైక్య ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అనేక ఏళ్లుగా సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ నాటి పండుగలు, పబ్బాలు, సంప్రదాయాలకు పునరుజ్జీవం పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతీఏటా దసరా, రంజాన్‌, క్రిస్మస్‌, బోనాలు తదితర పండుగలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ప్రభుత్వ ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహిస్తోంది. ఎన్నో ఏళ్లుగా వస్తున్న తెలంగాణ సంప్రదాయాలను తిరిగి బతికించుకుంటూ తమ సంస్కృతిని భావితరాలకు అందించేందుకు సీఎం కేసీఆర్‌ నడుం బిగించారు. ముఖ్యంగా దసరా పండుగ నాడు బతుకమ్మ చీరెలు, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలను అందిస్తూ సర్వమతాలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ నూతన సంస్కృతికి తెరలేపారు. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరెను సారె రూపంలో అందజేస్తూ తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్న అయ్యారు సీఎం కేసీఆర్‌. తెల్లరేషన్‌కార్డు ప్రాతిపదికన జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన 2,02,396 మంది మహిళలకు చీరెల పంపిణీకి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల చేనేత కార్మికులచే ప్రత్యేకంగా నేయబడిన సుమారు 50 వేల చీరెలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరాయి. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌యార్డు గోదాములో ఈ చీరెలను నిల్వ ఉంచారు. మరికొన్ని రోజుల్లో జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరికీ సరిపడే చీరెలను అధికార యంత్రాంగం దసరా పండుగకు ముందే సమకూర్చుకోనుంది. చీరెలు సమకూరిన అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన తేదీలలో రేషన్‌షాపుల ద్వారా బతుకమ్మ చీరెలను పంపిణీ చేయనున్నారు.

ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర పాలనలో కుదేలైన చేనేత రంగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను వారికి అందిస్తోంది. అంతేకాకుండా వారు నేసిన చీరెలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ చీరెలను బతుకమ్మ సారెగా తెలంగాణ ఆడపడుచులకు అందిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన చీరెలను నేసే సిరిసిల్ల నేతన్నలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం బతుకమ్మ చీరెల తయారీని వారికి అప్పగించింది. ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న రకాల డిజైన్లలో ఈ చీరెలను నేతన్నలు తయారుచేస్తున్నారు.

2,02,337 మంది లబ్ధిదారులు
జిల్లా వ్యాప్తంగా 2,02,396 మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరెలు అందజేయనున్నారు. మండలాల వారీగా ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకున్న జిల్లా అధికారులు నియోజకవర్గాల వారీగా చీరెలను గోదాముల్లో నిల్వ ఉంచనున్నారు. 479 పంచాయతీలతో పాటు నాలుగు మున్సిపాలిటీలు కలిపి మొత్తం 441 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా చీరెల పంపిణీని లబ్ధిదారులకు అందజేయనున్నారు. చీరెల పంపిణీ పారదర్శకంగా పంపిణీ చేసేందుకు రేషన్‌షాపుల వారికి ఇప్పటికే అవగాహన కల్పించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, రేషన్‌ డీలర్‌, సర్పంచ్‌లు కమిటీ సభ్యులుగా ఉండి చీరెలను పంపిణీ చేయనున్నారు.


లబ్ధిదారులందరికీ చీరెలు అందిస్తాం
జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరికీ చీరెలు పంపిణీ చేస్తాం. బతుకమ్మ పండుగకు కొన్ని రోజుల ముందు కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశాల మేరకు ఈ చీరెలను అందించనున్నాం. ఐదు నియోజకవర్గాల్లోని 479 గ్రామపంచాయతీల్లో ఉన్న 1,64,306 మంది లబ్ధిదారులతో పాటు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు నాలుగు మున్సిపాలిటీల్లో 38,090 మంది లబ్ధిదారులకు చీరెలు అందజేయనున్నాం.
- పి. జగత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీవో

మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు...
మండలం లబ్ధిదారులు
ఆళ్లపల్లి 2504
పాల్వంచ 13,785
అన్నపురెడ్డిపల్లి 4627
అశ్వాపురం 7785
అశ్వారావుపేట 11702
భద్రాచలం 7457
కొత్తగూడెం 12,674
బూర్గంపాడు 10,654
చండ్రుగొండ 6361
చర్ల 7736
చుంచుపల్లి 6662
దమ్మపేట 11,492
దుమ్ముగూడెం 8510
గుండాల 2710
జూలూరుపాడు 7424
కరకగూడెం 3037
మణుగూరు 6918
లక్ష్మీదేవిపల్లి 7057
మణుగూరు రూరల్‌ 5891
ములకలపల్లి 7853
పాల్వంచ రూరల్‌ 7867
పినపాక 6423
ఇల్లెందు 6652
సుజాతనగర్‌ 6229
టేకులపల్లి 9860
ఇల్లెందురూరల్‌ 12,526
మొత్తం 2,02,396

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles