జనజీవనస్రవంతిలో కలవండి

Sat,August 17, 2019 01:38 AM

-చింతకుంట సమీపంలో పట్టుకున్న పోలీసులు
-నాటు తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం
-వివరాలు వెల్లడించిన ఎస్పీ సునీల్‌దత్

కొత్తగూడెం క్రైం : ఆరణ్యవాసం చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అజ్ఞాత వా సులు జనజీవన స్ర వంతిలోకి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత ఆజాద్ దళ సభ్యుడిని విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం సబ్‌డివిజన్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్‌దత్ శుక్రవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిచారు. ఎన్డీ పార్టీ అజ్ఞాత దళాలు కొత్తగూడెం చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపి నేతృత్వంలో లక్ష్మీదేవిపల్లి ఎస్సై నరేష్‌కుమార్ తన సిబ్బందితో కలిసి లక్ష్మీదేవి మండల పరిధిలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో చింతకుంట గ్రామ సమీపంలో కొందరు వ్యక్తులు తారసపడి పారిపోతుండగా వారిని వెంబడించి ఒకరిని సాయుధంగా అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో వారు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత ఆజాద్ దళంగా తెలిపారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి చుంచుపల్లి మండలం ములుగుగూడెం పంచాయతీ పాలవాగుకి చెందిన మడివి రమేష్ అలియాస్ రవిగా గుర్తించారు. రవి వద్ద నుంచి ఓ నాటు తుపాకితో పాటు కిట్ బ్యాగ్, బుల్లెట్లు, సాహిత్యం స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సెర్చింగ్ ఆపరేషన్‌లో పోలీసుల నుంచి తప్పించుకున్న వ్యక్తులు దళ కమాండర్ ఆజాద్‌తో పాటు సభ్యుడు శ్యామ్ కూడా ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులకు పట్టుబడ్డ రమేష్ గత రెండు సంవత్సరాల నుంచి దళంలో తిరుగుతూ గుండాల, కొమరారం ప్రాంతాలలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని, ఇప్పటి వరకు ఇతనిపై పోలీసులపై దాడి కేసులతో కలిపి నాలుగు కేసులు నమోదైనట్లు ఎస్పీ ధ్రువీకరించారు. ఇప్పటికైనా మన్యంతో ఉంటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అజ్ఞాత దళాలు ఆయుధాలతో వచ్చి లొంగిపోవాలని, వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. జనజీవన స్రవంతితో కలిసేవారికి ప్రభుత్వ తరుపున పునరావాస పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అదే విధంగా జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఏమీ లేదని, పంద్రాగస్టు సందర్భంగా మావోయిస్టులు వేసిన వ్యూహాలు ఫెయిలయ్యాయని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అంతే కాకుండా ఇందులో భాగంగానే శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా దుమ్ముగూడెం, చర్ల పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తూ స్టేషన్‌కు ఒక ఇన్‌స్పెక్టర్ స్థాయి ఎస్‌హెచ్‌వోను, ఒక ఎస్సైని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. రవిని పట్టుకునేందుకు చేసిన ఆపరేషన్ సఫలీకృతమైనందుకు ఇన్‌స్పెక్టర్ గోపి, ఎస్సై నరేష్‌లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవరపల్లి ఉదయ్ కుమార్‌రెడ్డి. కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలీ, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపి, లక్ష్మీదేవిపల్లి ఎస్సై నరేష్ కుమార్, పోలీస్ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles