గిరిజన ప్రగతికి పెద్దపీట..!

Wed,August 14, 2019 01:05 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ ఆగస్టు13: గిరిజన ప్రగతికి పెద్దపీఠ వేసి ఏజెన్సీ అభివృద్ధికి మరింత కృషి చేద్దామని అధికారులు, ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం ఐటీడీఏ పాలక మండలి సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ఈ పాలక మండలి సమావేశానికి ప్రజా ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు జరిగింది. గత పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్చా నివేదిక, విద్య, సంక్షేమం, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం, ఆర్థికాభివృద్ధి పథకాలు, వ్యవసాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ, ఉపాధిహామీ పథకం, గిరిజన సహకార సంస్థ, భూ బదలాయింపు నియంత్రణ చట్టం, జమా ఖర్చులు, పరిపాలన విభాగపు వ్యయ వివరాలు, చార్టెడ్ అకౌంట్ నివేదిక తదితర 14 అంశాలకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రజా ప్రతినిధులు తమ తమ ప్రాంతాలలో ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను విన్న ఉన్నతాధికారులు నమోదు చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నదే ధ్యేయం: జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ
ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలన్నదే తమ ధ్యేయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ చైర్మన్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పరిపాలనను సులభతరం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందజేయుటకు ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఐటీడీఏ విద్య, వైద్య, సంక్షేమ రంగాలపై అత్యంత శ్రద్ధ తీసుకున్నట్లు వెల్లడించారు. పాలకమండలి సమావేశంలో తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను మినెట్స్ తయారు చేసి వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. ఐటీడీఏ ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ఏజెన్సీ అభివృద్ధిలో భాగస్వాములవుతాం: ప్రజా ప్రతినిధులు
ఏజెన్సీ అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని ప్రజా ప్రతినిధులు ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో అధికారులకు తెలిపారు. ఈ పాలక మండలి సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులు అనేక సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...వాజేడు, వెంకటాపురం మండలాలకు చెందిన 5గురు సీఆర్‌పీలను తీసుకోలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటేషన్‌లు అరికట్టగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో ఉన్నప్పటికి ఆ జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారనే కాని నిధులు మంజూరుకు భద్రాచలం ఐటీడీఏనే కోరాలని తెలియజేసినట్లు ఎమ్మెల్సీ బాలసాని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత భోజనం విద్యార్థులు తినలేకపోతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. మణుగూరు గుట్టపై నిర్మించిన బాలికల గురుకులానికి ప్రహరీ నిర్మించాలని, హాస్టల్ నిర్వాహణలో స్థానికంగా ఉన్నవారికే అవకాశం కల్పించాలని కోరారు. రామవరం ఎస్టీ గురుకులంలో విద్యార్థిని ఆరోగ్యం బాగోలేకపోయినా వైద్యులకు చూపించకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దుమ్ముగూడెంలో బ్రిడ్జీల నిర్మాణం అత్యంత ఆవశ్యకమన్నారు. ఏజెన్సీలో త్రీఫేజ్ విద్యుత్ ఏర్పాటు చేయాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ.... విద్యార్థులు లేరని స్కూల్స్ మూసివేయడం తగదని, మూలాలు వెతకాలని, వ్యవస్థను పటిష్ట పరచాలని కోరారు. విద్యార్థులు పెరుగుతున్నట్లుగా వసతులు కూడా పెంచాలన్నారు. ఎల్‌డబ్ల్యూ నిధులతో ఆశ్రమ స్కూల్స్‌ను రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చాలన్నారు.

ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ మాట్లాడుతూ...ఇల్లెందులో ఉన్న 30 పడకల ఆసుపత్రి 60కిలో మీటర్ల పరిధిలో పనిచేస్తుందని, గతంలో కేటాయించిన డాక్టర్స్ వెళ్లిపోవడంతో గైనకాలజిస్ట్ డాక్టర్ అత్యవసరంగా ఉన్నందున చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.... భద్రాచలంలో గతంలో ఉండి ఆంధ్రాలోకి వెళ్లిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని, పాలక మండలి ఏకగ్రీవంగా ఈ తీర్మాణాన్ని ఆమోదించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సారెడ్డి మాట్లాడుతూ...2016-17 నాటి విద్య 2018-19 నాటికి పలు మార్పులు చెందిందని అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మహబూబాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అంగోతు బిందు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత, శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, అలుగుబెల్లి నర్సిరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లెందు ఎమ్మెల్యే భానోతు హరిప్రియ, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రాలతో పాటు జిల్లాలోని ఎంపీపీలు, జడ్‌పీటీసీలు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులకు తల్లి లాంటిది ఐటీడీఏ
గిరిజనులకు తల్లి లాంటిది ఐటీడీఏ అని, వారి సాధక బాదలు తెలియాలంటే ప్రతీ మూడు నెలలకొక్కసారి ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు జరగాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. ఐటీడీఏ పాలక మండలి సమావేశానికి హాజరైన ఎంపీ కవిత మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలైన గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని అటువంటి అమాయక గిరిజనులను ఫారెస్ట్ అధికారులు బెదిరించడం సరైంది కాదన్నారు. వాస్తవాలను తెలుసుకొని గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గ్రామాల్లో విద్యా, రోడ్లు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వర్షాకాలం కావడంతో గిరిజన గ్రామాల్లో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజా ప్రతినిధులు వెంటనే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి గిరిజనులకు వైద్యం అందేలా చూడాలని కోరారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles