పండుగ పూట విషాదం..

Tue,August 13, 2019 12:27 AM

-ఈతకు వెళ్లి క్వారీ గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు మృతి
-కన్నీరు మున్నీరుగా రోదించిన ఇరువురి తల్లిదండ్రులు

బక్రీద్ పండుగ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఉదయం మసీదులో నమాజ్ చేసుకొని వచ్చిన ఇద్దరు చిన్నారులు సాయంత్రాన్ని విగతజీవులయ్యారు. బక్రీద్ పండుగ సంతోషంలో ఉన్న ఆ రెండు కుటుంబాలను చిన్నారుల ఆకస్మిక మరణ వార్త కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. అప్పటివరకు కళ్లముందే ఆటలాడుకుంటూ కనిపించిన కుమారులు కాసేపట్లోనే మృతుఒడిని చేరడంతో కన్న తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు. మృతదేహాలపై పడి కన్నీరుమున్నీరుగా రోధించారు. ఈ విషాదకర సంఘటన సోమవారం ఖమ్మం నగర పరిధి వైఎస్‌ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఖమ్మం అర్బన్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

డోర్నకల్ మండలం తహసీల్దార్ బంజరకు చెందిన షేక్ సలీం పొట్టకూటి కోసం ఐదేళ్లక్రితం కుటుంబంతో సహా వచ్చి వైఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. సలీం ఏకైక కుమారుడు షేక్ నాగులు(10) బల్లేపల్లి ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సలీం బంధువైన చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన షేక్ జానీ సైతం ఏడాది క్రితం వైఎస్‌ఆర్ నగర్ వచ్చి కుటుంబంతో ఉంటున్నాడు. జానీ కుమారుడు షేక్ మున్నా(05) 6వ డివిజన్ పరిధి రస్తోగినగర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు. కాగా బక్రీద్ సెలవు కావడంతో బంధువులైన షేక్ నాగులు, షేక్ మున్నా ఇద్దరు కలిసి ఉదయం స్థానికంగా ఉన్న మసీదులో నమాజ్‌కు వెళ్లి వచ్చారు. ఇరు కుంటుంబాల తల్లిదండ్రులు బక్రీదు పండుగ హడావుడిలో ఉండగా సరదాగా ఆడుకునేందుకు ఇద్దరు కలిసి బయటకు వచ్చారు.

కాగా వైఎస్‌ఆర్ నగర్ కాలనీకి ఆనుకొని ఉన్న డోలమైట్ క్వారీ వైపుగా వెళ్లారు. ఈ క్రమంలో క్వారీ గుంటల్లో వర్షపు నీళ్లు నిలిచి కనపడటంతో ఈత కొట్టేందుకు ఇద్దరు బట్టలు విప్పి లోనికి దిగారు. క్వారీ గుంటల లోతు ఎరుగని చిన్నారులు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాల తల్లిదండ్రులు వెతుకులాట సాగించారు. ఈ క్రమంలో క్వారీ గుంటల వద్ద బట్టలు కనిపించడాన్ని గమనించిన స్థానికులు కటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. గల్లంతైనట్లు తెలుసుకొని స్థానికుల చేత వెతుకులాట సాగించి ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఆడుకునేందుకు వచ్చిన చిన్నారులు క్వారీ గుంటల్లో పడి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు మృతదేహాలపై పడి గుండెలవిసేలా రోధించారు. ఖమ్మం అర్బన్ సీఐ సాయిరమణ సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారులు మృతి చెందిన తీరుపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles