రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Tue,August 13, 2019 12:24 AM

-మరొకరి పరిస్థితి విషమం
రఘునాథపాలెం, ఆగస్టు12 : కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం ఖమ్మం నగరం శ్రీశ్రీ సర్కిల్ సమీపంలో చోటు చేసుకుంది. ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరం మేదరబజార్‌కు చెందిన వేముల సాయి కిషోర్(21), జశ్వంత్(19) ఇటీవలె ఇంటర్ పూర్తి చేశారు. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి స్థానిక మైదానంలో క్రికెట్ ఆడారు. ఈ క్రమంలో జశ్వంత్ తన మిత్రుడైన సాయి కిషోర్‌ను వెంటబెట్టుకొని బైక్‌పై వైరా రోడ్డువైపుగా వెళ్లారు. తిరిగి వస్తుండగా శ్రీశ్రీ సర్కిల్ వైపు చేరుకోగానే సత్తుపల్లి నుంచి ఖమ్మం వస్తున్న టీఎస్04ఈటి 0285నెంబరు కాగా ఐ10కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

బైక్‌ను ఢీకొట్టిన కారు తప్పించుకునే ప్రయత్నంగా చేయగా స్థానిక ప్రయాణికులు వెంబడించి పట్టుకున్నారు. బైక్ వెనుకాల కూర్చున్న సాయి కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను నడుపుతున్న జశ్వంత్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గుర్తించి 108లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జశ్వంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాయి కిషోర్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు పెద్ద ఎత్తున ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధించారు. మృతుని తల్లి కళావతి ఖమ్మం కోర్టులో విధులు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిరమణ తెలిపారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles