ప్రత్యేక హాస్టళ్లు

Mon,August 12, 2019 12:46 AM

-విద్యార్థుల అభ్యున్నతి.. సర్కారు లక్ష్యం
-ఒక్కో విద్యార్థికి నెలకు రూ.500 పాకెట్ మనీ
-హాస్టళ్లలో బయోమెట్రిక్ అమలు
-పక్కాగా ఆహార మెనూ అమలు

కొత్తగూడెం ఎడ్యుకేషన్: గతంలో వసతి గృహాలంటే కేవలం పేద విద్యార్థులు ఆశ్రయం పొంది విద్యాభ్యాసం చేసే వారనే భావన ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో ధనిక వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా వసతి గృహాల్లో చేరేందుకు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ వసతి గృహాల్లో అన్ని సదుపాయాలతో విద్యార్థులకు సకల సౌకర్యాలు అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 32 వసతి గృహాల్లో 2600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలోని అన్ని వసతి గృహాల భవనాల మరమ్మతుల కోసం రూ.1.13 కోట్లను కేటాయించి 18 వసతి గృహాలకు మరమ్మతులు చేయించింది. దీంతో హాస్టళ్లు కొత్తరూపు సంతరించుకున్నాయి. ప్రతీ ఏడాది విద్యార్థులకు రెండు దుప్పట్లు, నాలుగు జతల దుస్తులు, రాత్రి సమయంలో వేసుకునేందుకు నైట్‌డ్రెస్, శీతాకాలంలో స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు అందిస్తారు.

అంతేకాకుండా విద్యార్థులను వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు విజ్ఞాన విహార యాత్రలకు తీసుకెళ్లి వారికి రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలను చూపించి తెలంగాణ చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది వందమంది విద్యార్థులను వరంగల్, హైదరాబాద్ నగరాలకు తీసుకెళ్లి సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, వెయ్యిస్తంభాల గుడి తదితర ప్రాంతాలను చూపించారు. ప్రతీ ఏడాది క్రూషియల్ వెల్ఫేర్ ఫండ్ కింద ఐఐటీ, నీట్‌లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, వారి చదువుకు ఉపయోగపడే ఇతర వస్తువులను అందిస్తున్నారు. దీంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా కళాశాలలో చదువుకునే వసతి గృహ విద్యార్థులకు రూ.500 నెలకు పాకెట్‌మనీ కింద ఇస్తున్నారు. దీంతో ఎస్సీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఎస్సీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు పోటీ పడుతున్నారు.

ఎస్సీ వసతి గృహాల్లో పెరిగిన అడ్మీషన్లు..
ప్రభుత్వం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వసతి గృహాల్లో సొంతింటి భోజనాన్ని తలపించే విధంగా మెనూను అందిస్తుండటం, నాణ్యమైన విద్యను బోధించడం, పరీక్షల సమయంలో ట్యూటర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండటం, ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గత ఏడాది 2300 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది 2600 మంది వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటికి కూడా అడ్మీషన్లు జరుగుతున్నాయి. కొన్ని కళాశాలల్లో అడ్మీషన్లు ఇంకా పూర్తి కాకపోవడంతో సుమారు 400 మంది వరకు వసతిగృహాల్లో అడ్మీషన్లు పొందనున్నారని అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 శాతం అడ్మీషన్లు పెరిగాయి.

నెలకు ఎనిమిది సార్లు కోడికూరతో భోజనం..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 32 ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులకు నెలకు ఎనిమిది సార్లు కోడికూరతో ప్రత్యేక మెనూను రూపొందించి అమలు చేస్తున్నారు. చికెన్ లేని రోజు కోడి గుడ్లను అందజేస్తారు. వారానికి ఐదు కోడిగుడ్లు అందిస్తారు. ఉదయం లేవగానే రాగిజావ, బెల్లం, పాలు ఇస్తారు. విద్యార్థులకు అల్పాహారంలో వెజిటేబుల్ బిర్యానీ, గోదుమరవ్వ ఉప్మా, పులిహోర, కిచిడీ, జీరా రైస్, ఇడ్లీ సాంబార్‌తో పాటు ప్రతీరోజు అరటిపండును ఇస్తారు. సాయంత్రం సమయంలో బిస్కెట్లు, శనగ గుగ్గిళ్లు, పల్లిపట్టి, అటుకులు, బిస్కెట్లు, రవ్వకేశరిని సాయంత్రం స్నాక్స్‌గా అందిస్తారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

బయోమెట్రిక్‌తో అవినీతికి చెక్..
విద్యార్థులకు వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. రానున్న పదిహేను రోజుల్లో ఈ విధానాన్ని అన్ని ఎస్సీ వసతి గృహాల్లో ప్రారంభించనున్నారు. దీనిపై హాస్టల్ వార్డెన్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వసతి గృహాల్లో ఎటువంటి అవినీతికి తావులేకుండా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మెనూ అందే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు, విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ మంది ఉన్నారని చూపించి లెక్కలు రాయడం లాంటి కార్యక్రమాలకు చెక్ పెట్టినట్లే. ప్రభుత్వం ద్వారా విద్యార్థులకు అందే నాణ్యమైన భోజనం, తినుబండారాలు పక్కదారి పట్టకుండా బయోమెట్రిక్‌తో అడ్డుకట్ట వేసినైట్లెంది.

పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
పదవ తరగతి విద్యార్థులపై వసతి గృహాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ట్యూటర్లను ఏర్పాటు చేసి ప్రతీ రోజు వారికున్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రతీ ఏడాది ఉత్తీర్ణత శాతం పెంచుతున్నారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను 96.899 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 129 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 125 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల సమయంలో ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్, విద్యార్థులకు వందరోజుల ప్రత్యేక మెనూను అందిస్తున్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles