చిన్నారుల జీవితాల్లో వెలుగులు

Sun,August 11, 2019 05:04 AM

-వందలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు
-అనాథలు, యాచకులైన బాలల గుర్తింపు
-బాలకార్మిక విముక్తికి అడుగులు
-తల్లిదండ్రుల చెంతకు చేరుస్తూ.. భరోసానిస్తూ..

కొత్తగూడెం క్రైం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాథలుగా మారుతున్న చిన్నారులను అక్కున చేర్చుకునేందుకు ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభించి.. ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.. చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితాలు చెత్తకుప్పల్లో, వెట్టిచాకిరిలో మగ్గుతున్న ఘటనలకు స్వస్తి పలికేందుకే ఈ ఆపరేషన్‌కు నాంది పలికింది ప్రభుత్వం.. ఇందులో భాగంగానే అనాథలుగా మారి చిధ్రమవుతున్న జీవితాలకు కొత్త మార్గాన్ని చూపిస్తన్నారు తెలంగాణ పోలీసులు.. బాలకార్మిక వ్యవస్థ, బాల యాచక వ్యవస్థను రూపుమాపే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్‌తో ముందడుగు వేస్తూ ఎంతో మంది అనాథలుగా మారిన చిన్నారులకు బాసటగా నిలుస్తున్నారు జిల్లా పోలీసులు. ఆపరేషన్ ముస్కాన్ నాలుగు దఫాలుగా జరిగిన కార్యక్రంమలో దిక్కు కొల్పోయిన బాలలను అక్కున చేర్చుకొని వారికి ఒక దిక్సూచిగా నిలుస్తున్నారు. ఈఏడాది జరిగిన ఆపరేషన్ ముస్కాన్-5తో 2019సంవత్సరంలో చిధ్రమవుతున్న చిన్నారుల జీవితాలకు అండగా నిలవడమే కాకుండా, వారి ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోంది.

చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో సంయుక్తంగా పాటుపడుతూ అనాథలుగా మారుతున్న చిన్నారులను గుర్తించి, వారిని ఒక గమ్యాస్థానానికి చేరుస్తున్నారు. అంతే కాకుండా ఈ ఆపరేషన్ ద్వారా అదృశ్యమవుతున్న చిన్నారులను సైతం గుర్తించి, వారి తల్లిదండ్రుల చెంతకు చేరుస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ఈ మూడేళ్ళలో ఎంతో మంది అభాగ్యులు మారిన బాలలను గుర్తించారు. వారిని చేరదీసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వారి భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు.

బాలలకు బాసటగా నిలుస్తున్న జిల్లా పోలీసులు
ఆపరేషన్ ముస్కాన్ -5లో భాగంగా జిల్లా పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో సమన్వయంగా వ్యవహరిస్తూ బాలకార్మిక వ్యవస్థ, యాచకులుగా మారిన చిన్నారులే లక్ష్యంగా పాటుపడుతూ వారిని గుర్తించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు ఇల్లెందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రతీ ఏటా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ఐసీపీఎస్) అధికారులతో కలిసి నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో ఎంతో మంది బాలలను చేరదీస్తున్నారు. జిల్లాలోని ఐదు సబ్‌డివిజన్ల పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ -5 నడుస్తోంది ఇందులో భాగంగానే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వెట్టిచాకిరి చేస్తున్న బాలలు, యాచిస్తున్న బాలలను గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించడం, చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ అధికారులు. అధికారులు ఈ ఆపరేషన్‌లో అక్కున చేర్చుకున్న బాల, బాలికలను పాఠశాలల్లో చేర్చారు.

ఆపరేషన్ ముస్కాన్ -5లో
జిల్లా పోలీసుల చర్యలు
ఆపరేషన్ ముస్కాన్ మొదలైనప్పటి నుంచి జిల్లా పోలీస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఎన్నో చర్యలు చేపట్టారు. జిల్లాలోని అన్ని మండలాల్లో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ -5 ద్వారా ఇప్పటి వరకు 119మంది బాలలను గుర్తించారు. ఇందులో జిల్లాలోని బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, రోడ్ల పక్కన, ఇతర ప్రదేశాల్లో వీరిని గుర్తించారు. ఇందులో 78మంది బాలురు, 32మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన బాలలు 9మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరందరినీ వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అదేవిధంగా ఇందులో భాగంగా 15మంది చైల్డ్ లేబర్లను, ఇద్దరు యాచకులను, ఇద్దరు వీధి బాలలను మొత్తం 102మందిని గుర్తించినట్లు అధికారికంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఇందుకు సంబంధించి నమోదయ్యాయి.

బాలల్లో నిరక్షరాస్యత నిర్మూలనే ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యం: ఎస్పీ సునీల్ దత్
చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమవ్వడం, లేదా ఆర్థిక స్థితిగతులు సహకరించకపోవడం వల్ల ఎంతోమంది బాల,బాలకలు నిరక్షరాస్యులుగా మిగులుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో కూలి పని చేయడం, యాచించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొందరు తల్లిదండ్రుల పర్యవేక్షణలోపాల వల్ల చిన్నారుల జీవితాలు చిధ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనాధలుగా మారుతున్న బాల,బాలికలను గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించడం కోసమే ప్రభుత్వ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో సమన్వయంగా వ్యవహరిస్తూ బాలకార్మిక వ్యవస్థను రూపు మాపడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది.

ఇందులో భాగంగానే జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లలో ఆపరేషన్ ముస్కాన్‌కు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఐసీపీఎస్ అధికారులు, సిబ్బందితో సంయుక్త ఆధ్వర్యం ప్రతీ సంవత్సరం ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి ఈ మూడేళ్లలో ఇప్పటి వరకు 679మంది బాలబాలికలను ఈఆపరేషన్‌లో భాగంగా గుర్తించాము. 106 మంది బాలబాలికలను బాలకార్మిక వ్యవస్థ నుంచి రక్షించాము. అదృశ్యమైన కేసులు చేధించి 29మంది బాల, బాలికలను తల్లిదండ్రుల చెంతకు చేర్చాము. మొత్తం 575మందిని తల్లిదండ్రులకు అప్పగించాము. ఇందులో 156మంది చిన్నారులను రెస్క్యూ హోంకి అప్పగించాము. ఈ ఆపరేషన్‌లో 569 మంది రాష్ర్టానికి చెందినవారు కాగా 72మంది బాల,బాలికలు ఇతర రాష్ర్టాలకు చెందినవారిగా గుర్తించాము. ఈ ఆపరేషన్ ద్వారా గుర్తించిన చిన్నారులను పాఠశాలలో చేర్పించడంలో ఇప్పటి వరకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాము.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles