ప్రభుత్వ ఆదేశాల మేరకే పెన్‌కల్చర్ ప్లాంట్ ఏర్పాటు

Sun,August 11, 2019 04:57 AM

మత్స్యశాఖ డిప్యూటీ డైరక్టర్ వి శ్రీనివాస్ వెల్లడి
కూసుమంచి: రాష్ట్రప్రభుత్వం చేపట్టిన నీలివిప్లవంలో భాగంగా తెలంగాణలోని ఐదు జలాశయాల్లో ఈఏడాది తొలిసారి పైలట్ ప్రాజెక్టుగా పెన్‌కల్చర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరక్టర్, తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య జనరల్ మేనేజర్ వీ.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని నాయకన్‌గూడెం వద్ద పాలేరు జలాశయం ఒడ్డున ఏర్పాటు చేస్తున్న పెన్‌కల్చర్ ప్లాంట్‌ను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారిగా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్లతో పాటు, నల్గొండ జిల్లా శాలిగౌరారం, సిద్ధిపేట జిల్లా శనిగరం, మెదక్ జిల్లా పోచారంలలో పెన్‌కల్చర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ప్లాంట్‌కు మత్స్యశాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేసిందని, వీటి ద్వారా ప్లాంట్ల ఏర్పాటు, అవసరమైన వలలు, తడికలు సమకూర్చుకోవాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటులో మత్స్యసొసైటీల సభ్యులు శ్రమదానం, కాపలా వంటిపనులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈప్లాంట్ల ఏర్పాటులో తమకు ఇప్పటివరకు నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

పెన్‌కల్చర్ ప్లాంట్ల ఏర్పాటుకు గత ఏడాది రాష్ట్రప్రభుత్వం 144 జీవో జారీచేసిందని, దీని ప్రకారమే తాము ఈప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈజీవో ప్రకారం 100 హెక్టార్ల కంటే అధికంగా ఉన్న జలాశయాలకు అనుబంధంగా పెన్‌కల్చర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గతంలో జలాశయాలకు దూర ప్రాంతాల నుంచి చేపపిల్లలను అధిక ధరలకు కొనుగోలుచేసుకుని, రవాణా చేయడం వల్ల అధిక శాతం చనిపోవడంతో పాటు, ఆర్థిక భారం అవుతుందని చెప్పారు. ఈపరిస్థితిని అధిగమించడానికి ఆ యా జలాశయాల శివారులో 0.5 శాతం భూమిలో పెన్‌కల్చర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం 144 జీవో జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఈప్లాంట్లలో 2 అంగులాల చేపపిల్లలను తె ప్పించి, 5 నుంచి 6 అంగులాల వరకు పెరిగే వరకు పోషించి, ఆతర్వాత జలాశయంలోకి వదలడం పెన్‌కల్చర్ ప్రక్రియ అని, ఇది రైతులు మడుల్లో నారుపోసి పెంచి, పెద్దాయ్యాక పొలాల్లో నాటు పెట్టడం లాంటిదని తెలిపారు.

గతంలో ఒక్కో చేప పిల్లను 130 నుంచి 150 పైసలకు కొనుగోలు చేసేవారమని, ప్రస్తుతం 30 నుంచి 40 పైసలకు చిన్న పిల్లలను కొనుగోలు చేసి, ఇక్కడ పెంచడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. మత్స్య సహకార సంఘాలు సహకరిస్తే భవిష్యత్‌లో చెరువుకు ఇతర శివారుల్లో కూడా పెన్‌కల్చర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వీలుందన్నారు. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య పరిధిలోని 4,600 సంఘాలు ఉన్నాయని, వీటన్నింటిని అనుసంధానం చేస్తూ టెబ్కాప్ తరహాలో సమాఖ్యను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రస్తుతం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద పలు పథకాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో వైరా ఎఫ్‌డీఓ శివప్రసాద్, పాలేరు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు ఉపేందర్, కార్యదర్శి ఏడుకొండల్, మాజీ అధ్యక్షుడు పిల్లి రాంబాబు, సభ్యులు వెంకయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles