జలకల

Sat,August 10, 2019 04:17 AM

-రిజర్వాయర్లలోకి వరద నీరు..
-పరవళ్లు తొక్కుతున్న గోదావరి
-కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత
ఇల్లెందు నమస్తే తెలంగాణ: ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చెరువులు ఉరకలు పెడుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి పోస్తూ నిండుకుండను తలపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఏకంగా కొందరు రైతులు వరినాట్లు వేస్తుంటే, మరికొందరు నార్లు పోసి ఖరీఫ్‌కు సిద్దమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రిజర్వాయర్లు సైతం నిండుకుండను తలపిస్తున్నాయి. కిన్నెరసాని , తాలిపేరు ప్రాజెక్టుల గేట్లను పలుమార్లు ఎత్తివేశారు. గోదావరి ఉగ్రరూపంతో దిగువకు పరవళ్లు తొక్కుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షం రైతుకు కొండంత అండనిచ్చింది. వరుసగా నాలుగు రోజుల పాటు వానలు దంచికొట్టడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కిన్నెరసాని , తాలిపేరు జలాశయాలు గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మొన్నటి వరకు కరువు కోరల్లో చిక్కుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇటీవల కురిసిన వర్షం ఊపిరిలూదింది. ఇల్లెందు, పినపాక, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజవర్గాలలో ఉన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెంలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అదే విధంగా ఇల్లెందు ఏజెన్సీలోని కిన్నెరసాని ఉపనది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికీ పలుమార్లు కిన్నెరసాని గేట్లను ఎత్తి గోదావరిలోకి వదిలారు. కొత్తగూడెం జిల్లాలో సుమారు 2400 చెరువులు, కుంటలు ఉన్నాయి. అందులో 90శాతం పైగా మత్తడిపోశాయి.

మొన్నటి వరకు ఖరీఫ్ కష్టమేనని భావించిన కర్షకులు ఖరీఫ్‌పై ఆశలు పెంచుకున్నారు. ప్రతీచోట వ్యవసాయానికి సన్నద్దమవుతున్నారు. జిల్లాలో 2400 చెరువులు, కుంటల కింద సుమారు 43వేల ఎకరాలు సాగవుతోంది. అంతేకాకుండా కిన్నెరసాని ప్రాజెక్టు కింద పదివేల ఎకరాలు, తాలిపేరు కింద 13.8 వేల హెక్టార్లు సాగవుతుంది. కిన్నెరసాని , తాలిపేరు జలాశయాల కింద పంటలకు ఢోకా లేదు. మరోపక్క గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. రెండు, మూడు రోజుల నుంచి భద్రాచలం వద్ద 46,47,48 అడుగుల నీటి మట్టంతో దిగువకు ప్రవహిస్తుంది. అధికారులు ఇది వరకే మొదటి ప్రమాద హెచ్చరిక చేశారు. లోతట్టు ప్రాంతాలన్నింటిని అప్రమత్తం చేశారు. నీట మునిగిన ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు. ఆయా క్లస్టర్లకు అధికారులు కేటాయించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇకపోతే జిల్లాలోని మెట్ట పంటలకు తిరుగులేకుండా పోయింది. జిల్లాలో పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, కూరగాయల పంటలు ఎక్కువగా పండుతాయి. ఇప్పటికే రైతులు సాగులో నిమగ్నమై ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మెట్టపంటలకు తిరుగులేకుండా పోయింది. భూగర్భ జలాలు సైతం ఊహించని విధంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న కిన్నెరసాని జలాశయం 8.4 టీఎంసీల సామార్థ్ద్యంతో నిలకడగా ఉంది. తాలిపేరు జలాశయం 0.73 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. తాలిపేరు జలాశయం నుంచి గోదావరిలోకి గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. కిన్నెరసాని నీటిమట్టం ఏమాత్రం పెరిగినా గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles