భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

Sat,August 10, 2019 04:13 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా రెండవ శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం) సందర్భంగా దేవస్థానం అర్చకులు శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో ఉదయం 7నుంచి 9గంటల వరకు పంచామృతాభిషేకం నిర్వహించారు. 9రకాల పండ్ల రసాలతో, 108 రకాల క్షీరములతో, ఆవు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో, సమస్థ నదీ తీర్థ్ధాలతో, తులసి మాలలతో, సహస్రదారాలతో, గంధోదకములతో అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా అభిషేకం గావించారు.

అంతరాలయంలో వేంచేసి ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి వారి తరుపున అర్చకులు శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి పట్టు పీతాంబరాలు తీసుకొచ్చి అలంకరింప చేశారు. మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు చిత్రకూట మండపంలో 1,108 భక్తురాళ్లచే లక్ష తులసి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవచనం తదితర పూజలు జరిపారు. ఆస్థాన స్థానాచార్యుల వారు వరలక్ష్మీవ్రతాన్ని భక్తులకు వివరించారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి దేవస్థానం తరుపున భక్తులకు పసుపు, కుంకుమ, ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం వచ్చి రామాలయానికి చేరుకొని శ్రీసీతారామచంద్రస్వామివారిని, శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles