తండాల్లో తీజ్

Thu,August 8, 2019 11:51 PM

-తండాల్లో తీజ్ వేడుక సందడి
-తరతరాల ఆచారాన్ని కొనసాగిస్తున్న లంబాడీలు
గ్రామాల్లో తొమ్మిది రోజులు ఆటపాటలు, నృత్యాలతో కోలాహలం
-పెళ్లి కాని యువతులకు ప్రత్యేకం

లక్ష్మీదేవిపల్లి/ఇల్లెందు రూరల్: బంజారాల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం తీజ్. ప్రతియేడు శ్రావణ మాసంలో అమ్మాయిలు నిష్టగా తొమ్మిది రోజులు జరుపుకునే పర్వదినం తీజ్. పండుగ వచ్చిందంటే బంజారా అమ్మాయిల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. పెళ్లికాని అమ్మాయిలు జీవితభాగస్వామిని వెదుక్కోవడానికి, భవిష్యత్తు మార్గదర్శకాన్ని ఎంచుకోవడానికి, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడే పండుగ తీజ్. తెలంగాణప్రాంతంలోని అమ్మాయిలు జరుపుకునే బొడ్డెమ్మకు దగ్గర పోలికలున్న పండుగ. తొమ్మిది రోజులు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో, ఆనంద పారవశ్యంతో జరుపుకుంటారు. బంజారాల సామూహిక జీవనంలోని సాంస్కృతిక, నైతిక, ఆధ్యాత్మిక, వివిధ కళానైపుణ్యాలు ప్రగతిపథంలో పయనించడానికి దోహదపడే సాంస్కృతిక సంప్రదాయాల విలువలున్న అతిపెద్ద గిరిజన పండగ ఇది. అలాంటి పండుగ ప్రతి తండాల్లో పెళ్లికాని అమ్మాయిలు నిష్టతో తొమ్మిదిరోజులు జరుపుకోవడం సంప్రదాయం. మండుటెండలు తగ్గి తొలకరి జల్లుల చల్లదనం ప్రసరించే తరుణంలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ప్రకృతి రమణీయంగా కనిపిస్తూ ఎటు చూసినా పచ్చిక బయళ్లు, చెరువులు, కుంట నిండ నీళ్లున్న సందర్భంలో అత్యంత ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవడం సదాచారం. ఆషాడ శ్రావణ మాసాల్లో కచ్చితమైన రోజు జరుపుకోవాలనే నియమం లేకపోయినప్పటికీ బంజారాలు జరుపుకునే మరో పండుగ దాటుడు రోజు, తీజ్ పండుగ తేదీని నిర్ణయిస్తారు. అష్టమి, నవమి తిథులు అమావాస్య నాడు పండుగరోజు రాకుండా జాగ్రత్త పడతారు.

పెద్దలను పూజించడం..
ఎనిమిదో రోజు గౌరీ గౌరమ్మల ప్రతిరూపంగా భావించే డోక్రీ, డోక్రాల ప్రతిరూపాలను మట్టితో చేసి ఆరాధిస్తారు. చెరువు నుంచి రేగడి మన్ను తెచ్చి ఆడ, మగ బొమ్మలను తయారు చేసి ఒకరిని డోక్రీ, మరొకరిని డోక్రాగా భావిస్తారు. బొమ్మలను పీటపై కూర్చుండబెట్టి ముందు భాగంలో తీజ్ బుట్టలు పెడతారు. వాటి ముందు హోమం కాల్చుతారు. అబ్బాయిలు బొమ్మలను ఎత్తుకొని ఎగిరేస్తూ అందుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అడ్డుకుంటారు. చివరకు బొమ్మలు నేలలో కలిసేటట్లు చేస్తారు. ఈ సందర్భంగా పాడే గీతాలు మానవ జీవితంలో దాగిఉన్న రహస్యాలను తెలియజేసే విధంగా కొనసాగుతాయి. అవి ఆయా అబ్బాయి, అమ్మాయిల వివాహం సంబంధానికి దారితీసి చర్చించడానికి ఉపయోగపడతాయి.

గంగలో కలపడం (ఓల్డి)..
భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పెంచిన తీజ్‌ను అందరికి పంచిపెట్టగా మిగిలినదానిని గంగలో (చెరువులో) కలుపడం ఆనవాయితీ. బుట్టలు ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో ఆటపాటలతో వేడుకగా చెరువుకు బయలుదేరుతారు. అంతకు ముందు మంచె మీద నుంచి బుట్టలు తీసేటప్పుడు మాత్రం అమ్మాయిలు ఏడవడం చూస్తే అందరిని కంటతడిపెట్టిస్తుంది. ఇన్ని రోజులు ఆత్మీయంగా, భక్తిశ్రద్ధలతో పెంచుకున్నది దూరుమవుతుందనే భావనతో అమ్మాయిలు ఏడుస్తుంటే తండా పెద్దలు, సోదరులు, దగ్గరి బంధువులు ఓదార్చి శాంతపరుస్తారు. చెరువుకు చేరుకున్న తరువాత బుట్టలను మొక్కి బతుకమ్మలను నీటిలో వదిలినట్లుగానే వదులుతారు.
ఉయ్యాల ఆటపాటలు..
తొమ్మిదో రోజు యువతులు ఉదయం అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఉయ్యాలకు సంబంధించిన పరికరాలను పందిరి దగ్గర సిద్ధం చేసుకుని ఉయ్యాల ఆటను ఆడుతారు. ఘణగోర్‌ను పట్టుకుని ఉయ్యాలతో పాటు ఆడిస్తారు. పాటలు పాడతారు.

తీజ్ నిమజ్జనం
తీజ్ పండుగ చివరిరోజైన తొమ్మిదోనాడు తీజ్‌ను నిమజ్జనం చేస్తారు. ఈ రోజు బంధుమిత్రులతో తండా అంతా కళకళలాడుతుంది. ఏ ఇంట్లోనైనా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. ఆత్మీయ పలుకరింపులతో సందడిగా మారుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు కొత్తబట్టలు ధరిస్తారు. తమ ఆరాధ్య దైవాలైనా మేరమా, సేవాబాయిలను భక్తితో పూజిస్తారు. ఇష్టమైన మొక్కుబడులు చెల్లించుకుంటారు. అమ్మాయిలు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పెంచిన తీజ్ బుట్టను నాయకుడు పరిశీలిస్తాడు. దీంతో ఆ సంవత్సరం కాలాన్ని అంచనా వేస్తాడు. తండా బాగోగులను తెలుసుకుంటాడు. అమ్మాయిల గుణగణాలను అర్థం చేసుకుంటారు. ఆ తరువాత ఎవరి బుట్టలను వారికి పంచుతాడు. అమ్మాయిలు మొదటగా తీజ్ నారను నాయకుడి రుమాలులోను ఆ తరువాత పూజారి, ఇతర నాయకుల రుమాల్లోను పెట్టి ఆశీర్వచనం తీసుకుంటారు. ఆ తరువాత సోదరులకు, మిగతావారికి తలా కొంత పంచుతారు. మిగిలినది నిమజ్జనం చేస్తారు.

సంబురాల సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే తీజ్ సంబురం వారి సంస్కృతికి చిహ్నం. బంజారాల జీవన విధానాన్ని ప్రతిబింబింపచేసే తీజ్ అమ్మాయిల భవిష్యత్తుకు మార్గదర్శకత్వానికి మార్గదర్శకంగా నిస్తుంది. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే సుమధుర, సుందర పర్వదినం తీజ్‌గా వెలుగొందుతుంది. ఇలాంటి పర్వదినం బంజారాల ఔన్నత్యాన్ని ఉనికిని ప్ర తిబింబిస్తూ అందరికి మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. తొమ్మిదిరోజులు సందర్భానుసారంగా పాటలు పాడుకుంటూ ఆడపిల్లలు ఆనందమయ జీవితాన్ని గడుపుతూ తండాకే వన్నె తెచ్చే పండుగ తీజ్ జరుపుకోవడం గర్వకారణం.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles