భూ సమస్యలపై గళమెత్తిన రైతులు

Wed,July 17, 2019 03:59 AM

వేంసూరు, జూలై 16 : గత కొన్ని సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులు ముప్పతెప్పలు పెడుతూ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరిగి విసిగి వేసారిన రైతులు కార్యాలయం ఎదుట కూర్చుని మంగళవారం ఆందోళన చేపట్టారు. చెరువు శిఖం భూములు, ముంపు భూములు, ఇనాం భూములు, ప్రభుత్వ భూములు అనే తేడా లేకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పాసు పుస్తకాల్లో ఎవరి డబ్బులు ఇస్తే వారి పేర్లు నమోదు చేస్తూ అసలైన రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ తమ ఆవేదనను ఆందోళన రూపంలో వెలిబుచ్చారు. తాతముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూములను సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధికారులు వేరే వారికి భూములను ఎక్కిస్తూ తమను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులపై మమకారంతో అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, ప్రధానమంత్రి నగదు యోజన వంటి పధకాలు తమకు ఎండమావిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో భూ సమస్యల పరిష్కారం జరగాలంటే వీఆర్‌ఏల చుట్టూ ప్రదిక్షణలు చేసి వారి ప్రసన్నం పొందిన తర్వాతే కార్యాలయం వైపు రావాల్సి వస్తుందన్నారు. అంతే కాకుండా రెవెన్యూ కార్యాలయంలో కొందరు బైట వ్యక్తులు దళారులుగా మారి అటెండర్ వద్ద నుంచి తహసీల్దార్ వరకు తాము చూసుకుంటామంటూ వారితో బేరం ఆడుకుని రైతు సమస్యలను కాలయాపన చేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని తమ ఆవేదనను పలువురు రైతులు వెలిబుచ్చుతున్నారు. రెవెన్యూ సిబ్బంది ఒకరి భూమిని మరొకరికి ఎక్కిస్తూ ఇదేమని అడిగితే తమకు తెలియదని, ఇది ఆన్‌లైన్ పొరపాటంటూ పొంతన లేని సమాధానం చెపుతూ, భూమి తిరిగి ఎక్కించుకోవాలంటే వారి చుట్టూ, కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. మండలంలో ప్రభుత్వం అందిస్తున్న కొత్త పాసు పుస్తకాలు రాక అనేకమంది రైతులు రైతుబంధు కోల్పోవడంతో పాటు రైతు మరణిస్తే బీమా సైతం రాకుండా పోవడంతో పాటు ఆ కుటుంబం వీధిన పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి మండలానికొక ప్రత్యేకాధికారిని నియమించి రైతుల సమస్యలను పరిష్కరిస్తే ఈ కార్యాలయంలోని రెవెన్యూ అధికారుల తీరుతెన్ను ఇలాగే కొనసాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో దృష్టి సారించి ప్రత్యేకాధికారితో భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే మరో మార్గం లేదని రైతులంటున్నారు. కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులతో తహసీల్దార్ శేఖర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. కార్యక్రమంలో రైతులతో పాటు రైతుకూలీ సంఘం నాయకులు కొత్తా సత్యం, మందలపు శ్రీనివాసరెడ్డి, అర్వపల్లి గోపాలరావు, జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles