దశాబ్దాల కల.. నెరవేరనున్న వేళ..

Mon,July 15, 2019 02:59 AM

ఇంటి యాజమాన్యపు హక్కుకు
జీవో విడుదల చేసిన కేసీఆర్ సర్కార్
తీరనున్న కొత్తగూడెం పట్టణవాసుల చిరకాల వాంఛ
హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్తగూడెం పట్టణ ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. స్వరాష్ట్ర పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా తన పాలనను సాగిస్తున్న సీఎం కేసీఆర్ తొలి ఏకదశి పండుగ నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటి యజమాన్యపు హక్కును క్రమబద్దీకరణ జీవోను విడుదల చేసి ఇంటి యజమానుల్లో సంతోషం నింపారు. పేదల పట్ల పెద్దమనసుతో ఆలోచించి అనుకున్నదే తడవుగా సీఎం కేసీఆర్ దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు పరిష్కారం చూపారు. దీంతో కొత్తగూడెం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. సమైక్య పాలనలో కాళ్లరిగేలా తిరిగినా ఎవరు పట్టించుకోక విసిగి వేసారిన ప్రజలకు జీవో నెంబర్ 76తో శాశ్వత పరిష్కారం లభించడంతో అంతులేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి యాజమాన్యపు హక్కును కల్పించిన సీఎం కేసీఆర్ తమ పాలిట దేవుడని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తూ బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకుంటున్నారు.

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కట్టుకున్న ఇళ్లకు, ఇళ్ల స్థలాలకు ఎలాంటి అధికారిక పత్రాలు లేవు. ఇప్పటి వరకు కేవలం ఇంటి నెంబర్లపైనే ఆధారపడి క్రయవిక్రయాలు చేసుకుంటూ వస్తున్నారు. దీని వల్ల ఆస్తులకు అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా లభించే పరిస్థితిలేదు. ఇక నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ జీవో నెంబర్ 76ను తీసుకువచ్చి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించనున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ వాటిపై హక్కు లేకపోవడం, ఆ తర్వాత దశాబ్దకాలంగా స్థల క్రమబద్ధీకరణ పట్టాల కోసం నిరీక్షించి, అలసిపోయి ఇక పట్టాలు రావేమో అనుకుంటున్న తరుణంలో వారి ఆశలకు జీవంపోస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సింగరేణిలో వారసత్వపు ఉద్యోగాలకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే సింగరేణి ప్రాంత ప్రజలకు ఇంటి యజమాన్యపు హక్కులు కల్పిస్తూ మరో కానుకను అందించారు. కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు నేడు పరిష్కారం లభించడంతో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంది.

ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు గెలిచిన అనంతరం పెండింగ్‌లో ఉన్న ఇంటి స్థలక్రమబద్ధీకరణ పట్టాల పంపిణీకీ హామీ ఇచ్చిన గెలిచిన అనంతరం అవసరమైన కసరత్తు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సంప్రదించి స్థలాలపై పూర్తిహక్కులు వచ్చే నూతన జీవో నెంబర్ 76ను సీఎం కేసీఆర్ ఆదేశాలతో జారీ చేయించారు. జీవో విడుదల తరువాయి క్రమంగా పట్టాల పంపిణీ ప్రక్రియకు అవసరమైన కార్యచరణను చేపట్టారు. ఎవరూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, దళారులను డబ్బులను వృథా చేసుకోవద్దని కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రమబద్ధీకరణ పట్టాలు పొందిన ఇంటి యజమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ టీఆర్‌ఎస్ పాలన, సీఎం కేసీఆర్ పథకాలు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గం కోసం చేస్తున్న కృషిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా విలువ లేని ఆస్తులకు స్థలాలకు లక్షలాది రూపాయల విలువ ఏర్పడనుంది. అనేక కుటుంబాలు తమకు ఈ పట్టాలు ఇవ్వడంతో విలువైన ఆస్తి సమకూరడంతో పాటు కుటుంబానికి భరోసా ఏర్పడనుందని చెప్పారు.

కొత్తగూడెం సింగరేణి బొగ్గు గని ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోని స్థలాలను ఆనాడు సింగరేణి యాజమాన్యం వంద సంవత్సరాలు బొగ్గు గనుల నిక్షేపాల కోసం లీజుకు తీసుకోవడం జరిగింది. 2005లో వంద సంవత్సరాల లీజు గడువు పూర్తయింది. దీంతో 2004లో కొత్తగూడెం నియోజకవర్గంగా గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వంద సంవత్సరాల లీజు పూర్తయిన అనంతరం ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు భూమిపై యాజమాన్యపు హక్కు కల్పించాలనే సదుద్దేశంతో ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి 373జీవోను విడుదల చేయించారు. ఈ జీవో ప్రకారం భూమిపై యాజమాన్యపు హక్కు, క్రయవిక్రయాలు, బ్యాంకు రుణాలు పొందుటకు, దానధర్మాలు చేసుకునేందుకు వారసత్వపు హక్కును కల్పించే విధంగా తీసుకువచ్చారు. ఈ జీవో ద్వారా సుమారు 12వేల మంది ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సుమారు 4600మందికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పట్టాలను పంపిణీని చేశారు.

ఆ తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసిన జలగం వెంకటరావు సుమారు రెండువందల మందికి జీవో నెంబర్ 171ప్రకారం ఇంటిపట్టాలను అందజేశారు. అనంతరం గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ప్రజలకు ఇంటిపై హక్కు కల్పించాలని కోరగా నూతన జీవోను 76ను విడుదల చేశారు. ఈ జీవోతో మళ్లీ కొత్తగూడెం పట్టణ ప్రజలకు ఎంతగానో లాభం చేకూరనుంది. ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. సుమారు 35వేల నుంచి 40వేల మంది ఇంటి పట్టాలను పొందే హక్కు కలుగనుంది. ఈ జీవో ప్రకారం వంద గజాలలోపు ఉన్న నిరుపేదలకు (దారిద్య్ర రేఖకు దిగువన -బీపీఎల్) ఉచితంగా రిజిస్ట్రేషన్, 100 గజాల నుంచి 500గజాలలోపు నివాసం ఉంటున్న వారికి గజానికి రూ.25చొప్పున, 501 నుంచి 1000గజాలలోపు స్థలాలో నివాసం ఉంటున్నవారికి రూ.250, వ్యాపార సముదాయాలవారికి 500గజాలలోపు ఉన్నవారికి గజానికి రూ.100చొప్పున, 501 గజాల నుంచి 1000 గజాలలోపు ఉన్నవారికి గజానికి రూ.500, 1000గజాలలోపు ఉన్నవారికి మార్కెట్ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునే యాజమాన్యపు హక్కు పొందే అవకాశాన్ని కల్పించనున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము..
ఇంటి పట్టా కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఇల్లు కట్టుకున్నప్పటికీ ఇంటి పట్టా లేకపోవడం వల్ల పట్టా కోసం దరఖాస్తు చేశాము. దశాబ్దకాలంగా పట్టా కోసం దరఖాస్తు చేసినప్పటికీ పట్టా ఎవరూ ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అనేక మంచి పనులు చేస్తున్నాడు. ఇంటిపై హక్కులు కల్పించాలని గతంలో ఎమ్మెల్యేను కోరాము. ఎన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న మాకు తొలి ఏకదశి రోజున తీపి కబురు అందింది. పట్టా వస్తే మాకు పూర్తి హక్కు కల్పించినట్లుగా ఉంటుంది.
-విజయ (గొల్లగూడెం)

ప్రభుత్వానికి రుణపడి ఉంటాము..
ఇంటి పట్టాలు ఇస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. ఇళ్లు కట్టుకున్న ఇంటి పట్టా లేకపోవడంతో కొంత ఇబ్బందిపడుతున్నాము. ఇల్లుపై పూర్తి హక్కు ఉండాలంటే పట్టాతోనే సాధ్యం. మాకైతే పట్టా వస్తే ఈ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-చిలక కౌసల్య(మేదరబస్తీ)

మాకు మంచి రోజులు వచ్చాయి..
ఏళ్ల కాలం నాటి భూ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మా మంచి ఎమ్మెల్యే వనమా సార్. భద్రత లేని జాగాలో ఇల్లు కట్టుకుని ఇంత కాలం ఆందోళనతో ఉన్నాము. ఇక అలాంటి భయం లేదు. పట్టా ఉంటే చాలు అదే మాకు ఆస్థి. ఎప్పుడు ఎవరు ఖాళీ చేయిస్తారో అర్థం కాదు. పట్టణ వాసులకు మంచి రోజులు వచ్చాయి.
-కల్యాణి (మేదరబస్తీ)

దశాబ్దకాలం సమస్యకు టీఆర్‌ఎస్
పరిష్కారం చూపిస్తుంది..
ఏళ్ల కాలం నాటి సమస్య పరిష్కారం అవుతుంది. చాలా కాలంగా ఎదురు చూశాను. పట్టాలేని భూమి ఉన్నా ప్రయోజనం లేదు. ఎన్నోసార్లు ఎంతో మందిని కలిశాము. అయినా పరిష్కారం కాలేదు. ఎమ్మెల్యే వనమా వల్ల మాకు పట్టా వస్తుంది. ఆయనకి రుణపడి ఉంటాము. తెలంగాణ ప్రభుత్వం హయాంలో మాకు పట్టా వస్తుంది. ఏకాదశి నాడు మంచి శుభవార్త విన్నాము. మాకు మంచి రోజులు వస్తున్నాయి. ఎంతో విలువైన భూమికి మోక్షం కలిగింది.
-జోగారావు(న్యూ గొల్లగూడెం)

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles