ఇల్లెందు మున్సిపాలిటీకి మహర్దశ..!

Mon,July 15, 2019 02:55 AM

- ఐదేళ్లలో మారిన ఇల్లెందు రూపురేఖలు
- డీఎంఎఫ్,ప్రత్యేక నిధులతో అభివృద్ధి
- అదనపు నిధులతో నూతన ఒరవడికి శ్రీకారం
- క్రమబద్ద్ధీకరణతో పాలకవర్గంపై ప్రశంసలు
- పురపోరులో సత్తా చాటనున్నటీఆర్‌ఎస్..


నిధుల వరదతో ఇల్లెందు మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోయాయి. సమైఖ్య పాలనలో ఇల్లెందు నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాథుడు లేడు.. మంత్రులు, ముఖ్యమంత్రుల దృష్టికి పాలకవర్గం తీసుకెళ్లిన వినతులు బుట్టదాఖలు అయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత మున్సిపాలిటీలకు మహర్దశ లభించింది.. ప్రత్యేకించి సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిక్ మినరల్ ఫండ్‌ను మంజూరు చేశారు. అంతేకాకుండా ప్రతీ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు విడుదల చేశారు.. దీంతో ఇల్లెందు మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోయాయి. గడిచిన ఐదేళ్లలో ఇల్లెందు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నది.. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పురపోరులో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు పట్టణ ప్రజలు సమాయత్తమవుతున్నారు.
-ఇల్లెందు నమస్తే తెలంగాణ

ఇల్లెందు నమస్తే తెలంగాణ : ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లెందుకు మున్సిపాల్లీ హోదా పోతుందని ప్రచారం జరిగింది. ఎందుకంటే సింగరేణి గనులు అంతరించిపోవడం, కార్మికుల సంఖ్య తగ్గడం అందుకు కారణం. ఫలితంగా జనాభా తగ్గుముఖం పట్టడం వలన మున్సిపాలిటీ హోదా కోల్పోతుందనే అంతా భావించారు. 2014 తరువాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరిగింది. తరువాత పరిణామాల వల్ల మున్సిపాలిటీ రూపురేఖలు మారుతూ వచ్చాయి. కొత్తపాలకవర్గం ఏర్పడటం, సీఎం కేసీఆర్ ఇల్లెందు మున్సిపాలిటీకి నిధులు కేటాయిండంతో ఇల్లెందు మున్సిపాలిటీ రూపురేఖలు మారిపోయాయి. అందుకు తోడు కొత్తగా ఇల్లెందు శివారు ప్రాంతాలు ఇల్లెందు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. సత్యనారాయణపురం, 24 ఏరియాలు ఇల్లెందు మున్సిపాలిటీలో విలీనం కావడంతో మున్సిపాలిటీ కొత్తరూపు సంతరించుకుంది. ఇకపోతే నిధుల వరద పారడంతో 2014 తరువాత ఇల్లెందు నూతన చరిత్ర సృష్టించింది.

మార్కెట్ అభివృద్ధికి భారీగా నిధులు..
ఇల్లెందు కూరగాయల మార్కెట్ అభివృద్ధికి 2014 తరువాత భారీగా నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఇన్‌ఫ్రాసెక్షన్ డెవలప్‌మెంట్ కార్పొరేట్ (టీయూఎఫ్‌ఐడీసీ) మంజూరు చేసింది. ఇల్లెందు మార్కెట్‌కు సుమారు రూ.9 కోట్లను కేటాయించింది. 196 గదుల కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు పాలకవర్గం ప్రతిపాదనలు చేసింది. కాగా కూరగాయలు, చేపలు, మటన్ మార్కెట్‌లన్ని ఒకే చోట ఏర్పాటు చేసేందుకు పాలకవర్గం రూపకల్పన చేసింది. పార్కింగ్ సమస్య లేకుండా, ఫుట్ పాత్ పై కూరగాయలు విక్రయించకుండా మార్కెట్‌లోనే విక్రయించే విధంగా పాలకవర్గం ప్రతిపాదన చేసి ఉంచింది. పనులు ప్రారంభమైతే ఇల్లెందుకు కొత్తకళ రూపుదిద్దుకోనుంది.

పోటెత్తిన నిధుల వరద
గడిచిన ఐదేళ్లలో మున్సిపాలిటీకి రూ.120 కోట్లు వివిధ గ్రాంట్ల ద్వారా నిధులు మంజూరయ్యాయి. డిస్ట్రిక్ మినరల్ ఫండ్ తరఫున రూ.38.08 కోట్లు, టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.28 కోట్లు, మిషన్ భగీరథకు రూ.27 కోట్లు, మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.4.5 కోట్లు, మినీ స్టేడియంకు రూ.3 కోట్లు, 14 స్కీం కింద రూ.3 కోట్లు, సీఎం స్పెషల్ స్కీం కింద రూ.5.25 కోట్లు, సీఎం స్పెషల్ ఫండ్ కింద కోటి రూపాయలు, నాన్‌ప్లాన్ గ్రాంటు కింద రూ.50 లక్షలు, ఆర్‌అండ్‌బీ గ్రాంటు కింద రూ.9.60 కోట్లు, పట్టణ క్రమబద్దీకరణ, మంచినీటి చెరువు పూడికతీతకు రూ.2 కోట్లు, హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు 14వ ఫైనాన్స్ కింద రూ.95 లక్షలు, అదే విధంగా టీయూఎఫ్‌డీఎస్ నిధులలో భాగంగా కోటిన్నర నిధులు మంజూరయ్యాయి.

ఇల్లెందులపాడు చెరువు బతుకమ్మ ఘాట్‌కు సుమారు కోటి యాభై లక్షలు, టీయూఎఫ్‌డీఐసీ నిధులు మంజూరు. ఇల్లెందు చెరువు వద్దనున్న లేక్‌పార్కును అభివృద్ధి చేసేందుకు కోటి యాభై లక్షలు. 14వ ఫైనాన్స్ నుంచి హరితహారం కింద డివైడర్ల మీద చెట్లు నాటుటకు రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. అదే విధంగా రూ.3 కోట్లతో టీయూఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా జేకే కాలనీలో ఆడిటోరియం నిర్మాణం, రూ.2 కోట్లతో టీయూఎఫ్‌ఐడీసీ నిధుల కింద చిల్డ్రన్స్ పార్కు, డిస్ట్రిక్ మినరల్ ఫండ్ కింద కోటి యాభై లక్షలతో మల్టీ యూటిలిటీ సెంటర్, కోటి ముఫ్పై లక్షలతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, 1 నుంచి 24 వార్డులలో సీసీ, డ్రైనేజీ నిర్మాణాలకు రూ.30 కోట్లు మంజూరు.

దశాబ్ధాల నిరీక్షణకు తెర..
ఇల్లెందు పట్టణ వాసులకు క్రమబద్దీకరణ కలగా మారింది. ఇల్లెందు పరిసర ప్రాంతానంతా సింగరేణి సంస్థ లీజులో ఉంది. ఫలితంగా క్రమబద్దీకరణకు నోచుకోలేదు. 2005లో సింగరేణి సంస్థ లీజు భూమిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఉంది. కాని ఉమ్మడి రాష్ట్రంలో అది సాధ్యం కాలేదు. ఆ తరువాత జేకే ఓసీ ప్రారంభమైంది. అది సాకుగా చూపి సింగరేణి సంస్థ యదావిధిగా లీజును కొనసాగిస్తూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం ఇల్లెందు క్రమబద్దీకరణ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే సీఎం కేసీఆర్ క్రమబద్దీకరణకు ఆమోదముద్ర వేశారు.

ఆరో దఫాకు రెడీ..
ఇల్లెందు మున్సిపాలిటీలో ఎన్నికలు సందడి షురూ అయ్యింది. ఇప్పటి వరకు ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికలు ఐదు సార్లు జరిగాయి. 1986లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. 1990లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అన్యూన్యంగా సీపీఎంకు చెందిన వై.వినయ్‌కుమార్ విజయం సాధించి చైర్మన్ అయ్యాడు. 1995లో కాంగ్రెస్‌కు చెందిన రాజమల్లు చైర్మన్ పదవిని అలంకరించాడు. 2000లో టీడీపీకి చెందిన అనసూర్య చైర్మన్ పదవిని చేపట్టింది. 2005లో కాంగ్రెస్ రెండో సారి జెండా పాతింది. ఎస్సీ రిజర్వుడ్ కావడంతో మొలబాబు చైర్‌పర్సన్ అయ్యాడు. 1990, 1995లో బీసీ జనరల్ కాగా, 2000లో ఎస్టీ మహిళా చైర్‌పర్సన్ అయింది. 2005లో ఎస్సీ జనరల్, 2014లో బీసీ మహిళా రిజర్వేషన్ ఖరారైంది. 2014లో మడత రమావెంకట్‌గౌడ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. ప్రస్తుతం మున్సిపాలిటీ రిజర్వేషన్‌కు అనుగుణంగా పార్టీలన్నీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి పాచికలు వేస్తున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరోమారు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు పట్టణ ప్రజలు సమాయత్తమవుతున్నారు.

నిధులు భారీగా మంజూరయ్యాయి..
గడిచిన ఐదేళ్లలో భారీ ఎత్తున నిధులు మంజూరయ్యాయి. నిధుల వరద పోటెత్తడంతో సీసీ, డ్రైనేజీలు తదితరవన్ని అభివృద్ధికి నోచుకున్నాయి. కూరగాయల మార్కెట్‌తో సహా తదితర అన్నింటికి మహర్దశ పట్టనున్నాయి. పలు అభివృద్ధికి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంత అభివృద్ది జరుగడానికి సీఎం కేసీఆరే కారణం. గడిచిన ఐదేళ్లలో రూ.120 కోట్ల నిధులు మంజూరుకావడం అరుదైన ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే ఇన్ని నిధులు మంజూరు కావడం సాధ్యమైంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఐదేళ్ల పాటు అవకాశం ఇచ్చిన ఇల్లెందు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా.
-మడత రమావెంకట్‌గౌడ్, ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్

77
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles