పట్టుబట్టి సాధించారు..

Mon,July 15, 2019 02:54 AM

తల్లాడ మండలంలో ఏడుగురు ఎస్సైలుగా ఎంపిక

తల్లాడ, జూలై13: పట్టుబట్టి లక్ష్యాన్ని సాధించారు. ప్రభుత్వ ఉద్యోగమే చేయాలనే తపనతో శ్రమించారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరూ చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ ఎస్సైలుగా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో తల్లాడ మండలం నుచి ఏడుగురు ఎస్సైలుగా ఎంపికయ్యారు. మండల పరిధిలోని కుర్నవల్లికి చెందిన పురంశెట్టి వీరనాగేశ్వరరావు ఎం.ఎ. ఇంగ్లీష్ వరకు చదువుకున్నాడు. ఫారెస్టులో బీట్‌ఆఫీసర్‌గా ఎంపికై ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం సివిల్‌ఎస్సైగా ఎంపికయ్యాడు. కుర్నవల్లికి చెందిన బొగ్గుల సాయికిశోర్‌రెడ్డి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి సివిల్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ సివిల్‌ఎస్సైగా ఎంపికయ్యారు. నారాయణపురం గ్రామానికి చెందిన రెడ్డెం నర్సిరెడ్డి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఎస్సైగా ఎంపికయ్యాడు. బీటెక్ పూర్తిచేసిన నర్సిరెడ్డి ప్రభుత్వం ఉద్యోగాన్నే లక్ష్యంగా ఎంచుకున్నాడు.

తల్లాడకు చెందిన గరిడేపల్లి శశిధర్ బీటెక్ వరకు చదివి పోస్టల్‌శాఖలో జాబ్‌చేస్తున్నాడు. ఎస్సై ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో టీఎస్‌ఎస్‌పీ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. తల్లాడకు చెందిన యద్దనపుడి శ్రీకాంత్ బీటెక్ వరకు చదివి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎస్సై ఫలితాల్లో సివిల్ ఎస్సైగా ఎంపికయ్యాడు. బాలపేటకు చెందిన పడాల కేశవరావు బీటెక్ వరకు చదివాడు. బీట్‌ఆఫీసర్‌గా, సివిల్‌కానిస్టేబుల్‌గా ఎంపికై ఉన్నాడు. ప్రస్తుతం ఎస్సై ఫలితాల్లో సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. అన్నారుగూడేనికి చెందిన ఇస్నేపల్లి నాగభిక్షం ప్రస్తుతం ఫారెస్టు ఎఫ్

బీవో, పంచాయతీ సెక్రటరీలుగా ఎంపికయ్యాడు.
ఎస్సై ఫలితాల్లో సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల లక్ష్యానికి అనుగుణంగా ఉద్యోగాలు సాధించిన ఈ విద్యార్థులను మండల ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.

ఎస్సైగా ఎంపికైన వీయం బంజరు వాసి
పెనుబల్లి, జూలై 13 : ఎస్సై ఫలితాల్లో వీయం బంజరుకు చెందిన వ్యక్తి ఎస్సైగా ఎంపికయ్యాడు. వీయం బంజరు రింగు సెంటర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్న ఎస్‌కే సుభాని, మహబూబ్‌బీ కుమారుడు ఎస్‌కే రఫీ 232 మార్కులు పొంది ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ఇటీవల తన తండ్రి ఆకస్మికంగా మృతి చెందినప్పటికీ పట్టుదలతో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి మండలంలోని కొత్త కారాయిగూడెంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే పట్టుదలతో ఎస్సై ఉద్యోగం పొందాలని ప్రయత్నించి, ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. రఫీ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడం పట్ల కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు.

ఎస్సైగా గిరిజన యువకుడి ఎంపిక
కామేపల్లి, జూలై 13: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు శనివారం విడుదల చేసిన ఫలితాల్లో మండల పరిధిలోని టేకులతండకు చెందిన గిరిజన యువకుడు భూక్యా వినోద్ ఆర్‌ఎస్సైగా ఎంపికయ్యాడు. టేకులతండకు చెందిన మాజీ సర్పంచ్ భూక్యా మంగీలాల్ కుమారుడు వినోద్ ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన తొలి ప్రయత్నంలో ఎస్సైగా ఎంపిక కావడం పట్ల తోటి స్నేహితులు, కుటుంబాకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ఎస్సైగా సూర్యాతండా యువకుడు
కారేపల్లి రూరల్, జులై13:తెలంగాణ స్టేట్‌లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్ట్ ప్రకటించిన ఫలితాల్లో కారేపల్లి మండల పరిధిలోని సూర్యాతండాకు చెందిన అజ్మీర అనిల్‌కుమార్ ఆర్‌ఎస్‌ఐగా ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్‌ఎస్‌పీ) 15వ బెటాలియన్‌కు రిజర్వ్ సబ్‌ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా అనిల్‌కుమార్ ఎంపికయ్యాడు. సూర్యాతండాకు చెందిన అజ్మీరా తావుర్యా-బుజ్జి కుమారుడైన అనిల్‌కుమార్ కారేపల్లిలోనే బీటెక్ పూర్తిచేసి ఎస్‌ఐ పరీక్షలో ప్రతిభ కనబర్చాడు. కుమారుడు ఆర్‌ఎస్‌ఐగా ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ఎస్సైగా షేక్ హుస్సేన్
బోనకల్లు, జూలై13: మండలంలోని జానకీపురం గ్రామం ముజ్జఫర్‌నగర్‌కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ ఆర్‌ఎస్సైగా ఎంపికయ్యాడు. 2012లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఖమ్మంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన ఎస్సై నియామకాల కోసం పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించడంతో ఆర్‌ఎస్సైగా ఎంపికయ్యాడు. ఈయన ఎంపిక పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles