రెబ్బవరంలో ఇద్దరు..

Mon,July 15, 2019 02:48 AM

వైరా, నమస్తేతెలంగాణ, జూలై13: మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సివిల్ ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. శనివారం విడుదలైన ఎస్సై ఫలితాల్లో రెబ్బవరం గ్రామానికి చెందిన ఇస్రం అశోక్, నిమ్మతోట జీనత్ తమ ప్రతిభ కనపర్చి సివిల్ ఎస్సై ఉద్యోగాలు సాధించారు. నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన అశోక్ ఎస్సై ఉద్యోగం సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. అశోక్ తల్లిదండ్రులు వెంకటి, యశోద కూలీ పని చేసి జీవనం కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం అశోక్ 0.25 మార్కుల తేడాతో కానిస్టేబుల్ ఉద్యోగ్యానికి ఎంపిక కాలేకపోయాడు.

దీంతో హైదరాబాద్ వెళ్లిన అశోక్ పట్టువీడని విక్రమార్కుడిలా ఎస్సై ఉద్యోగానికి సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులు కూలీ పనుల డబ్బులతో అశోక్ హైదరబాద్‌లో ఎస్సై కోచింగ్ తీసుకున్నాడు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాద్యాయుడిగా పని చేస్తున్న జాన్ కుమారుడు జీనత్ 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అప్పటి నుంచి జీనత్ ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకు 2017లో ఎఫ్‌సీఐలో ఉద్యోగం లభించింది. అయితే జీనత్ ఎస్సై ఉద్యోగం సాధించాలనే తపనతో ఒక వైపు ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఎస్సై ఉద్యోగ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యాడు. అనేక సార్లు మాక్ టెస్టులు రాయటంతోనే తాను ఉద్యోగం సాధించానని జీనత్ తెలిపారు. సివిల్ ఎస్సైలుగా ఉద్యోగాలు సాధించిన అశోక్, జీనత్‌లను వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ప్రత్యేకంగా అభనందించారు.

పట్టుదలతో ఎస్సై కొలువు
నేలకొండపల్లి, జూలై 13: మండలంలోని ముజ్జుగూడెం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను ఎస్సై ఉద్యోగాన్ని సాధించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన శ్రీను ఎంతో కష్టపడి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఎస్సై కావాలనే కలలుగన్న శ్రీను అహర్నిశలు కష్టపడి అందరితో పాటు ఎస్సై పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. చివరికి ఎస్సై ఉద్యోగాన్ని సాధించాడు. శ్రీనునుగ్రామ సర్పంచ్ ఉన్నం బ్రహ్మయ్య స్వీట్ తినిపించి అభినందించాడు.

తిరుమలాయపాలెంలో ముగ్గురికి
తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలానికి చెందిన ముగ్గురు ఎస్సై ఉద్యోగాలు సాధించారు. బీరోలుకు చెందిన బత్తిని రంజిత్ సివిల్ ఎస్సైగా ఉద్యోగం పొందాడు. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి మనోజ్‌రెడ్డి ఏఆర్ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ఈయన ప్రస్తుతం హైదరబాద్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. బీచరాజుపల్లికి చెందిన భూక్యా కుమార్ ఏఆర్ ఎస్‌ఐగా ఉద్యోగం సాధించాడు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.


పాలెం కార్యదర్శికి ఎస్సై కొలువు
రఘునాథపాలెం, జులై13: రఘునాథపాలెం మండలానికి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ఎస్సై కొలువు దక్కింది. హర్యాతండా పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అమర్లపూడి విశ్వతేజకి ఖాకీ కొలువు లభించింది. ఎస్సీ క్యాటగిరిలో 237మార్కులు సాధించి సవిల్ ఎస్సై కొలువు కొట్టేశాడు. ఎస్సై ఉద్యోగం సాదించడంతో మండలంలో జూనియర్ కార్యదర్శులు విశ్వతేజను అభినందించారు.

ఎస్సైగా ఇద్దరు
మధిరరూరల్ : మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన పారుపల్లి భార్గవ్ ఎస్సైగా ఉద్యోగాన్ని సాధించాడు. గ్రామానికి చెందిన పారుపల్లి వెంకటేశ్వరరావు, నాగలక్ష్మీ దంపతుల కుమారుడు భార్గవ్ బీకెట్ కంప్యూటర్స్ చదివి ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ఈ క్రమంలో శనివారం విడుదలైన ఫలితాల్లో ఎస్సైగా ఉద్యోగం సాధించాడు. అదేవిధంగా మధిర ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రావూరి మురళీకృష్ణ ఏఆర్ ఎస్సైగా ఉద్యోగాన్ని సాధించాడు. మురళీకృష్ణను మధిర ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు అభినందించారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles