సాగు ప్రశ్నార్థకం..

Thu,July 11, 2019 01:31 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: వ్యవసాయ సీజన్‌లో సంక్షోభం ఏర్పడింది. దాదాపు దశాబ్దాల కాలం తరువాత ఖరీఫ్ సీజన్‌లో తొలిసారిగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. వర్షాలు ఆలస్యం కావడంతో అటు రైతులు, ఇటు అధికారులు సీజన్‌పై చర్చించుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మరో పక్షం రోజులు వ్యవధి ఉండటంతో ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం వ్యవసాయ ప్రణాళిక అమలు జరగడం ఆలస్యమవుతోంది. దీంతో రైతులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ అధికారులు ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సమూల మార్పులు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంటల సాగు చేయించాలని జిల్లావ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఖరీఫ్‌లో సాధారణ సాగు 1,24,621 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేసుకోవడానికి అంచనా వేశారు. దాదాపు 40 రోజుల పాటు ఖరీఫ్ కాలం పూర్తైనప్పటికీ ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రణాళికను సిద్ధం చేశారు. వర్షాధారంపై ఆధారపడే వరి, పత్తి పంటల స్థానంలో ఇతర పంటలను సాగు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ నెలలో వర్షం పడకపోతే ఏ విధమైన పంటలు వేయాలి, జూలై 15 వరకు వర్షాలు పడకపోతే ఎలాంటి పంటలు సాగు చేయాలి, జూలై 30 వరకు వర్షాలు పడకపోతే ఏం చేయాలి, ఆగస్టులో కూడా వర్షాలు పడకపోతే ఎలాంటి ఏర్పాట్లు చేసి ఎలాంటి పంటలు సాగు చేయాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 46,477 హెక్టార్లలో పత్తి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 12వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. దీంతో సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది.

జిల్లాలో అరకొరగా పంటల సాగు..
జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడక సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జిల్లావ్యాప్తంగా 1,24,651 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణం కాగా, 2018 సంవత్సరంలో జూన్ నెలలో 31,379 హెక్టార్లలో వర్షాధార పంటలు సాగు చేసి 25శాతం సాగు విస్తీర్ణం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 21,334 హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేయగా 17శాతం సాగు విస్తీర్ణం నమోదైంది. ఇందులో ఇప్పటి వరకు వరి పంటను ఎవరూ సాగు చేయకపోగా మొక్కజొన్న పంట సాధారణ విస్తీర్ణం 6304 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 524 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటను వేశారు. పెసర 227 హెక్టార్లకు 62, మినుము 64 హెక్టార్లకు 12, కందులు 1198 హెక్టార్లకు 67, పత్తి 46,477 హెక్టార్లకు 12 వేలు, ఇతర నూనె గింజల పంటలు 6531 హెక్టార్లకు 5427 హెక్టార్లలో రైతులు పంటలను వేశారు. వాణిజ్య పంటలైన మిరప, ఇతర ఆహార పంటలు గత ఏడాది 19,404 హెక్టార్లలో సాగు చేయగా ఇప్పటి వరకు 5682 హెక్టార్లలో మాత్రమే రైతులు ఈ పంటలను సాగు చేశారు.

లోటు పూడ్చేందుకే ప్రత్యామ్నాయ పంటలు
జూన్‌లో వర్షాలు పడలేదు.. జూలై 10వ తేదీ అయినా చిరుజల్లులకే పరిమితం అయింది. ఇంకా కొన్ని రోజులు పోతే ఖరీఫ్ కాలం కూడా పూర్తైపోతుంది. సాధారణ విస్తీర్ణం సాగు ఎలా జరుగుతుందనే ప్రశ్నలు రైతుల మదిలో మెదులుతున్నాయి. ఈ లోటును పూడ్చేందుకే తక్కువకాల వ్యవధిలో చేతికొచ్చే వరి రకం పంటను సాగు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే అంచనాలకు సంబంధించిన వరి విత్తనాలు, కందులు, పెసర్లు, మినుములు, మొక్కజొన్న, ఇతర అపరాల పంటలను రైతులు పండించుకునేందుకు విత్తనాలను సిద్ధం చేశారు. ఏయే పంటలు ఎంత తక్కువ సమయంలో చేతికొస్తాయనే అంచనాలతో వ్యవసాయ అధికారులు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు.

జిల్లాలో గత ఏడాది జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 144.8 మిల్లీమీటర్లు ఉండగా, 202.4 మిల్లీమీటర్ల వర్షం పడి 31.8 శాతంగా వర్షపాతం నమోదైంది. దీంతో గత ఏడాది రైతులు వర్షాధార పంటలను అధిక హెక్టార్లలో సాగు చేశారు. కానీ ఈ సంవత్సరం జూన్ మాసంలో ఇప్పటి వరకు 63.3 మిల్లీ మీటర్ల వర్షం పడి -54.2 శాతంగా వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూలై నెలలో 328.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, 376.8 మిల్లీమీటర్ల వర్షం పడి 14.6 శాతం వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూలై 9వ తేదీ నాటికి 326.8 మిల్లీ మీటర్ల వర్షం పడింది. గత ఏడాది జూలై నెలకు 376.8 మిల్లీ మీటర్ల వర్షపాతానికి గాను 328.9 మిల్లీమీటర్ల రవ్షపాతం నమోదైంది. కానీ ఈ ఏడాది జూలై 9వ తేదీ నాటికి 65.5 మిల్లీ మీటర్లకు గాను 95.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -31.4 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.

వర్షాలు లేకపోతే ముందస్తు అంచనాలు కూడా వేశాం..
జూలై నెలలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ చెప్తోంది. ఒకవేళ వర్షాలు పడని పక్షంలో రైతులకు అండగా ఉండేందుకు వర్షాలు లేకపోయినా ఆరుతడి పంటలు వేసుకునేలా అపరాల సాగుకోసం విత్తనాలను సిద్ధం చేసే ప్రణాళికను తయారు చేశాం. జనుము, పెసర్లు, మినుములు, కందులు, బొబ్బర్లు పంటను వేసుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారందరికీ ఇప్పటికే పెట్టుబడి సాయం అందిస్తున్నాం.
-కొర్సా అభిమన్యుడు, డీఏవో

సభ్యత్వ నమోదును ముమ్మరం చేయాలి..
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు
దుమ్ముగూడెం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, పార్టీ సభ్యత్వాన్ని ముమ్మరం చేయాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దుమ్ముగూడెం గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రతీ గ్రామంలోని ప్రజలకు సభ్యత్వాన్ని అందజేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. అదేవిధంగా సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికి ఇన్సూరెన్స్ సౌకర్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎండీ జానీపాషా, పూజారి సూర్యచందర్‌రావు, కరుకు నర్సింహరావు, మల్లూరు, రాజు, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles