భూ హక్కుల కోసం.. తహసీలాఫీసు ఎదుట అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

Wed,July 10, 2019 01:11 AM

కూసుమంచి, జూలై9: వారసత్వభూమికి హక్కులు కల్పించకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెలు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై అశోక్‌రెడ్డి వెంటనే అక్కడకు చేరుకుని, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారిస్తానని చెప్పి, వారిని అక్కడ నుంచి పంపించారు. తహసీలాఫీసులో రికార్డుల ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన వడ్డింపుల శేషయ్యకు జీళ్లచెరువు రెవెన్యూ పరిధిలో సర్వే నెం/450/101/ లో 1.17 ఎకరాల భూమి ఉంది. శేషయ్యకు ఇద్దరు భార్యలు. దీనిని మొదటి భార్య కూతురుకు కుమ్మరికుంట్ల పద్మకు 1995లో పసుపుకుంకుమల కింద ఇచ్చారు. శేషయ్య మృతి చెందిన తర్వాత దీనిలో ఒక ఎకరం కుమ్మరికుంట్ల పద్మ పేరిటపట్టాకాగా, మిగిలిన 17 కుంటలు శేషయ్య రెండో భార్య కుమ్మరికుంట్ల వీరమ్మ అనుభవదారునిగా నమోదైంది. కాగా 2018లో ధరణి వెబ్‌సైట్ వచ్చాక రెవెన్యూ అధికారులు వడ్డింపుల వీరమ్మకు 1.17 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకం, కుమ్మరికుంట్ల పద్మకు ఒక ఎకరం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. వాస్తవంగా వీరమ్మకు 17 కుంటలు మాత్రమే ఉండాల్సిఉండగా, రెవెన్యూ అధికారులు అక్రమంగా 1.17 ఎకరాలకు పాసుపుస్తకం ఇచ్చారని పద్మ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా వీరమ్మ కూతుళ్లు శారద, బేబీ ఈభూమిపై పూర్తి హక్కులు మావేనని, ఆమేరకు గతంలో ఒప్పందం జరిగిందని చెప్తున్నారు. పద్మకు హక్కులేనందునే పూర్తి 1.17 ఎకరాలు తమ తల్లిపేరిట పట్టాదారు పాసుపుస్తకం వచ్చిందని, పద్మ పేరిట ఉన్న పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దుచేయాలంటూ వారు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. రెవెన్యూ అధికారులు తమ సమస్య పరిష్కరించకుండా ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయనందునే తాము ఈచర్యకు పూనుకున్నట్లు వారు తెలిపారు. పోలీసుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

తమ పరిధిలో లేదు..-జే.స్వర్ణ, తహసీల్దార్, కూసుమంచి
గతంలో పనిచేసిన అధికారులు ఒకే భూమికి బైనంబర్లు వేసి ఇద్దరికి పట్టాదారుపాసుపుస్తకాలు జారీ చేశారు. దీనిని ఎవ్వరో ఒకరిది రద్దుచేసి, మరొకరికి అప్పగించడం తమ పరిధిలోది కాదు. రికార్డులన్నింటికీ పరిశీలించి, దీనిపై ఆర్డీవో కోర్టులో కేసు వేసుకోవాలని గతంలో వారికి చెప్పాం. అయినా వారు వినకుండా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles