22 అంశాల్లో యువతకు తర్ఫీదు

Mon,July 8, 2019 03:21 AM

(ఖమ్మం, నమస్తే తెలంగాణ):తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగ యువతతోపాటు చదువు మధ్యలో మానేసి ఖాళీగా ఉంటున్న వారికి, వివిధ వృత్తులపై ఆధారపడిన వారికి.. ఉపాధి కల్పించేందుకు వివిధ వృత్తి విద్యా కోర్సులలో ఉచిత శిక్షణలను అందించేందుకు నిర్ణంచింది.

తొలుత 5 జిల్లాల్లో అమలు
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది వివిధ కోర్సులలో వృత్తి నైపుణ్య శిక్షణలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా కేంద్రాలలో సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో 22 విభాగాలలో శిక్షణలు ఇచ్చేందుకు నిర్ణయించారు. దీనికి గాను ఖమ్మం జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో గల జిల్లా యువజ సర్వీసుల శిక్షణ కార్యాలయంలో నైపుణ్య శిక్షణలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరులో రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించే ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్, మొబైల్ సర్వీసింగ్, సీసీ టీవీ రిపేరు, కంప్యూటర్ ట్రైనింగ్, ఏసీ రిపేరు తదితర విభాగాలలో బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు బ్లౌజ్ డిజైనింగ్, డ్రెస్ డిజైనింగ్, బ్యూటీపార్లర్, అడ్వాన్స్‌డ్ హెయిర్ కటింగ్, మోహందీ డిజైన్స్ తదితర వాటిల్లో కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రజల అవసరాలను, ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది ఆధారపడే రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రజలకు అవసరమయ్యే వాటిని గుర్తించి, వాటిలో శిక్షణ ఇచ్చినట్లయితే ఉపాధి దొరికేందుకు అవకాశం ఉంటుందని యువజన సర్వీసు శాఖ భావించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా దృష్టి సారించి డిమాండ్ ఉన్న కోర్సులను ఎంపిక చేశారు. ఈ శిక్షణ కేంద్రం ఖమ్మంలో ప్రారంభం కాగానే జిల్లాకు చెందిన పలువురు యువత ఆదరిస్తారనే విశ్వాసాన్ని ఆ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యం..
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో పలు వృత్తి నైపుణ్య శిక్షణలు ఇవ్వడానికి సిద్ధమయింది. దీని కోసం తెలంగాణలోని ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. అయితే ఏదో నామమాత్రపు కోర్సులలో శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకునే విధానం కాకుండా వృత్తి నైపుణ్యతను పెంచడంతోపాటు తమంతట తాము జీవనోపాధిని పొందే విధంగా తర్ఫీదును ఇవ్వనున్నారు. ప్రస్తుత సమాజంలో డిమాండ్ ఉన్న కోర్సులను మాత్రమే ఎంపిక చేశారు. ముఖ్యంగా ఈ రోజున ప్రతి చోటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి దుకాణంలో, కార్యాలయంలో, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాలను ఇన్‌స్టాల్ చేసే వారుకానీ, రిపేర్ చేసే వారుకాని తగిన సంఖ్యలో లేరు. దీంతో వినియోగదారులకు సరైన సమయంలో సేవలు పొందలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాట్లు, మరమ్మతులపై శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. తద్వారా అనేకమందికి ఉపయోగం కలగనుంది. అదే విధంగా ప్రస్తుత వ్యవస్థలో పసిపిల్లవాడి నుంచి పండు ముసలి వరకు సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. నిత్యావసరాలలో సెల్‌ఫోన్ కూడా చేరిపోయింది. ఒక్కొక్కరూ తమ స్థాయికి తగిన విధంగా వేలాది రూపాయలు వెచ్చించి సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏ చిన్న రిపేరు వచ్చినా దానికి మరమ్మతులు చేసే వారు కరువయ్యారు. ఒకవేళ కొద్ది మంది

ఉన్నప్పటికీ వారు చెప్పినంత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని పరగణించిన ప్రభుత్వం ఎక్కువ మందికి సెల్‌ఫోన్స్ రిపేర్స్‌పై శిక్షణను ఇస్తే వినియోగదారులకు తక్కువ ధరలోనే సేవలన అందించే అవకాశాన్ని గుర్తించింది. దీంతోపాటు ఏసీల వినియోగం కూడా పెరిగింది. ఈ విషయంలో కూడా తక్కువమందే ఉన్నారు. రోజురోజుకూ ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మార్పులు వస్తున్నాయి. దీనిలో కూడా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

నెలాఖరులో వృత్తి నైపుణ్యత శిక్షణ కేంద్రం ప్రారంభం
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నాం. నామమాత్రపు ఫీజులతో 22 అంశాలలో శిక్షణ ఇస్తాం. ఆయా రంగాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులను శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేయనున్నాం. కలెక్టర్ కర్ణన్ నేతృత్వంలో ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మెటీరయల్ మొత్తం జిల్లాకు చేరింది. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా ఉపాధికి అవకాశం ఉంటుంది.
-మందపాటి పరంథామరెడ్డి, జిల్లా యువజన క్రీడలాధికారి

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles