రైతులకు అండగా వ్యవసాయ శాఖ

Mon,July 8, 2019 03:18 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జూలై 7 : ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ఏదో రూపంలో నష్టం జరుగుతూనే ఉంది. అలాంటి అమాయక రైతులను ఆసరాగా చేసుకుంటున్న విత్తన డీలర్లు నకిలీ విత్తనాలను విక్రయించి మోసం చేయడంతో రైతన్నలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ప్రతీ ఏటా ఏదో మండలంలో ఎక్కడో ఒక చోట పత్తి గింజలు మొలవక పత్తి రైతులు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పంట పెట్టుబడి సాయం అందించినా చివరికి ఎక్కడో చోట మోసానికి గురి కావాల్సి వస్తోంది. ఇక నుంచి అలాంటి మోసాలకు గురి కాకుండా వ్యవసాయ అధికారులు టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేసి ముందస్తుగా విత్తన షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న టాస్క్‌ఫోర్స్ టీమ్ దాడులతో విత్తన డీలర్లు అప్రమత్తమయ్యారు. బీజీ-3 పై నిఘా పెట్టడంతో రైతులకు నకిలీ పత్తి విత్తనాల బెడద తప్పింది. ప్రభుత్వం నిషేధించిన బీజీ 3 విత్తనాలు రహస్యంగా విక్రయించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వ్యవసాయ శాఖ ఉపక్రమించింది. ఇప్పటికే విత్తన షాపులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి దాడులను ముమ్మరం చేసింది.

షాపులపై టాస్క్‌పోర్స్ దాడులు
నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకు పంపుతామంటూ చట్టాన్ని పటిష్టం చేసిన ప్రభుత్వం అధికారులకు పూర్తి స్థాయి అధికారాలను అప్పగించింది. దీంతో బీజీ 3 విత్తనాలు పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో విత్తన డీలర్లు షాపుల్లో నకిలీ విత్తనాల జాడనే మార్చేశారు. అక్కడక్కడ విత్తన డీలర్లు గతంలో తీసుకొచ్చిన నకిలీ విత్తనాలను విక్రయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అధికారుల అప్రమత్తంతో పట్టుబడక తప్పడం లేదు. ఇప్పటికే జిల్లాలో 9 కేసులు టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఉన్న వ్యవసాయ, పోలీస్ అధికారులు ప్రతీ రోజు ఒక మండలంలో షాపులను తనిఖీ చేసి విత్తన డీలర్లు స్టాక్ వివరాలను ఏయే కంపెనీలు విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారో పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.60 లక్షల ఎకరాల పత్తి సాగు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే 60 వేల ఎకరాల్లో రైతులు పత్తి విత్తనాలు వేసినట్లు సమాచారం. జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రైతులు బీజీ-3 విత్తనాలు సాగు చేస్తుండగా వ్యవసాయ అధికారులు పట్టుకొని వాటిని ఎవరు విక్రయించారనే దానిపై దర్యాప్తు కూడా చేస్తున్నారు.

రైతులు నష్టపోకుండా పటిష్ట చర్యలు
రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా నిషేధిత పత్తి విత్తనాలను విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. టాస్క్‌ఫోర్స్ బృందం జిల్లా అంతటా పర్యటించి నిఘా పెంచారు. సమాచారం వచ్చిన వెంటనే షాపులను తనిఖీ చేసి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీజీ 3 విత్తనాలను కొనుగోలుచేయవద్దని రైతులకు సమావేశాల ద్వారా చెప్పాం. విత్తన డీలర్లు, ఫెస్టిసైడ్ డీలర్లకు ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి కఠిన ఆదేశాలు జారీ చేశాం. అక్రమంగా విక్రయిస్తే చర్యలు తప్పవు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 317 విత్తన డీలర్ల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేశారు.
- కొర్సా అభిమన్యుడు, డీఏవో

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles