ఆక్రమణలపై ఉక్కుపాదం..

Sun,July 7, 2019 12:53 AM

-మార్కెట్ పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత
ఖమ్మం నమస్తే తెలంగాణ : ప్రభుత్వ స్థలం కనబడితే చాలు.. తెల్లారే సరికి డబ్బా కొట్లు, పాన్‌షాప్‌లు వెలుస్తాయి. లేదంటే నాలుగు ఇటుకపెళ్లలు పెట్టి తాము పేదలంటూ నిర్మాణాలు చేపడతారు. నిజమైన నిరుపేదలు, ఇండ్లు లేని అభాగ్యులు నిర్మించారంటే ఎవరు ఏమి అనరు. కాని ఒక వామపక్ష పార్టీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కొరకు బినామి వ్యక్తులతో ఖమ్మం నగరంలోని పలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఇదే పనిగా ఆ పార్టీలోని కొద్ది మంది వ్యక్తులు వ్యవహరిస్తుండటంతో నిజమైన కార్యకర్తలు కూడా ఇదేమిటని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారు. నగరంలో ఒకచోట ఇల్లు ఉంటుంది. మరొక చోట ఇల్లు లేనట్లుగా డబ్బా కొట్టుతో ఆక్రమణలు కొనసాగుతాయి. తీరా ప్రభుత్వ అధికారులు వాటిని తొలగించాలని ప్రయత్నిస్తే రాజకీయరంగు పులుముకుంటుంది. అప్పటికప్పుడే దీక్షలు చేస్తారు. ధర్నాలకు ఉపక్రమిస్తారు. ఈ పొకడను చూస్తున్న పలువురు ప్రజలు ఆ పార్టీ తీరుపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగర వ్యవసాయ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో స్థలాలను ఆక్రమించుకొని బడ్డీ కొట్టు, చిన్న, చిన్న గృహాలు ఏర్పాటు చేసుకున్న వారిపై నగర కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత కొద్ది నెలలుగా ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకోవడం, అధికారులు అనేక మార్లు హెచ్చరించిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకవచ్చిన రైతులు, వ్యాపారులు, కార్మికులు సైతం ఇబ్బందులకు గురి అవుతున్నారు.

దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకుగాను మార్కెట్ కమిటీ అధికారులు ఈ సమస్యపై నగర కార్పొరేషన్ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో శనివారం నగర కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి తొలింగించడం జరిగింది. ఉదయం భారీగా పోలీసులు చేరుకోవడం, కార్పొరేషన్ అధికారులు జేసీబీలతో రావడంతో ఒక్కసారిగా మార్కెట్ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను నగర ఏసీపీ వెంకట్రావ్, త్రీటౌన్, వన్‌టౌన్ సీఐ షుకూర్, రమేష్‌లు పోలీస్ బందోబస్తు చేపట్టారు. అనంతరం ఆయా బడ్డీ దుఖానాల యజమానలు స్వచ్ఛందంగా బడ్డీ కొట్లను అక్కడి నుంచి తీసివేయడం జరిగిది. అక్రమణలను కార్పొరేషన్ అధికారులు జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ సురేష్, రామచందర్, బిల్డింగ్ ఇంజనీర్ భాస్కర్, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి సంతోష్‌కుమార్, మార్కెట్ కమిటీ అధికారులు, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles