నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..

Sun,July 7, 2019 12:52 AM

-32 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే సండ్ర
సత్తుపల్లి నమస్తే తెలంగాణ, జూలై 6: నియోజకవర్గంలో మూడు మండలాలకు చెందిన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 32 మందికి శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 32 మందికి సంబంధించి రూ.22లక్షల చెక్కులను అందించినట్లు తెలిపారు. తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుమారు రూ.కోటి మొత్తాన్ని సీఎం సహాయనిధి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందించానన్నారు. ఇటీవల కల్లూరు మండలానికి చెందిన నిరుపేద ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో సుమారు రూ.40లక్షల ఆసుపత్రి ఖర్చు చేయాల్సి రాగా ఆయనకు రూ.15లక్షలు నగదును సీఎం సహాయనిధి నుంచి మంజూరు చేయించానన్నారు.

ప్రస్తుతం వైద్యం సామాన్యునికి అందని ద్రాక్షగా మారిందని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సంపన్నులకు తప్ప నిరుపేదలకు అత్యవసర వైద్యం ప్రాణాల మీదకు తెస్తుందన్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిపై కూడా ప్రభుత్వం వైద్యం అందుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తుందని, అదే స్థాయిలో అన్ని వైద్యశాలలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
ఈ క్రమంలోనే ఆసుపత్రుల్లో నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారన్నారు. వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన ఓ రైతు ఇటీవల వ్యవసాయ మోటారుకు ప్యూజు వేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురి కావడంతో తీవ్ర గాయాలయ్యాయి.

అతనికి వైద్యఖర్చులకు సుమారు రూ.14లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇటువంటి నిస్సహాయులను, నిరుపేదలను ఆదుకునే క్రమంలో 40 నుంచి 60 శాతం వరకు సీఎం సహాయనిధి నుంచి నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. శనివారం పెనుబల్లి మండలానికి చెందిన 15 మందికి, వేంసూరు మండలానికి చెందిన ఏడుగురు, సత్తుపల్లి మండలానికి చెందిన 10 మందికి మొత్తం 32 మందికి గాను రూ.22లక్షల విలువ గల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles