హరితహారంలో అందరి భాగస్వామ్యం ఉండాలి..

Sat,July 6, 2019 01:37 AM

- నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి
- హాజరైన కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జేసీ అనురాగ్ జయంతి
ఖమ్మం, నమస్తే తెలంగాణ : హరితహారంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ప్రజాప్రతి నిధులు కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిలు సూచించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణకు హరితహారం ఐదవ విడత ఏర్పాట్లపై వారు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత నాలుగు విడతల హరితహారం కింద రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను నాటినట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం 100 కోట్ల మొక్కలను నాటాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తదనుగుణంగా ఈ సంవత్సరం ప్రతి పంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. మంచి వర్షాలు కురిసేందుకు తెలంగాణలో అటవీ విస్తరణను పెంచే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండి చెట్టుగా ఎదిగనప్పుడే పచ్ఛదనం పెరుగుతుందని, ప్రతి మొక్క ఎదిగే వరకు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని మంత్రి అన్నారు. రెవెన్యూ అటవీ భూముల వివాదాలను పరిష్కరించాలని దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారంను పటిష్టంగా అమలు చేసేందుకు అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో పాటు అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. హరితహారం లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు మండల, గ్రామస్థాయిలో నోడల్ అధికారులను నియమించాలని కలెక్టర్లకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా హరితహారంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా అటవీ, రెవెన్యూ సంబంధించిన భూవివాదాలను త్వరగా పరిష్కరించాలని ఆయన జిల్లా కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, సహాయ కలెక్టర్ హన్మంతుకొడింబా, జిల్లా అటవిశాఖ అధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి బీ ఇందుమతి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుబ్బారావు, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు నర్సింహరావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles