దర్యాప్తు సమగ్రంగా చేయని ఎస్‌ఐకి జరిమానా

Sat,July 6, 2019 01:33 AM

ఖమ్మం లీగల్ :కేసు పూర్వాపరాలు, చట్టబద్ధత, విచారణ అర్హతను పరిశీలించకుండా తప్పుడు దర్యాప్తు చేసి, ఒక వ్యక్తి జైలుశిక్షకు కారకుడైన ఎస్‌ఐ జే సంజీవరావుకు రూ.25వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానాను బాధితునికి ప్రభుత్వం వెంటనే చెల్లించి, అనంతరం ఎస్‌ఐ జీతం నుంచి రికవరీ చేయాలని తీర్పులో పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నగరానికి చెందిన బీ కమలాకర్ అనే వ్యక్తి వద్ద నుంచి గాలి వెంకటేశ్వర్లు 2004 జూన్ 26న రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకోసం గాంధీచౌక్‌లోని తన ఇంటిని అదేరోజు తానఖా చేశాడు. అయితే.. అప్పును సకాలంలో చెల్లించకపోవడంతో కమలాకర్ సదరు ఇంటిని అమ్మి, తన బాకీని రాబట్టుకునేందుకు 2006లో కోర్టులో సివిల్ దావా వేశాడు. ఈ కేసులో కోర్టుకు హాజరైన గాలి వెంకటేశ్వర్లు 1964లో ఖమ్మం మున్సిపాలిటీ తన తాతకు ఈ అసెన్డ్ స్థలాన్ని ఇచ్చిందని, అది ఇంకా ఆయన పేరు మీదే ఉంది కనుక దానిని అమ్మి కమలాకర్ తన బాకీ రాబట్టుకోజాలడని జవాబు దాఖలు చేశాడు. అయితే.. సదరు ఇంటికి గాలి వెంకటేశ్వర్లు యజమాని కాడని తెలిసి కూడా ఆ ఇల్లు తనదేనంటూ తనఖా పెట్టి, ఉద్దేశపూర్వకంగా తనను మోసం చేశాడంటూ కమలాకర్ 2011లో గాలి వెంకటేశ్వర్లుపై కోర్టులో ప్రైవేటు చీటింగ్ కేసు దాఖలు చేశాడు. సదరు కేసును పరిశీలించిన న్యాయమూర్తి దర్యాప్తు నిమిత్తం ఖమ్మం మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ఆ కేసును దర్యాప్తు చేసిన త్రీటౌన్ ఏఎస్‌ఐ.. గాలి వెంకటేశ్వర్లు మోసానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి, అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్‌ఐ జే సంజీవరావు సమగ్ర దర్యాప్తు నిర్వహించి, కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు.

దాని ప్రకారం కేసును విచారించిన న్యాయమూర్తి గాలి వెంకటేశ్వర్లుకు సంవత్సరం జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధించారు. ఈ తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకోగా కేసును విచారించిన జిల్లా జడ్జీ ఒక వ్యక్తికి అసైన్డ్ ల్యాండ్ చట్టబద్దంగా కేటాయించిన 10 సంవత్సరాల తర్వాత లబ్ధి పొందిన వ్యక్తికి అనంతరం అతని వారసులకు అమ్ముకునే హక్కు ఉంటుందన్న నియమాన్ని దర్యాప్తు అధికారి విస్మరించాడని పేర్కొంటూ గాలి వెంకటేశ్వర్లుకు వేసిన శిక్షను రద్దు చేశారు. అదే విధంగా తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి, ఒక వ్యక్తి జైలుశిక్షకు కారకుడైన దర్యాప్తు అధికారి ఎస్‌ఐ జే సంజీవరావుకు రూ.25వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles