హరితహారంలో ఉద్యమంలా.. మొక్కలు నాటాలి..

Fri,July 5, 2019 02:55 AM

రఘునాథపాలెం/కూసుమంచి/ ముదిగొండ:తెలంగాణకు హరితహారం ఐదో విడతలో భాగంగా రాష్ట్రం లో 100 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్‌డీ, ఐఎఫ్‌ఎస్ ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని 12,751వేల గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలను పెంచామన్నారు.గురువారం ఆమె టేకులపల్లి నర్సరీ, వెలుగుమట్ల అర్బ న్ ఫారెస్ట్ పార్క్‌ను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో నర్సరీల ఎంపికపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ అధికారులను ఆమె అభినందించారు. సందర్భంగా మాట్లాడుతూ ..రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో మొక్కలు నాటేందుకు సంబంధిత జిల్లా కలెక్టర్లకు సూచించామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన ఊరు-మన నర్సరీ లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలలో 80కోట్ల మొక్కలను నర్సరీలలో సిద్ధంగా ఉంచినట్లు ఆమె తెలిపారు. అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై విజయ వంతం చేయాలన్నారు. రైతులకు అవసరమైన, గృహావసరాలకు అవసరమైన మొక్కలను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. మొక్కలు అవసరమయ్యే రైతులను వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా గుర్తించి ఏఏ రైతుకు ఏఏ మొక్కలు అవసరమున్నాయో అందించాలని ఆమె సూచించారు. నర్సరీలలో ఈ సంవత్సరం పెంచుతున్న మొక్కలలో పూర్తిగా ఎదగని వాటిని వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధంగా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. అర్బన్ వెలుగుమట్ల ఫారెస్ట్ పార్క్ సందర్శనలో భాగంగా అక్కడ అందుబాటులో ఉన్న మొబైల్ వాహనంలో పార్క్ మొత్తాన్ని కలియ తిరిగి పరిశీలించారు.

ప్రియాంకవర్గీస్‌కు స్వాతగం పలికిన కలెక్టర్ కర్ణన్..
ప్రియాంక వర్గీస్‌కు కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణకు హరితహార కింద ఖమ్మం జిల్లాలో మొక్కలు నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాన్ని వివరించారు. జిల్లాలో ఈ సంవత్సరం 3.30కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించి అటవీశాఖ, డీఆర్‌డీఏ, పోలీస్, ఎక్సైజ్, ఉద్యాన, మున్సిప ల్, ఐటీసీ, సింగరేణి శాఖల ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంత్ కొడింబా, జిల్లా అటవీశాఖాధికారి ప్రవీణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఇందుమతి, అడిషనల్ పీడీ విద్యాచందన, ఎఫ్‌డీఓవుల సతీష్, ప్రకాశరావు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు జ్యోత్స్న, రాధిక, ఇతర అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కూసుమంచి మండలంలో..
కూసుమంచి మండల పరిధిలోని పాలేరు, జుజ్జల్‌రావుపేట, కేశవాపురం గ్రామాల్లో అటవీశాఖ అధికారులు నిర్వహిస్తున్న వన నర్సరీలను పరి శీలించారు. ఈసందర్భంగా డీఆర్‌డీఓ ఇందుమ తి, అటవీశాఖ అధికారులు ప్రవీణ, జోత్స్నలను జిల్లాలో ఏర్పాటుచేసిన నర్సరీలు, మొక్కల వివరా లను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్లాస్టిక్ సంచుల్లో మొక్కలు ఎండిపోవడాన్ని గమనించి, ప్లాస్టిక్ కవర్లలో నాణ్యతాలోపం వల్ల కూడా మొక్కలు చనిపోతాయని అన్నారు. మట్టి నింపిన ప్లాస్టిక్ కవర్లను తిరిగి మొక్కలు నాటడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మన ఊరు.. మన నర్సరీ అనే విధానం వల్ల స్థానికులకు నర్సరీలు, మొక్కల పెంప కం పట్ల ఆసక్తి కలుగుతుందని తెలిపారు. సమష్టి కృషి వల్లే హరిత హారం కార్యక్రమం విజయవంతం అవుతుందన్నా రు. కొత్త పంచాయతీరాజ్ చట్టం వల్ల కూడా గ్రామాల్లో విరివిగా మొక్కలు పెంచడానికి ప్రణాళికలు రూపొంచినట్లు చెప్పారు. గతంలో కంటే ఈసారి అధికంగా మొక్కలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, పొరుగు రాష్ర్టాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. వర్షాలు కురిసిన జిల్లాలలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయా అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు.

మండల అధికారులపై ఫిర్యాదు
మండలంలోని పాలేరు, జుజ్జల్‌రావుపేట నర్సరీల వద్ద పదినిమిషాల లోపే గడిపిన ప్రియాంక వర్గీస్ కేశవాపురం నర్సరీ వద్ద సుమారు 20 నిమిషాలు గడిపారు. ఈసమయంలో గ్రామస్తులు పలువురు స్థానిక అధికారులపై ఫిర్యాదు చేశారు. వీఆర్వో పనితీరు బాగాలేదని, వెంటనే బదిలీ చేయాలని కోరారు. ఇక రెవెన్యూ అధికారులపై కూడా పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఉదయం 11 గంటల వరకు కార్యాలయానికి రారని, ఇతర సిబ్బంది ఇష్టారాజ్యంగా మారిందని వారు ప్రియాంక వర్గీస్ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో అనేక మందికి పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదని, తాము తీసుకెళ్లిన దరఖాస్తులను మామొఖాన్నే విసిరేసి, బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు. తమ వేలిముద్ర పడక పింఛన్ నిలిచిపోయిందని ఓవృద్ధురాలు విజ్ఞప్తిచేయగా, ఈసమస్య పరిష్కరించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు, ఏపీఓ నాగరాజు, పాలేరు, జుజ్జల్‌రావుపేట, కేశవా పురం సర్పంచ్‌లు ఎడవెల్లి మంగమ్మ, మందడి పద్మావెంకటరెడ్డి, తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు గోపె వెంకన్న, అంబాల ఉమ, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి సృజన్‌కుమార్, ఇంటూరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

నాటిన ప్రతీ మొక్కనూ సంరక్షించాలి..
హరితహారంలో ఇంటింటికి మొక్కను నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సీఎం ఓఏస్డీ ప్రియాంక వర్గీస్ అన్నా రు. సోమవారం మండల పరిధిలోని సువర్ణాపురం, న్యూలక్ష్మీపురం గ్రామలో ఉన్న నర్సరీలను ఆమె పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నర్సరీలలో మొక్కలను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి ఇంటికి మొక్కను సరఫరా చేసి నాటించాలని, అలాగే అన్ని పాఠశాలలకు ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని మొక్కలను అందజేని ప్రతి విద్యార్థితో మొక్కలు నాటించాలన్నారు. మొక్కలు నాటించాటమే కాకుండా వాటిని కన్న బిడ్డల్లా సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా నర్సరీల్లో ఉన్న మొక్కలను సందర్శించి వాటి సంరక్షణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో కూడా మొక్కలు ఎండిపోకుండా సంరక్షించినందుకు నిర్వాహకులను అభినందిచారు. మొక్కల సంరక్షణకు సేంద్రియ పద్ధతులను పాటించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ శ్రీనివాసరావు, ఎంపీపీ పసుపులేటి లక్ష్మీ, గ్రామాల సర్పంచులు కొట్టె అపర్ణ, వాకదాని కన్నయ్య, సెక్రెటరీలు మణి, రజిణీ ఈజీఎస్ ఏపీఓ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles