పల్లెపల్లెనా సభ్యత్వ సందడి..

Thu,July 4, 2019 04:05 AM

- గ్రామాల్లో జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదు
- ప్రతీ నియోజకవర్గానికి 50 వేల లక్ష్యం
- కొత్తగూడెం, మణుగూరులో పాల్గొన్న ఎమ్మెల్యేలు వనమా, రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో తిరుగులేని శక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ గ్రామ గ్రామాన వెల్లువలా కొనసాగుతోంది. ప్రతీ నియోజకవర్గంలో సుమారు 50 వేలకు పైగా సభ్యత్వాల నమోదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు. అన్ని ఎన్నికల్లో అప్రతిహాత విజయాలను సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ అదే ఊపుతో సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించింది. జూలై 20 కల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకొని దేశంలోనే బలమైన పార్టీగా అవతరించేందుకు సమాయత్తమవుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలను స్వీకరించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశించిన 50 వేల సభ్యత్వాల లక్ష్యం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు లక్ష్యం చేరుకునేందుకు అందరూ ఉత్సాహంగా సభ్యత్వాలను చేర్పించే పనిలో నిమగ్నమయ్యారు.

నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాల లక్ష్యం
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల 50 వేలకు పైగా సభ్యత్వాల నమోదే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్థానాలను పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకోవడంతో గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలం పెరిగింది. దీంతో టీఆర్‌ఎస్ సభ్యత్వాలు తీసుకునేందుకు జనం స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రతీ గ్రామంలో ఇప్పటికే సగానికి పైగా ప్రజలు సభ్యత్వాలను తీసుకుంటుండగా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశించిన 50 వేల సభ్యత్వాలు సునాయాసంగా చేరి లక్ష సభ్యత్వాలకు చేరువయ్యే అవకాశాలున్నాయి.

గతనెల 28వ తేదీన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభ్యత్వ నమోదు ప్రక్రియను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు తొలి సభ్యత్వాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు ప్రక్రియ జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. ప్రతీ నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ తరపున ఇన్‌చార్జులను నియమించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూలై 20లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. దీంతో సభ్యత్వ నమోదు ప్రక్రియ గ్రామగ్రామాన సంబురంగా కొనసాగుతోంది.

సభ్యత్వాల డిజిటలైజేషన్ ప్రక్రియకు సన్నాహాలు
సభ్యత్వాల డిజిటలైజేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి జిల్లా కేంద్రంలో సభ్యత్వాల డిజిటలైజేషన్ ప్రక్రియను టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ కమిటీ జిల్లా ఇన్‌చార్జి బీ.దినేష్ నేతృత్వంలో ప్రారంభించనున్నారు. దేశంలో ఏ పార్టీ ఇవ్వని విధంగా డిజిటల్ సభ్యత్వ కార్డును పార్టీ సభ్యులకు అందించనున్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ కవరేజీని ఇస్తుండటం, పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను సులువుగా తెలిపేందుకు డిజిటల్ కార్డు ఉపయోగపడనుంది.

జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ పార్టీ
2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైన టీఆర్‌ఎస్ పార్టీ నేడు తిరుగులేని శక్తిగా అవతరించింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 16 జడ్పీటీసీ స్థానాలు గెలుచుకొని జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్‌ను సైతం తన ఖాతాలో వేసుకుంది. అంతే కాకుండా అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని మెజార్టీ ఎంపీపీ స్థానాల్లో పాగా వేసిన టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని ఎన్నికలు పూర్తైన దరిమిల సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ఈనెల 20లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేసి నూతన గ్రామ కమిటీలను, మండల కమిటీలను, జిల్లా కమిటీలను వేసి తద్వారా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోనుంది.

ఊపందుకున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మంగళవారం జిల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్‌రెడ్డి జిల్లాలోని సుజాతనగర్, కొత్తగూడెం, దమ్మపేట మండలాల్లో పర్యటించి సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగిరం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ప్రక్రియ ఊపందుకుంది. భద్రాచలం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు పలువురికి సభ్యత్వాలను అందించారు. ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు సభ్యత్వాలను అందజేస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles