మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి..!

Thu,July 4, 2019 04:04 AM

- కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
చర్ల రూరల్ : కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ బుధవారం చర్ల మండలంలో పర్యటించారు. బుధవారం మండల సరిహద్దు పర్ణశాల, రాళ్ళగూడెం గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ ప్రోగ్రెస్ గురించి ఎంపీడీవో నవాబ్ పాషా కలెక్టర్‌కి వివరించారు. ఉప్పరిగూడెం గ్రామంలో కార్యదర్శి కృష్ణ పనుల గురించి వివరించారు. అక్కడి నుంచి చర్లలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని మండల అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. పనులు మందకొడిగా ఉన్నచోట అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనపర్చి వేగం పెంచాలని, ఈ నెల ఆఖరుకల్లా టార్గెట్ రీచ్ కావాలని సూచించారు. ఎంపీడీవో నవాబ్ పాషా, తహసీల్దార్ బికర్ణదాస్, ఏపీవో చైతన్య పాల్గొన్నారు.

దుమ్ముగూడెం : పెండింగ్‌లో ఉన్న పాస్ పుస్తకాలను త్వరితగతిన రైతులకు అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీనగరం గ్రామంలో తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రైతుల పాస్ పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంజిపాక పంచాయతీలో పాస్ పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయని మండల తహసీల్దార్ ఎన్‌టీ ప్రకాష్‌రావు కలెక్టర్‌కు వివరించారు. తదుపరి మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాల గురించి ఎంపీడీవో బైరవ మల్లీశ్వరిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మండలంలో అన్ని పంచాయతీల్లో 8,709 మరుగుదొడ్లు మంజూరు కాగా, వాటిలో 5,610 పూర్తి చేయడం జరిగిందని, 2746 పెండింగ్‌లో ఉన్నాయని ఆమె వివరించారు. సాధ్యమైనంత వరకు ఈ నెలలో పూర్తి చేస్తామని తెలిపారు. త్వరితగతిన పూర్తి చేసి మండలాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ సూచించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మరుగుదొడ్ల నిర్మాణం గురించి అవగాహన కల్పించాలని కోరారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles