పుడమికి పచ్చలహారం..

Tue,July 2, 2019 03:18 AM

-3.31కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధం
-శాఖల వారీగా లక్ష్యాన్ని కేటాయించిన కలెక్టర్
-పచ్చదనమే సీఎం కేసీఆర్ లక్ష్యం..
-ఐదో విడుత హారితహారానికి సన్నాహాలు
గత హరితహారం కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోక పోయింది. అనేక లోపాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. అటవీ శాఖ అధికారుల లోపాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల క్షేత్రస్థాయి అధికారుల లోపాలు బాహాటంగా కన్పించాయి. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిన బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా తయారైంది. గత ఏడాది తప్పులను, నిర్లక్ష్యాన్ని అంచనా వేసి ఈ ఏడాది చెప్పట్టబోయే తెలంగాణ హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేలా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రుతుపవనాలు వచ్చిన వెంటనే నాటేందుకు మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉంచారు.

హరిత హారానికి ప్రణాళిక సిద్ధ్దం...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. ఈ ఏడాది జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3.31 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి రోజు ప్రజలకు అవసరం వచ్చే మొక్కలతో పాటు పండ్లు , టేకు, ఉసిరి తదితర మొక్కలు పెంచేందుకు సన్నద్ధమైంది. ఇప్పకే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ నర్సరీలను పెంచారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. రహదారులు, చెరువులు, ప్రభుత్వ భూముల్లో మొక్కలను నాటడంతో పాటు ప్రతి ఇంటికి ఐదు మొక్కలను ఇవ్వనున్నారు. ఇందులో పండ్ల మొక్కలు, కరివేపాకు, బొప్పాయి, తదితర మొక్కలు ఇస్తారు.

శాఖల వారీగా మొక్కల కేటాయింపు..
జిల్లాకు నిర్దేశించిన 3 కోట్ల 31 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి ద్వారా కోటి మొక్కలు, పోలీసు, అటవీ శాఖలు సంయుక్తంగా కోటి మొక్కలు, సింగరేణి ద్వారా 25 లక్షలు, ఐటీసీ ద్వారా 50 లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా 15లక్షలు, మున్సిపాలిటీల ద్వారా 28లక్షలు, ఉద్యానవన శాఖ ద్వారా 10 లక్షలు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ద్వారా లక్ష మొక్కలు నాటేందుకు లక్ష్యాలను కేటాయించారు

నాటిన ప్రతి మొక్కను సజీవంగా ఉంచాలి...
మొక్కలు నాటడంతోనే సరిపోదని, నాటిన ప్రతి మొక్క సజీవంగా ఉండి మొక్క దశ నుండి చెట్టుగా ఎదిగే వరకు సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఇటీవల వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. హరితహారంలో భాగంగా గృహ అవసరాలకు కావాల్సిన మొక్కలు కూడా పంపిణీ చేయనున్నారు. నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేయనున్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడంలో ఎంపీడీఓల పాత్ర కీలకమైంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో పాటు గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేసి హరితహారంలో వారి బాధ్యతను కూడా తెలియపర్చనున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్‌డీలు, ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో జిల్లాలో హరితహారాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం హరతహారం లక్ష్యాలను సాధించేందుకు ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు.

500 నర్సరీలలో మొక్కల పెంపకం
జిల్లాలోని 500 నర్సరీలలో వివిధ రకాల మొక్కలను పెంచారు. అటవీశాఖ, డీఆర్‌డీఏ, మునిసిపాలిటీ, ఉద్యానవన శాఖల ఆద్వర్యంలో నర్సరీలను పెంచారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఈసారి హరితహారం కార్యక్రమాన్ని కొంత ఆలస్యంతో ఈ నెలాఖరులోగాని, ఆగస్టు మొదటి వారంలో గాని ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం..ప్రతి గ్రామ పంచాయతిలో ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 6 మొక్కలు తగ్గకుండా పంపిణీ చేయనున్నారు. వాణిజ్య మొక్కల కింద టేకు, సుబాబుల్, జామాయిల్ క్లోన్స్ , పూల మొక్కలలో టేకోమ, గన్నేరు, మందారం, పండ్ల మొక్కలలో ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, నీడనిచ్చే మొక్కల క్రింద వేపకానుగ, రావి మర్రి, సీమ తంగేడు, పెల్టోఫారం, గుల్మోహర్ తదితర మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉంచారు.

వర్షం రావడమే తరువాయి...
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 3.31 కోట్ల మొక్కలను సిద్ధంగా ఉంచాం. జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అటవీ శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు వివిధ రకాల మొక్కలను హరితహారం కార్యక్రమంలో నాటేందుకు ప్రణాళికను రూపొందించాం. వర్షం కురిసిన వెంటనే మొక్కలను నాటుతాం. ఇప్పటికే ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో, ఏ స్థలంలో ఏ రకం మొక్క నాటాలో గుర్తించాం. కలెక్టర్ రూపొందించిన ప్రత్యేక ప్రొఫార్మాలో ఈ వివరాలను పొందుపర్చాం. నోడల్ అధికారులుగా ఎంపీడీఓలు వ్యవహరిస్తారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక కార్యచరణను తీసుకుంటున్నాం. గతంలో జరిగిన లోపాలను సమీక్షించుకుని ఈ ఏడాది విజయవంతంగా హరితహారం జరిగేలా అన్ని శాఖల అధికారులతో కలిసి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో హరితహారం విజయవంతంగా నిర్వహిస్తాం. - ప్రవీణ, ఫారెస్టు కన్జర్వేటర్, ఖమ్మం

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles