రోడ్డెక్కిన దంపతుల పోరు

Tue,July 2, 2019 03:13 AM

ఖమ్మం లీగల్, జులై 1 : రెండు కుటంబాల మధ్య గొడవ చినికిచినికి రోడ్డెక్కింది. వియ్యంకుల పోరు కాస్తా వీధి సినిమాను తలపించింది. వాయిదా కోసం వచ్చిన ఇరువర్గాలు కోర్టు ఎదుటే తన్నుకున్నాయి. గుట్టుగా సాగుతున్న రెండు కుటుంబాల పంచాయతీ కాస్తా చివరికి వీధి పాలైంది. సోమవారం ఉదయం జిల్లా కోర్టు ఎదుట జరిగిన గొడవ స్థానికంగా కలకలం రేపింది. కొద్దిసేపు భయానక వాతావరణం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తవుడోజు వెంకటేశ్వర్లు కుమారుడు విజయభాస్కరాచారికి, పాతలింగాలకు చెందిన అబ్బనపూరి వెంకటేశ్వర్లు కుమార్తె గంగాభవానీతో 2018, మే 6న వివాహం జరిగింది. అంతా సవ్యంగా జరిగిందనుకుంటున్న తరుణంలోనే నూతన దంపతుల మధ్య విబేధాలు మెదలయ్యాయి. అదికాస్తా రచ్చరచ్చగా మారింది. పళ్లైన రెండు నెలలకే భర్త తరపువారు భార్య కుటుంబసభ్యులపై కేసు పెట్టారు. మరోవైపు అదనపు కట్నం కోసం తనను అత్తింటివారు వేధిస్తున్నారని గంగాభవానీ భర్త విజయభాస్కరాచారి, ఆయన కుటుంబసభ్యులపై ఖమ్మం మహిళా పోలీస్‌స్టేషన్‌లో గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దాంతోపాటు మెయింటెన్స్ కేసు కూడా వేసింది. ఈ రెండు కేసులు కోర్టులో నడుస్తుండగా భర్త విజయభాస్కరాచారి కోర్టులో డైవర్స్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మూడు కేసుల వాయిదాల కోసం ఇరువర్గాలు కొద్దిరోజులుగా కోర్టుకు తిరుగుతున్నాయి. సోమవారం కుటుంబ న్యాయస్థానంలో డైవర్స్ కేసు వాయిదా ఉండడంతో గంగాభవానీ.. తండ్రి అబ్బనపూరి వెంకటేశ్వర్లు, తమ్ముడు త్రినాథ్‌తో కలిసి కోర్టుకు వచ్చింది. విజయభాస్కరాచారి తన తల్లి అన్నపూర్ణమ్మతో కలిసి కోర్టుకు వచ్చాడు. పోలీస్ డ్రెస్‌లో ఉన్న విజయభాస్కరాచారి తండ్రి కోర్టు ఎదుట ఉన్నాడు. కేసు వాయిదా పడడంతో ఇరువర్గాలు ఇంటికి బయలుదేరాయి. అయితే.. కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో అంతా మీరే చేశారంటే, మీరే చేశారంటూ రెండు వర్గాలు తిట్టుకున్నాయి. ఈ విషయం కోర్టు బయట ఉన్న విజయభాస్కరాచారి తండ్రి, హెడ్ కానిస్టేబుల్ తవుడోజు వెంకటేశ్వర్లుకు చెప్పడంతో ఆయన రెచ్చిపోయాడు. ఖాకీ డ్రెస్, చేతిలో లాఠీ ఉన్న వెంకటేశ్వర్లు మా వాళ్లనే తిడతారా అంటూ వీరంగం సృష్టించాడు. కోడలు గంగాభవానీ, ఆమె తండ్రి వెంకటేశ్వర్లు, తమ్ముడు త్రినాథ్‌పై లాఠీ ఝుళిపించాడు. కోర్టు బయట ఇరువర్గాలు కొద్దిసేపు బాహాబాహీకి దిగాయి. ఈలోగా టూటౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి, హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఊహించని ఘటన నుంచి తేరుకున్న గంగాభవానీ కుటుంబ సభ్యులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 294బీ, 324, 506 సెక్షన్ల కింద కానిస్టేబుల్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు. కోర్టు ప్రాంగణంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఫీలయ్యారు. చివరికి ఫ్యామిలీ గొడవ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles