సబ్సిడీ గొర్రెల పంపిణీకి రెడీ

Wed,June 26, 2019 01:24 AM

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సమైక్య పాలనలో పల్లెలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి.. పల్లె ప్రజలు ఉపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ర్టాలు, చివరకు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారు.. కానీ నేడు ఆ పరిస్థితి లేవు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకు సీఎం కేసీఆర్ కుల వృత్తులకు జీవం పోశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుల వృత్తిదారులకు సబ్సిడీ గొర్రెలు, చేతి వృత్తిదారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సబ్సిడీపై యూనిట్లను అందజేశారు. దీంతో తమ ఉనికిని కోల్పోయిన చేతి వృత్తులు, కుల వృత్తిదారులు తిరిగి ఆర్థికంగా బలంగా ఎదుగుతున్నారు.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కులాల జీవన స్థితిగతులలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యంతో ఎన్నో ఏళ్లు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది. చేతి, కులవృత్తిదారులకు చేయూత లేక పట్టణాలు, నగరాలకు వలస వెళ్లేవారు. నేడు ఆ పరిస్థితి లేకుండా నగరాల నుంచి ప్రజలు పల్లెల బాట పడుతున్నారు. దీంతో పల్లెలన్నీ తిరిగి నూతన కళను సంతరించుకుంటున్నాయి..

కుల వృత్తులకు చేయూత..
రాష్ట్రంలో ఉన్న ప్రజలకు రాష్ట్రంలో ఉన్న మాంసపు ఉత్పత్తులు సరిపోక ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెలను, మేకలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గొల్ల కురుమలు తమ వృత్తిని వదిలి వ్యవసాయం, ఇతర పనులకు వెళ్లేవారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సుధీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ కుల వృత్తులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సంకల్పించారు. రాష్ర్టాభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలని బలంగా నమ్మిన కేసీఆర్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కులవృత్తులకు చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గొల్ల కురుమలకు సబ్సిడీ కింద గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ వస్తున్నారు.

తొలి విడుత 5300 యూనిట్లు పంపిణీ
కుల వృత్తులకు జీవం పోసి చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ గ్రామంలో ఉన్న గొల్ల కురుమలకు సబ్సిడీ కింద గొర్రెల యూనిట్లను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అనుకున్నదే తడవుగా గ్రామాల్లో ఉన్న గొల్ల కురుమల సంఘాల ద్వారా పలు దఫాలుగా గొర్రెలను పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. తొలి విడుత జిల్లాలో 5300 గొర్రెల యూనిట్లను సబ్సిడీ రూపంలో పంపిణీ చేశారు. ప్రతీ యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందించారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న గొల్ల కురుమలందరికీ సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం మిగిలిన వారికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. తొలి విడుత 5300 యూనిట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం రెండో విడుత ఆరు వేల గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు సమాయత్తమైంది.

రెండో విడుత 6 వేల యూనిట్లపంపిణీయే లక్ష్యం
వేసవికాలం కావడం, వరుస ఎన్నికలు ఉండటం ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రభుత్వం రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసింది. నేడు అన్ని ఎన్నికలు పూర్తయినందున తిరిగి సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం కింద గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లను అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్దమైంది. జిల్లాలో సుమారు 6 వేల యూనిట్లను పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటికే 2 వేల యూనిట్లను పంపిణీ చేశారు. మిగిలిన 4 వేల యూనిట్లను జూలై మొదటి వారంలో పంపిణీ చేసేందుకు సమాయత్తమయ్యారు. వేసవి కాలం ముగిసి వర్షాకాలం రావడంతో గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు.

జూలై మొదటి వారం నుంచి లబ్ధిదారులకు అందజేత
జిల్లాలో గొర్రెల యూనిట్లను పంపిణీ చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. వర్షాకాలం రావడంతో పల్లెల్లో గొర్రెలకు దాణా (పచ్చగడ్డి) విరివిగా దొరికే అవకాశం ఉండటంతో యూనిట్లను పంపిణీ చేసేందుకు గ్రామాల వారీగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఒక యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలను అందించే ప్రభుత్వం ఒక యూనిట్‌కు గాను రూ.1.25 లక్షలను ప్రభుత్వ చెల్లిస్తుంది. కేవలం రూ.32,150 మాత్రమే లబ్ధిదారుడు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను 21 మండలాల్లో పంపిణీ చేయనున్నారు. తొలి విడుతలో యూనిట్లు అందుకున్న గొల్ల కురుమలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీకి రంగం సిద్ధం కానుండటంతో మొదటి విడుతలో యూనిట్లు రాని గొల్లకురుమల కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles