జూలై నెలఖారులోగా నిర్మాణాలు పూర్తి చేయాలి

Wed,June 26, 2019 01:22 AM

-జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
-మరుగుదొడ్ల నిర్మాణానికి స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలి
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభించిన గృహాలలో తక్షణమే జేసీబీతో పునాదులు తీయించాలని చెప్పారు. మరుగుదొడ్లకు వినియోగించే రింగులు (వరలు) కోరుతూ ఉన్న మండలాల్లో అచ్చులు కొనుగోలు చేసి రింగులుతయారు చేయించాలన్నారు. రింగులు లభ్యమయ్యే ప్రాంతాల్లోని యజమానులను సంప్రదించి త్వరితగతిన రింగులు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు జూలై నెలాఖరు వరకు మాత్రమే సమయం ఉన్నందున నిర్మాణాలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పారు. మరుగుదొడ్లు ప్రారంభించని కుటుంబాలకు రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పారు. అదే విధంగా నిర్మాణాలు చేపట్టేందుకు మేస్త్రీలు కొరత ఉన్న మండలాలలో ఇతర ప్రాంతాల నుంచి మేస్త్రీలను తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్డి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఆయా గ్రామాలలో కార్మికులకు వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. వసతి, భోజన ఏర్పాట్లు చేయడం వలన కార్మికులతో పాటు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చాలా సమయం ఆదా అవుతుందన్నారు.

వచ్చే నెలాఖరు నాటికి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు ప్రతీ రోజు దాదాపు 824 మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. నిర్మాణ కార్మికులు జిల్లా యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలని, ఇందు కోసం ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించాలన్నారు. తొలగించాల్సిన మరుగుదొడ్డి నిర్మాణాల జాబితాను జాగ్రత్తగా పరిశీలించి తొలగించేందుకు కారణాలు తెలియజేస్తూ రానున్న మూడు రోజుల్లో మండలాల వారీగా ఆర్డీవోకు నివేదిక అందజేయాలని చెప్పారు. నిబంధనల మేరకు మరుగుదొడ్డి గుంతలోతును తీయాలని చెప్పారు. పాఠశాల ప్రారంభానికి ముందు అనగా ప్రేయర్‌కు ముందు విద్యార్థులతో మరుగుదొడ్డి నిర్మించని ఇంటి ముందు ర్యాలీలు నిర్వహించాలని చెప్పారు. మంజూరు చేయాల్సి ఉన్న వాటిని తక్షణమే మంజూరు ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు వెనువెంటనే నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ప్రత్యేక అధికారులు మరుగుదొడ్లు నిర్మాణాలలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ఆ ప్రకారం నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే విధంగా చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా నిర్మాణాలను పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు అవగాహన నిర్వహించాలని చెప్పారు. ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడు చెల్లించకుండా ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని, అందువలన ఇంకనూ మరుగుదొడ్డి వినియోగించని కుటుంబాల వారు గౌరవ ప్రధంగా మరుగుదొడ్డి నిర్మించుకొని మన జిల్లాను స్వచ్ఛ జిల్లాగా ప్రకటించడానికి సహకరించాలని ఆయన కోరారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles