ఆలయ నిధులు కైంకర్యం

Tue,June 25, 2019 01:59 AM

వైరా, నమస్తే తెలంగాణ, జూన్ 24: మండలంలోని విప్పలమడక గ్రామంలో ఉన్న సోమలింగేశ్వరస్వామి దేవాలయ నిధుల కైంకర్యంపై అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ భూములపై వచ్చిన పంట కౌలు కైంకర్యమైనా పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని, నిధులను ఆలయాభివృద్ధికి వినియోగించాలని గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. విప్పలమడక గ్రామంలో సోమలింగేశ్వరస్వామి దేవాలయంకు సుమారు 12.06 ఎకరాల పంట భూమి ఉంది. ఈ పంట భూమిని ప్రతి సంవత్సరం రైతులకు కౌలుకు ఇచ్చేందుకు గ్రామంలో బహిరంగ వేలం నిర్వహిస్తుంటారు. అయితే వేలం నిర్వహించిన రోజునే కౌలుకు పొలాలను పాడుకున్న రైతులు వెంటనే నగదు చెల్లిస్తారు. ఆ నగదును ప్రతి సంవత్సరం బ్యాంకులకు సంబంధించిన ఖాతాలో జమ చేస్తారు. అయితే విప్పలమడక గ్రామంలోని 351 సర్వే నెంబర్‌లోని 1.26 ఎకరాలు, 495అ సర్వే నెంబర్‌లోని 2.39 ఎకరాలు, 496 సర్వే నెంబర్‌లోని 4.38 ఎకరాలు, 497 సర్వే నెంబర్‌లోని 2.25 ఎకరాల సోమలింగేశ్వరస్వామికి సంబంధించిన పొలాలకు 2018 ఆగస్టు నెలలో బహిరంగ కౌలు వేలం నిర్వహించారు. ఈ కౌలు వేలంలో దేవదాయశాఖ ఇన్స్‌పెక్టర్ సమత సమక్షంలో నిర్వహించారు. సుమారు 12.06 ఎకరాల భూమిని గ్రామస్తులు రూ.99200లకు వేలంలో కౌలుకు దక్కించుకున్నారు. అయితే ఆ నగదును రైతులు వెంటనే చెల్లించారు. 10 నెలలు గడుస్తున్నా అధికారులు ఆ నగదును బ్యాంకులో జమ చేయలేదు. గతంలో ఈ దేవాలయానికి చైర్మన్‌గా ఉన్న పారుపల్లి రాజేశ్ సంవత్సరన్నర క్రితం వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేవాలయం కమిటీ సభ్యులుగా అక్కిశెట్టి వెంకటేశ్వర్లు, కిలారు రామారావు, ముత్తమాల సరళ, ఇమ్మడి రమేశ్ వ్యవహరిస్తున్నారు. దేవాలయం కమిటీ సభ్యులకు కూడా నేటి వరకు కౌలు నగదు బ్యాంకులో జమ చేయని విషయం తెలియదంటే ఇక్కడి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని భక్తులు పేర్కొంటున్నారు.

ఈ సంవత్సరానికి సంబంధించి విప్పలమడకలోని సోమలింగేశ్వరస్వామి దేవస్థానం కౌలు బహిరంగ వేలంను నిర్వహించేందుకు సోమవారం గొల్లపూడి ఈవో వేణుగోపాలచారి వచ్చారు. అయితే గత ఏడాది కౌలు నగదును బ్యాంకులో ఎందుకు జమ చేయలేదని గొల్లపూడి ఈవోను గ్రామ సర్పంచ్ తుమ్మల జాన్‌పాపయ్య, ఎంపీటీసీ ఆకుల ప్రసాద్‌తో పాటు పలువురు ప్రశ్నించారు. దీంతో ఈవో వేలంపాటను ఈ నెల 27కు వాయిదా వేశారు. దేవాలయానికి సంబంధించిన సుమారు లక్ష రూపాయల నిధులను కమిటీకి సంబంధం లేని ఓ వ్యక్తి వసూలు చేశాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆ వ్యక్తి వసూలు చేసిన కౌలు నగదును అధికారులు బ్యాంకులో వేయించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిధులు దుర్వినియోగమయ్యాయి. దేవదాయ శాఖ నియమ నిబంధనలను అధికారులు కనీసం పట్టించుకోకుండా వ్యవహరించడం పట్ల విప్పలమడక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై ఇన్స్‌పెక్టర్ సమతను నమస్తే తెలంగాణ వివరణ కోరగా దేవాలయ కౌలు నగదు బ్యాంకు ఖాతాలో జమ చేయని విషయం వాస్తవమేనన్నారు. గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద ఆ నగదు ఉన్నాయని గ్రామస్తులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దేవాదయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గౌరీశంకర్ నిర్లక్ష్యం వల్లనే ఈ నగదు బ్యాంకు ఖాతాలో జమ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles