పోలీసుల కల నురవేరింది

Tue,June 25, 2019 01:59 AM

ఖమ్మం క్రైం, జూన్ 24: శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పటికీ బిజీగా ఉండే పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు కల నెరవేరింది. నిత్యం ఒత్తిడితో పనిచేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటూ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు సెలవులు కేటాయించడంతో ఇక వారు వారంలో ఒకరోజు కుటంబంతో సరదాగా గడపనున్నారు. పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారాంతపు సెలవు అమలుకు రాష్ట్ర పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. డ్యూటీ రోస్టర్ చార్ట్ ప్రకారం సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ ఆఫ్‌లు అమలు చేయాలని డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచే ఈ డిమాండ్‌ను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వారాంతపు సెలవులు ఉత్తర్వులు అందడంతో పోలీసుశాఖలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఏసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు..
పోలీస్ కమిషనరేట్‌లో ఏసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు వారంలో ఒకరోజు సెలవు తీసుకునేవిధంగా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సివిల్, ఏఆర్ ఫోర్స్, సిటీ స్పెషల్ బ్రాంచ్, సిటీ క్రైమ్, రికార్డింగ్ బ్రాంచ్, పోలీస్ శిక్షణ కేంద్రంతోపాటు ఇతర విభాగాలకు చెందిన మొత్తం 1517మంది పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది వారాంతపు సెలవులు వినియోగించుకోనున్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బంది విధులను బట్టి వేర్వేరు విభాగాలుగా విభజిస్తూ వారంలో వారికి అనుకూలమైన రోజు విశ్రాంతి తీసుకునేవిధంగా పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఒక చార్ట్ రూపొందించి అమలు చేయనున్నారు. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో సిబ్బంది, అధికారులు హెడ్‌క్వార్టర్‌లోనే అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యవసర ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ముందుకు ఖమ్మం జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకునే విధంగా చర్యలు ఉండనున్నాయి. వారంలో ఒకరోజు పోలీసులకు విశ్రాంతి లభించడంతో విధుల్లో మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉత్సాహంగా విధులు నిర్వహించేవిధంగా దోహదపడుతుందని పోలీస్ అధికారులు అంటున్నారు.
పోలీస్ అసోసియేషన్ హర్షం..
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పోలీసులకు వారంతపు సెలవులు అమలు చేయడం పట్ల పోలీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. పోలీస్‌శాఖలో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైనా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, సభ్యులు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు సేవలకు గుర్తింపు...హర్షం వ్యక్తం చేస్తున్న పోలీసులు, కుటుంబ సభ్యులు
రఘునాథపాలెం : పోలీసులకు వారంతపు సెలవు దొరికింది. 365రోజులు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తున్న పోలీస్ సేవలను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. ప్రజలకు భద్రతగా నిలిచే పోలీసులు ఒకరోజు హాయిగా కుటుంబంతో గడిపే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు తీపి కబురు అందించారు. వారంతపు సెలవులను అమలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వారాంతపు సెలవుతో...
ఇతర శాఖల్లో మాదిరిగా మా శాఖకు కూడా వీక్లీ ఆఫ్ అమలు చేయడం సంతోషంగా ఉంది. గతంలో సెలవు కావాలంటే రెండురోజుల ముందే అనుమతి తీసుకున్నా దొరికేది కాదు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు ఎన్నో పథకాలను తీసుకవచ్చారు. కొత్త వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీక్లీఆఫ్ అమలు చేయడం సంతోసంగా ఉంది.

-రఘునాథపాలెం స్టేషన్ ఎస్సై, సంతోష్

చాలా సంతోషంగా ఉంది...
పోలీసులకు వారంతపు సెలవు ప్రకటించడం సంతోషంగా ఉంది. వారంలో ఒక రోజు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. వారాంతంపు సెలవులు కేసీఆర్ కల్పించిన గొప్ప వరంగా భావిస్తున్నాం. శాంతి భధ్రతల పరిరక్షణలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తున్నాం.
-డీ. డానియేల్, ఏఎస్సై రఘునాథపాలెం

వీక్లీ ఆఫ్ హర్షనీయం..
వృత్తి భాగంగా ఒత్తిళ్లలో విశ్రాంతి ఉండటం లేదు. కుటుంబ సభ్యులు, పిల్లలతో సరదాగా బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. దీంతో విధి నిర్వహణలో మానసికంగా, శారీరకంగా అసలిపోతున్నాం. మా పరిస్థితిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ వీక్లీ ఆఫ్‌ను అమలు చేయడం మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. మా కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనంద పడుతున్నారు. నేనైతే ఉహించలేదు. వీక్లి ఆప్ వస్తుంది.
-పీ శ్రీనివాసరావు, కానిస్టేబుల్, రఘునాథపాలెం

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles