రైతుబీమాతో ఆర్థిక భరోసా.....

Mon,June 24, 2019 05:08 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతే రాజు.. రైతు లేనిదే రాజ్యం లేదు.. రైతు ఆరుగాలం కష్టించి పండిస్తేనే అందరూ బతికేది. దేశానికే వెన్నెముక అయిన రైతు మరణిస్తే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతుంది. అటువంటి కుటుంబానికి భరోసానిస్తూ, ఎంతో కొంత పైకం అందించి ఆసరాగా నిలబడాలని సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ఆలోచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబీమా పథకాన్ని 2018 ఆగస్టు 14న ప్రవేశపెట్టి అర్హులైన వారికి ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఈ పథకంతో ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతు బాగుంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని బలంగా నమ్మిన సీఎం కేసీఆర్ దగాపడిన రైతులను ఆదుకొని నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చారు. వ్యవసాయమే ముద్దు.. అనే రీతిలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అన్నదాతకు చేయూతనందిస్తున్నారు. దీంతో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాఫ్ట్‌వేర్, ఇతర పారిశ్రామిక రంగాల్లో ఉన్న యువకులు కూడా రైతుబంధు, రైతుబీమా పథకాల పట్ల ఆకర్షితులై వ్యవసాయ రంగమే మేలు అనే తలంపుతో ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

రైతు కుటుంబానికి భరోసా..
కుటుంబ వ్యవస్థలో యజమాని సంపాధిస్తేనే ఆ కుటుంబం అంతా బతికేది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అటువంటి కుటుంబ వ్యవస్థలో యజమాని (రైతు) ప్రమాదవశాత్తు అకాలంగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడే అవకాశముంది. ఆ రైతు కుటుంబానికి పెద్ద దిక్కై ఆసరాగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. మృతిచెందిన రైతు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా పదిహేను రోజుల్లోపే రూ.5 లక్షలను అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలుస్తున్నది. ఈ పథకానికి అర్హులైన రైతులకు రూ.2,271 బీమా ప్రీమియం చెల్లించి రైతుకు పూర్తిగా ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ప్రమాదశాత్తు మరణించిన రైతు కుటుంబంలో ఉన్న నామినీకి ఈ బీమా క్లెయిమ్ మొత్తం అందిస్తున్నారు.

అర్హత పొందిన రైతులు 65,103 మంది
జిల్లా వ్యాప్తంగా 1,35,748 మంది రైతులుండగా, అందులో 65,103 మంది రైతుబీమా పథకానికి అర్హత సాధించారు. వీరందరికీ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా రూ.2,271ను చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ద్వారా రైతులకు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆసరా అయ్యేందుకు రూ.5 లక్షలు బీమా మొత్తం వచ్చే విధంగా పథకాన్ని రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో మృతిచెందిన పేద రైతుల కుటుంబాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలోనే రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి పాలనలో ఇబ్బందులు పడిన రైతు పంట పెట్టుబడి కింద ఇచ్చే రైతుబంధు, ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాలకు ఆసరా అయ్యేందుకు రైతుబీమా వంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

క్లెయిమ్ పొందిన రైతులు 283 మంది
జిల్లా వ్యాప్తంగా 65,103 మంది రైతులు రైతుబీమా పథకానికి అర్హత సాధించారు. వీరందరికీ ప్రభుత్వం ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పించింది. అందులో 324 మంది రైతులు ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. వీరందరికీ రైతుబీమా పథకం వర్తించనుంది. చనిపోయిన రైతులకు బీమా క్లెయిమ్ అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది. అందులో 283 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.14 కోట్ల 15 లక్షలు అందించారు. మిగిలిన 41 మంది రైతు కుటుంబాలకు క్లెయిమ్ అందాల్సి ఉంది. త్వరలోనే బాధిత కుటుంబాలకు కూడా బీమా క్లెయిమ్‌ను అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.


రైతుబీమా @ 29.05 కోట్లు
ఖమ్మం వ్యవసాయం : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ద్వారా నేటి వరకు బాధిత కుటుంబాలకు కోట్ల రూపాయల బీమా పరిహారం అందింది. అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి అండగా ఉండాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం సబ్బండవర్గాల మన్ననలను పొందుతున్నది. సాగుచేసే రైతులకు అన్ని విధాల అందిస్తున్న సహకారం నేడు యావత్ దేశానికి మార్గదర్శకమైంది. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా తెలంగాణలో ప్రవేశపెట్టిన సామూహిక రైతుబీమా పథకం బాధిత కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్నది. ఇంటికి పెద్దదిక్కు అకాల మరణం తరువాత ఆకుటంబం వీధిన పడవద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం నేడు వారి కుటుంబాలకు ఆర్థిక భరోస నిపుతున్నది. అన్నదాతలకు ఒక వైపు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందింస్తూనే మరోవైపు వారి కుటుంబ భద్రత సైతం ప్రభుత్వమే చూడటం విశేషం. స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా నేడు తెలంగాణలో ఎవుసం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుత్తున్న సంగతి తెలిసిందే. ఆదునిక పద్ధతిలో సాగు చేసుకునేందుకు యంత్ర పరికరాలు, మద్ధతు ధర కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ చేసిన టీ సర్కార్ అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన అన్నదాతలకు ఉపశమనం కలిగించింది. పంటల పెట్టుబడిని సైతం ప్రభుత్వమే అందించి అప్పుల బాధలు లేకుండా చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చిన్న్నాభిన్నమైన వ్యవసాయ రంగం స్వరాష్ట్ర సాధన తర్వాత కొత్త పుంతలు తొక్కింది. రైతు సాగు చేస్తున్నప్పడే కాకుండా దురదృష్ట వశాత్తు మరణిస్తే సైతం సదరు కుటుంబాన్ని ఆదుకోవాలనే గొప్ప మనస్సుతో సీఎం కేసీఆర్ రైతుబీమా పథకం ప్రవేశట్టారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో ఒప్పందం చేసుకుంది. ప్రతి ఏటా ఒక్కో రైతుకు బీమా ప్రీమియం రూ. 2,771 ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 645 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరిలో నేటి వరకు 581 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున నేటి వరకు రూ. 29.05 కోట్లను సంబంధిత నామినీ ఖాతాల్లో అధికారులు జమచేశారు. మరో 64 మంది కుటుంబాలకు కొద్ది రోజుల్లోనే పరిహారం అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.

పైసాఖర్చు లేకుండా పరిహారం..
రైతుబీమా పథకం విధివిధినాలు సైతం పకడ్బందీగా రూపొందించారు. ఎక్కడా దళారుల ప్రమేయం లేకుండా, పైసా ఖర్చు లేకుండా పరిహారం అందేవిధంగా రూపకల్పన చేశారు. దేశంలోనే అత్యంత నమ్మకమైన బీమా సంస్థతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలకు తావు లేకుండా పోయింది. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందుకున్న ప్రతీ రైతుకు బీమా సౌకర్యం కల్పించింది. జిల్లాలోని వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు దాదాపు రెండు నెలల పాటు అవిశ్రాంతంగా పనిచేసి సంబంధిత రైతు, నామినీ వివరాలను ముందస్తుగానే సేకరించి జీవిత బీమా సంస్థకు అందజేశారు. రైతు మరణించిన మరుక్షణమే సంబంధిత ఏఈవో అతని ఇంటిని సందర్శించి పూర్తి వివరాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లాలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో నోడల్ అధికారులను నియమించారు. దీంతో రైతు మరణించిన పది రోజులలోపే సంబంధిత నామినీ అకౌంట్‌లోని రూ. 5లక్షల పరిహారం అందుతుంది. మధ్య దళారులు, పైరవీలకు తావులేకుండా చేయడంతో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందుకు గురి కాకుండా చేసినట్లయింది.

నగదు త్వరగా చెల్లించేందుకు చర్యలు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబీమా పథకం ప్రవేశపెట్టడం మంచి పరిణామం. మృతిచెందిన రైతు కుటుంబానికి ఈ పథకం ఆసరాగా నిలుస్తుంది. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబాలకు త్వరితగతిన బీమా చెల్లింపులు అందించి ఆ కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు మండలాల వారీగా మృతిచెందిన వారి వివరాలను తీసుకొని బీమా క్లెయిమ్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు 283 మంది రైతు కుటుంబాలకు రూ.14.15 కోట్ల బీమా క్లెయిమ్‌ను అందించాం. మిగిలిన 41 మంది రైతు కుటుంబాలకు త్వరలోనే బీమా క్లెయిమ్ అందిస్తాం.
-కొర్సా అభిమన్యుడు, జిల్లా వ్యవసాయ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles