నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యం...

Mon,June 24, 2019 05:06 AM

కొత్తగూడెం నమస్తే తెలంగాణ: మరుగుదొడ్ల నిర్మాణాలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆయా మండలాల ప్రత్యేక అధికారులతో మరుగుదొడ్ల నిర్మాణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండాలన్న లక్ష్యం చేరుకుని జూలై 20 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించాలన్నారు. మరుగు దొడ్ల నిర్మాణాలపై లబ్ధిదారుల్లో మార్పు వస్తుందని అన్నారు. అదే విదంగా మరి కొంత మంది లబ్ధిదారులు మరుగు దొడ్ల నిర్మాణాల కోసం ముందుకు వస్తున్నారని అన్నారు. భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. పినపాక లో మరుగుదొడ్ల నిర్మాణాలకు జిల్లాలో జిల్లాలో మేస్త్రీల కొరత ఉన్నందున నెల్లూరు నుంచి మేస్త్రీలను తెప్పించామన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ దుమ్మగూడెం మండలంలో అత్యధికంగా మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు. సారపాక లో నిర్మించే మరుగుదొడ్లకు ఐటీసీ సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుక బడిన చర్ల, దుమ్మగూడెం, పినపాక, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వారావుపేట మండలాల్లో లబ్ధిదారులు ముందుకు రాని లబ్ధిదారులను ఒప్పించే దిశగా చర్యలు తీసుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు. టేకులపల్లి, గుండాల మండలాల్లో మరుగుదొడ్ల నిర్మించుకునేందకు ముందుకు రాక పోతే ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయాలన్నారు. మణుగూరు మండలంలో మరుగుదొడ్లకు రింగులు కొరత ఉందని చెప్పగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇసుక కొరత లేదని, సిమెంట్ ఇటుక తయారీకి క్రషర్ల వద్ద ఉన్న డస్ట్ తెప్పించుకునేందుకు ట్రాక్టర్ చార్జీల క్లెయిమ్‌ల గురించి అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలన్నింటినీ అధిగమించి లక్ష్యం చేరుకోవాలని సూచించారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles