నేడు టీఆర్‌ఎస్ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

Mon,June 24, 2019 05:05 AM

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి సోమవారం భూమి పూజ చేయనున్నారు. పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఈ భూమికి సంబంధించిన అన్నీ అనుమతులను టీఆర్‌ఎస్ పార్టీ పొందింది. ఉదయం పదిగంటలకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా చైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. సోమవారం ఉదయం జరిగే కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై ఆదివారం సాయంత్రం టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమాలోచనలు చేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మించే స్థలాన్ని వారు పరిశీలించారు. కార్యకర్తలు, టీఆర్‌ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరవనున్నందున అవసరమైన చర్యలను ఏ విధంగా చేపట్టాలనే విషయంపై చర్చించారు. స్థలాన్ని పరిశీలించినవారిలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు తూము వెంకటేశ్వరచౌదరి, ఆళ్ల మురళీ, బిక్కసాని నాగేశ్వరరావు, ఎంఎ రజాక్, కాసుల వెంకట్, తొగరు రాజశేఖర్, లక్కినేని సురేందర్, కోరం సురేందర్, జెల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా హజరుకానున్నారు.

ఎకరం స్థలంలో రూ.60 లక్షల వ్యయంతో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్ ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లోనూ అన్నింటా పై చేయిగాగా నిలిచిన టీఆర్‌ఎస్‌కు జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని మంజూరు చేయడంతో కార్యకర్తలకు భరోసా నింపనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎకరం స్థలంతో పాటు కార్యాలయం నిర్మాణానికి రూ.60 లక్షల నిధులు కేటాయించింది. ఈ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ఈ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. వరుస విజయాలతో కొత్త జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన టీఆర్‌ఎస్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు పోతుంది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకున్న టీఆర్‌ఎస్ మరొ కొద్ది నెలల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుకునేందుకు పావులు కదుపుతుంది. ఇప్పటికే కొత్త జిల్లాలో తొలిసారిగా జిల్లా పరిషత్ పీఠం దక్కించుకున్న పార్టీ అభివృద్ధి దిశగా దూసుకు పోతుంది. ఇదే కాక ఎంపీపీ పీఠాలను సైతం కైవసం చేసుకుంది. నూతన పార్టీ కార్యాలయ నిర్మాణంతో నూతన జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలకు ఓ వేదిక ఏర్పాటు కానుంది. జిల్లాలోని నలు మూలల నుంచి పార్టీ కార్యకర్తలకు జిల్లా నాయకులను కలిసేందుకు ఈ కార్యాలయం వేదికగా నిలవనుంది.

హాజరు కానున్న టీఆర్‌ఎస్ నేతలు
కొత్త జిల్లా లో టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం శంకుస్థాపనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలు హజరవుతున్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, ఖమ్మం జడ్పీ చైర్మన్ బరపటి వాసుదేవరావు, ఆ పార్టీ ఇన్‌చార్జ్‌లు హాజరుకానున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles