పురపాలికల్లో ఓటర్ల గణన..!

Sun,June 23, 2019 02:45 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ పాలక గడువు జూలై 3తో ముగియనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని చర్యలను చేపట్టేందుకు ఇటీవల మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించింది. ఎన్నికలు నిర్వహించడం ఖాయం కావడంతో అందుకు అవసరమైన కార్యాచరణను ఎన్నికల అధికారులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనను మరోసారి చేపట్టింది. గతేడాది డిసెంబర్ నెలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల ఓట్ల గణనను చేపట్టి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. కానీ జనవరి నెలలో 18సంవత్సరాలు నిండిన యువతీయువకులు, విద్యార్థులకు మరోసారి ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగడం, మే నెలలో ఫలితాలు వెల్లవడడం జరిగింది. ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించేందుకు అవకాశం కల్పించడంతో భారీగానే ఓట్లు పెరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. దీంతో డిసెంబర్‌లో నిర్వహించిన గణనను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా గణన ప్రారంభించారు.

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో గణన
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీలలో ఈ గణనను చేపట్టేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలకు పాలకవర్గం ఉంది. కానీ పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఈ రెండు మున్సిపాలిటీలపై కోర్టులో కేసు నడుస్తున్నందున వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. అయినప్పటికీ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఈ గణన పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 22(శనివారం) ప్రారంభమైన ప్రక్రియ సుమారు 14రోజుల పాటు మున్సిపాలిటీలలోని వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేపట్టనున్నారు. జూలై 6వ తేదీని ప్రాథమికంగా ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత 7నుంచి 11వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 12 నుంచి 16వ తేదీ వరకు అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం, 17న జాబితాల్లో సవరణలు, అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు.

గత డిసెంబర్ గణనలో మహిళలే అత్యధికం
మున్సిపల్ ఎన్నికల్లో మహిళ ఓటర్లే కీలకం కానున్నారు. గతంలోలాగానే ఇప్పుడు కూడా మున్సిపల్‌లో కీలకపాత్ర పోషించనున్నారు. డిసెంబర్‌లో చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గణనలో మొత్తం 33వార్డుల్లో 54,727మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ సిబ్బంది లెక్క తేల్చారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 33వార్డుల్లో 54,727మంది ఓటర్లు ఉన్నారని లెక్క తేలింది. మొత్తం ఎస్సీ ఓటర్లు మహిళ ఓటర్లు కలుపుకొని 11,569, ఎస్టీ ఓటర్లు 3,483, బీసీ, మైనారిటీ, ఓసీ ఓటర్లు 32,385మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తంగా మహిళా ఓటర్లు 28,164మంది ఉన్నట్లు గుర్తించారు. అత్యధికంగా 2వ వార్డులో 1015మంది, 3వ వార్డులో 1025మంది, 4వ వార్డులో 1254, 5వ వార్డులో 1,248, 13వ వార్డులో 1,220, 23వ వార్డులో 1200, 24వ వార్డులో 1,382 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 7 వార్డుల్లో మహిళలే చైర్‌పర్సన్ పీఠాన్ని ప్రభావితం చేయనున్నారు.

పకడ్బంధీగా రూపొందించనున్న జాబితా
సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని మున్సిపల్ సిబ్బందికి అధికారులు ఆదేశించారు. తప్పులు లేకుండా స్పష్టమైన సమాచారంతో సిబ్బంది గణన చేయాలని అధికారులు సూచించారు. గతంలో చేసిన గణనలో కంటే ఈ సారి మహిళల ఓట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి తప్పులు లేకుండా జాబితాను పకడ్బంధీగా రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నారు. మొత్తంగా ఈ సారి ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో ఉన్నందున వారి చేతుల్లోనే మున్సిపల్ కౌన్సిల్‌కు పోటీచేసే అభ్యర్థుల గెలుపుఓటములు ఆధారపడి ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles