సమన్వయంతోనే ఫలితాలు సాధ్యం

Sat,June 22, 2019 01:18 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/గుండాల/లక్ష్మీదేవిపల్లి, జూన్ 21: స్వచ్ఛభారత్‌లో చేపట్టిన మరుగుదొడ్లు నిర్మించడంలో గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారుల వెంట ఉండి ప్రోత్సహిస్తేనే ఫలితాలు సాధించగలమని కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా చేపట్టిన మరుగుదొడ్లు గుండాలలో వేగవంతం చేసేందుకు కలెక్టర్ శుక్రవారం గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, బోడు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. గుండాల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా అధికారులు కలెక్టర్‌కు వివరిస్తూ గుండాల మండలంలో 1200 మరుగుదొడ్లు లక్ష్యం కాగా 300 మరుగుదొడ్లు ప్రారంభించడం జరిగిందని వివరించారు. మిగతా 900 మరుగుదొడ్లు ప్రారంభించేందుకు గ్రామస్థాయి అధికారులు లబ్దిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిన వాటిని రెండో దశలో నిర్మించాలని, వాటికయ్యే ఖర్చు రూ.34 లక్షలు విడుదల చేశామన్నారు. మెటీరియల్ తెప్పించి నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించాలని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే శౌచాలయాల నిర్మాణంలో వెనుకంజ వేయరాదని హితవుపలికారు.

అధికార యంత్రాంగం మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. గ్రామాల్లో ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్నారు. మరుగుదొడ్డి నిర్మాణాలు పూర్తి అయ్యో వరకు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామి సిబ్బంది, వివిద శాఖల మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మరుగుదొడ్లు పూర్తి చేసిన వారికి జాప్యం చేయకుండా డబ్బులు ఖాతాల్లొ జమచేయాలని అన్నారు. తొలుత టేకులపల్లి, బోడు, రామచంద్రునిపేట, పాతర్లపాడు గ్రామాల్లో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ ఏపీడీ కరుణాకర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి మస్తాన్‌రావు, ఎంపీడీవో నారాయణరావు, తహసీల్దార్ శివయ్య, ఈజీఎస్ ఏపీవో రఘునాధ్‌లు పాల్గొన్నారు.

నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్
లక్ష్మీదేవిపల్లి: మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కారుకొండ పంచాయతీలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి, ఈజీఎస్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles