పగటి దొంగలొచ్చారు... నిలువునా దోచుకెళ్లారు..

Sat,June 22, 2019 01:14 AM

కొత్తగూడెం క్రైం: దొంగలు తెలివిమీరారు. చోరీలకు, దోపిడీలకు సరికొత్త మార్గాలు వెతుకుతున్నారు. మాయదారి వేషాలేస్తున్నారు. తాళాలు, తలుపులు పగలగొట్టడం, రోడ్డుపై వెళుతున్న ఆడవాళ్ల మెడలోని నగలను లాక్కుని పారిపోవడం... ఇవన్నీ పాత పద్ధతులు. దొంగలు ఇప్పుడు చావు తెలివితేటలు సంపాదించారు. పట్టపగలు.. నడిరోడ్డుపై... నిలబెట్టి మరీ నిలువునా దోచుకుంటున్నారు. మనం అప్రమత్తంగా లేకపోతే... అవగాహన పెంచుకోకపోతే... ఇదిగో, ఈమెలాగా బాధితులుగా మిగిలిపోతాం. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ లింగనబోయిన ఆదినారాయణ తెలిపిన వివరాలు...

కొత్తగూడెంలో ఏం జరిగిందంటే...
కొత్తగూడెం పట్టణంలోని గాజులరాజం బస్తీకి చెందిన అరిపినేని సుజాత, శుక్రవారం మధ్యాహ్నం చికెన్ షాపు నుంచి ఇంటికి వెళుతోంది. రామచంద్ర ఆడిటోరియం సమీపంలో ఆమెను ముగ్గురు అగంతకులు ఆపారు. మేము పోలీసులం. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఇటీవల ఓ దొంగల ముఠా తిరుగుతోంది. ఆడవాళ్ల చెవులు, ముక్కులు కోసి నగలు ఎత్తుకుపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీ నగలు తీసి ఈ సంచీలో పెట్టుకోండి అంటూనే, ఓ సంచీని ఆమెకు ఇచ్చారు. ఆమె తన ఒంటిపై ఉన్న సుమారు ఎనిమిది తులాల బంగాపు నగలు తీసి ఆ సంచిలో పెట్టుకుని, చేతిలో పట్టుకుని వెళుతోంది. నాలుగడుగులు వేయగానే, సంచీ ఇచ్చిన అగంతకుల్లో ఇద్దరు ద్విచక్ర వాహనంపై వచ్చారు. వారిలో ఒకడు... సంచీని జాగ్రత్తగా పట్టుకోవాలి.

అలా కాదు, ఇదిగో ఇలా... అంటూనే, ఆమె చేతిలోని సంచిని తీసుకున్నాడు. ఆమె దృష్టిని మళ్లించి, తన చేతిలోనే మరో సంచిని ఆమె చే తుల్లో పెట్టాడు. ఆ వెంటనే, ఆ ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయారు. ఆమె నడుచుకుంటూ వెళుతూనే, తన చేతిలోని ఆ సంచిని విప్పింది. షాక్... అందులో తన నగలు లేవు, రాళ్లు ఉన్నాయి. ఏడ్చుకుంటూ పరుగు పరుగున తన ఇంటికి వెళ్లింది. కుటుంబీకులతో కలిసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ లింగనబోయిన ఆదినారాయణ వెం టనే స్పందించారు. సిబ్బందితో కలిసి, ఆ అగంతకులు ఆమెను అటకాయించిన స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల పుటేజి పరిశీలించారు. ఆమె చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఆ దోపిడీ దొంగలు రెండు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒకడు (వాహన చోదకుడు) హెల్మెట్ ధరించాడు. వాడి వెనుక కూర్చున్నవాడేమో... సీసీ కెమెరాలకు తన మొహం కనిపించకుండా తల దించుకున్నాడు.

త్వరలోనే పట్టుకుంటాం...
ఈ దోపిడీ దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్ ఆదినారాయణ చెప్పారు. బాధితురాలి కి న్యాయం చేస్తామన్నారు. బాధితురాలు సుజాత ఫిర్యాదుతో కేసును దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. దొంగలు, దోపిడీదారులు, మోసగాళ్లను పట్టుకోవడంలో తమకు సహకరించాలని ప్రజలను కోరారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles