పల్లెపల్లెనా పండుగ

Fri,June 21, 2019 02:09 AM

-కాళేశ్వర స్వప్నం.. నేడు సాకారం..
-తెలంగాణకు జలహారం..
-అపర భగీరథుడు సీఎం కేసీఆర్
-13 జిల్లాల్లో 45 లక్షల ఎకరాలు సస్యశ్యామలం
-సంబురాలకు సిద్ధమైన ఉమ్మడి జిల్లా రైతులు, ప్రజలు
-నేడు భారీ బైక్‌ర్యాలీలు, క్షీరాభిషేకాలు
ఒక అద్భుతం...కాదు..కాదు.. మహాద్భుతం.. తెలంగాణ నేలపై ఆవిష్కరించేందుకు కొన్ని గంటలే మిగిలింది. తెలంగాణ ప్రజల కల నేరవేరుతున్న క్షణాన 4 కోట్ల ప్రజల ఆనంద భాష్పాలతో తెలంగాణ భూమి పరవశించే రోజురానే వచ్చింది. దీని కొరకు ఎన్ని త్యాగాలు, ఎన్ని ఆత్మబలిదానాలు, ఎంత మంది రక్తతర్పణలు చేశారో యావత్ దేశం ముందు ఉంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి మాటలను అక్షరాల వాస్తవరూపం దాల్చే మహా యజ్ఞానికి నాటి ఉద్యమ నేత, నేటి పరిపాలకుడు, అపర భగీరథుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు.

మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు.. భూగర్భంలో భారీ సర్జ్‌పూల్‌లు.. ఆసియాలోనే అతిపెద్ద భారీ మోటార్లు.. వందలాది పంపులు.. భారీ సొరంగాలు, కాలువలు.. మరెన్నో రిజర్వాయర్ల సమాహారమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నేడు (శుక్రవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. ఇందుకు పునాదిరాయి పడిన మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్ వేదికవుతున్నాయి. ఆ మహాద్భుతం ఆవిష్కృతం కానుండగా, తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రతి బిడ్డ సంబురాలు జరుపుకోనున్నారు. -

నేడు ఊరు..వాడ సంబురాలు...
ప్రపంచంలోనే ఎత్తిపోతల పథకాలలో అతిపెద్దది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇంత పెద్ద పథకాన్ని కేవలం మూడేండ్ల కాలంలోనే నిర్మించి ఇవ్వాల ప్రారంభించబోతున్న సందర్భాన తెలంగాణ రాష్ట్రం మొత్తం సంబురాలకు సిద్ధ్దమైంది. సీఎం కేసీఆర్ మరో కాటన్‌గా చరిత్రను సృష్టించబోతున్న సమయాన తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. కాళేశ్వరం ప్రారంభించగానే జిల్లాలోని అన్ని గ్రామాల్లో పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకునేలా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల బాధ్యులు వారి క్యాడర్‌కు సూచించారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో భారీ ఎత్తున సంబురాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీసెంటర్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడే పటాకులు కాల్చి పంచిపెట్టనున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసేలా ఏర్పాట్లు చేశారు.

45 లక్షల ఎకరాలకు సాగునీరు..
సాగునీరు లేక భూములు ఎండిపోయి... పశువులను అమ్ముకొని.. పెళ్లాం పిల్లలను వదిలి బతుకు దేరువుకు బయలేల్లిన కుటుంబాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ , మెదక్, ఖమ్మం జిల్లాల నుంచి వేలాది కుటుంబాలు ఉపాధి కొరకు ముంబాయి, దుబాయి, చెన్నై, సూరత్ లాంటి ఎన్నో ప్రదేశాలకు వలసలు పోయారు. ఈ పరిస్థితులను, ఈ దుస్థితిని రూపుమాపాలంటే సాగునీరు అందించడమే దీనికి పరిష్కారమని సీఎం కేసీఆర్ భావించారు. దీంతో గోదావరి జలాలను తెలంగాణాకు మళ్లించేలా కాళేశ్వరానికి శ్రీకారం చుట్టారు. పూర్తిగా ఎత్తిపోతల పథకం ఇది. ప్రపంచంలో ఇంత భారీస్థాయిలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఎక్కడా లేదు. 13 జిల్లాలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీనిలో 186 మండలాల్లో గల 1581 గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీనికి తోడు అదనంగా మరో 19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అంతే కాకుండా గ్రేటర్ హైద్రాబాద్‌కు 30 టీఎంసీలు, ఇతర ప్రాంతాలకు 10 టీఎంసీల తాగునీరు కాళేశ్వరం ద్వారా అందనుంది. ఈ ప్రాజెక్టులో 19 పంపుహౌస్‌లు, 20 బ్యారేజ్‌లు, 200ల కిలోమిటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమిటర్ల కాలువలు, 98 కిలోమిటర్ల నీటిని తరలించే గొట్టాలు ఈ ప్రాజెక్టులో అద్భుతాలు.

మేడిగడ్డ నుంచే కాళేశ్వరం ప్రారంభం..
మేడిగడ్డ దగ్గర 1.63 కిలోమిటర్ల వెడల్పు బ్యారేజ్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలవుతుంది. అక్కడ నుంచి నీటిని కన్నెపల్లి పంపు హౌస్‌కు మళ్లిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన 11 మోటర్ల ద్వారా నీటిని అన్నారం బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తాయి. 66 గేట్లతో 10.87 టీఎంసీల నిల్వసామర్థ్యంతో నిర్మించిన అన్నారం బ్యారేజ్ నుంచి నీటిని ఒకొక్కటి 40 మెగా వాట్ల సామర్థ్యం గల 8 భారీ మోటార్లతో నిర్మించిన అన్నారం పంపుహౌస్, 34 మీటర్ల ఎత్తుకు పంపుచేసి, 74 గేట్లతో నిర్మించిన సుంధిళ్ల బ్యారేజ్‌లోకి ఎత్తిపోస్తుంది. ఈ సుందిళ్ల బ్యారేజ్ నుంచి ఇక్కడి పంపుహౌస్ 40 మీటర్ల ఎత్తుకు పంపుచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తుంది. దీనికోసం ఒకొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం గల 9 భారీ మోటార్లు అమర్చారు. ఇక ఎల్లంపల్లి నుంచి 9.53 కిలోమిటర్ల భారీ స్వరంగ మార్గాల ద్వారా పంపుహౌజ్‌లకు, అక్కడ నుంచి మేడారానికి నీరు వెళ్తుంది. ఈ స్వరంగ మార్గాలతో పాటు భూగర్భంలోని పంపుహౌస్ నిర్మించి, ఇక్కడ ఒక్కొక్కటి 124 మెగావాట్ల సామర్థ్యంతో 7మోటర్లు ఏర్పాటు చేశారు. మేడారం నుంచి 1.95 కిలోమీటర్ల కాలువ, 15.37 కిలోమీటర్ల దూరం గల రెండు స్వరంగ మార్గాల ద్వారా ప్రవహించే నీరు భారీ పంపుహౌస్‌ల ద్వారా మిడ్‌మానేరుకు చేరుతుంది. ఈ పథకంలో ఎక్కువ సామర్థ్యం గల మోటర్లు, పంపులు ఉన్నవి ఇక్కడే. ఇక్కడ ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి సాయంతో నీటిని 117 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కాలువలో పోసి శ్రీరామ్‌సాగర్ వరద కాలువలోకి మళ్లీస్తారు. దీని నుంచి ఎత్తిపోసే నీరు మిడ్ మానేరుకు చేరుతుంది. మిడ్ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా మల్లన్న సాగర్ వరకు నీళ్లు వస్తాయి. మల్లనసాగర్ నుంచి ఒక కాలువ సింగూరు వైపు మరోకాలువ కొండ పోచమ్మ, గంథ మల్ల, బస్వాపుర తదితర రిజర్వాయర్లకు నీటిని సరఫరా చేస్తుంది. అక్కడ నుంచి భూములకు కాలువల ద్వారా నీళ్లు అందుతాయి.

వేగంగా భూసేకరణ...
ఏ ప్రాజెక్టును నిర్మించాలన్నా...భూసేకరణ అత్యంత విలువైనది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములను సేకరించాల్సి వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు 80 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాల్సి ఉన్నది. దీనిలో ఇప్పటి వరకు 55 వేల ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. దీని కొరకు రైతులకు పునరావాసం క్రింద వేల కోట్ల రూపాయాలను ప్రభుత్వం ఖర్చుచేసింది. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,550 కోట్లను ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టు వలన నిరవాసితులైయ్యే 6200ల కుటుంబాల కోసం ఇప్పటి వరకు రూ. 550 కోట్లకు పైగా ఖర్చుచేశారు.

ఒక్క ఏడాదిలోనే అన్ని అనుమతులు....
కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ప్రభుత్వం ఒకే సంవత్సరంలో సాధించింది. పకడ్బందీ ప్రణాళికతో సీఎం కేసీఆర్ అడుగులు ముందుకు వేయడం వలన కేంద్రం అనుమతులు జారీ చేసింది. 2017 పిబ్రవరిలో కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్ )ను కేంద్ర జలసంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. కేంద్ర జలసంఘం అనేక కోర్రీలకు సమాధానం చెబుతూ 2017 అక్టోబర్ 30న మొదటి నీటి లభ్యత వస్తే 2018 జూన్‌నాటికి జలసంఘం సాంకేతిక జలమండలి అనుమతి లభించింది. మొదటి అనుమతికి, సాంకేతిక సలహా కమిటీకి మధ్యనున్న 8 నెలలోనే అంతర్‌రాష్ట్ర అనుమతి, అటవీ, పర్యావరణం, సాగు ప్రణాళిక, ఇరిగేషన్ ప్లానింగ్ ఇలా అన్ని అనుమతులు లభించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షించి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా కేంద్రం అతితక్కువ సమయంలో అనుమతులు జారీ చేసింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను, వివిధ ఏజెన్సీల పెద్దలను కలవడం ద్వారా అనుమతులు సులభంగా వచ్చాయి.

మరో కాటన్ కేసీఆర్... మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఎన్నో ప్రభుత్వాలున్నాయి. కానీ సీఎం కేసీఆర్ లాంటి పాలన గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గత ప్రభుత్వాలు మొక్కుబడిగా పరిపాలన చేపట్టాయి కాని ప్రజలకు సేవ చేద్దామనే చిత్తశుద్ధ్ది వారిలో లేదు. ఎన్నో పోరాటాలు, ఆత్మబలిదానాలు, ఎన్నో త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ర్టాన్ని ఏవిధంగానైతే కేసీఆర్ సాధించారో... అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణాను నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. సగం తెలంగాణకు సాగునీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. గోదావరి నదిపై పూర్తిగా ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మించిన ఈ ప్రాజెక్టుకు పక్క రాష్ర్టాల ప్రభుత్వాలతో ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంలో కేసీఆర్ విజయవంతమయ్యారు. ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడాలేదు. తెలంగాణ ప్రజలు గర్వించదగిన రోజు ఇది. స్వాతంత్య్రం రాకముందు ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రాజమండ్రి వద్ద ఆనకట్ట నిర్మించిన సర్ అర్థర్‌కాటన్ ఏ విధంగానైతే చరిత్రలో నిలిచిపోయారో... సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోతారు. సీఎం కేసీఆర్‌కు, ఇంజనీరింగ్ అధికారులకు కృతజ్ఞతలు.

అపర భగీరథుడు కేసీఆర్... మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అపర భగీరధుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ కోటి ఏకరాల మగాణిగా తీర్చి దీద్దడానికి, కంకణం కట్టుకొని 3 సంవత్సరాల కాలంలో రూ. 80,500 కోట్ల అంచనాతో ఇప్పటి వరకు రూ. 50,000 కోట్ల వ్యయంతో పూర్తిచేసిన భారీ ఎత్తిపోతల పథకం నేడు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్న శుభసందర్భంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాలుగా కరువు చాయలతో అలాడిన తెలంగాణ రాష్ట్రం ధాన్య సిరులతో కలకలలాడే శఖానికి ఆరంభం ఇదేనన్నారు. వందల టీఎంసీల నీటిని భీడు భూములకు తరలించే అరుదైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని, సాగునీటి ప్రాజెక్టు చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయమని, ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల సాగునీటి ఎత్తిపోతల పథకం కాళేశ్వరమన్నారు. ప్రపంచ చరిత్రలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రికార్డులు నేలకొల్పుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. బహుళ దశల ఎత్తిపోతల పథకం అయిన కాళేశ్వరం క్రింద మేదిగడ్డ అన్నారు. సుంధిల్ల బ్యారేజ్‌లుతో పాటు 19 రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్ కలల స్వప్నం సాకారమైన అద్బుత సందర్భం ఇదేనన్నారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందన్నారు. తెలంగాణ రైతాంగం, ప్రజలు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆశగా, దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నవి. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని కరువు ప్రాంతాన్ని భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతాయన్నారు. ఇప్పుడు కాళేశ్వరం జలాలు కూడా తోడైతే జిల్లాలో కరువు కనుచూపుమెర కనిపించే అవకాశం లేదు. చరిత్ర సృస్టిస్తున్న మన ప్రియతమ నేత కేసీఆర్ ప్రయత్ననానికి అండగా ఉందాం. తెలంగాణ కోటి ఎకరాల మగాణికి సాగునీరు అందిస్తామన్న లక్ష్యాన్ని సాధిస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజానీకం అనందోత్సహాలతో ఈ అద్బుత క్షణాల్లో భాగ్యస్వాములు కావాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ శుభ సందర్భంలో మన ఉమ్మడి జిల్లాలోని రైతన్నలు, నాయకులు, కార్యకర్తలు వాడవాడల సంబురాలు నిర్వహించి, ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగస్వాములు అవ్వాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం ఎంపీ నామా నాగేశ్వరరావు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా మూడేళ్ల రికార్డు సమయంలో రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఈ నెల 21వ తేదీన ప్రారంభోత్సవం చేయనున్నారని, ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఊరూరా సంబురాలు నిర్వహించాలని ఖమ్మం లోక్‌సభ పక్ష నేత ఎంపీ నామా పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు భారతదేశంలో అత్యంత పెద్ద మల్టిలెవల్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, కేసీఆర్ ఆలోచన కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో భాగం కాళేశ్వరం అని ఎంపీ నామా పేర్కొన్నారు. మానవ నిర్మిత మహాకట్టడంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. ఆ తరహాలో చెప్పుకునే మరో ప్రాజెక్టు కాళేశ్వరమని దీని డిజైన్, లక్ష్యం, నీటిని అందిపుచ్చుకునే విధానం, జలం పరుగులు తీసి పోలం చేరే విధానం కూడా భిన్నమని, అందుకే ఇది ఒక అద్భుతమైన కట్టడమని నామా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి అంకురార్పణ చేసినట్లయిందని, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా కాళేశ్వరం నీరు అందనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు నిధుల విషయంలో కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రంలోని బ్యాంకుల సహకారంతో కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అతి తక్కవ వ్యవధిలో నిర్మాణం పూర్తి చేయించటం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లు, ఇతర విభాగాలకు చెందిన వారందరూ కూడా కలసికట్టుగా రాత్రింబవళ్లు శ్రమించటం వలనే రికార్డు సమయంలో పూర్తి అవటం జరిగిందని, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనే యజ్ఞంలో పాలుపంచుకొన్న ప్రతిఒక్కరికి నామా అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హాయంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలోనే కాక, ప్రపంచ దేశాలలో నిర్మించిన ప్రాజెక్టులలో ఇది ఒక కలికితురాయిన ప్రాజెక్టు అని నామా పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి వస్తున్న అతిరథ, మహారధుల అందరికి స్వాగతమని నామా తెలిపారు.

అత్యధిక విద్యుత్ వినియోగం...
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అత్యధిక విద్యుత్ వినియోగం అవసరం ఏర్పడుతుంది. రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4992.47 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా మూడోవ టీఎంసీ కూడా పూర్తి అయితే 7152 మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి అన్ని అనుమతులను ప్రభుత్వం సకాలంలోనే సాధించడం గమనార్హం.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles