ఇసుక అక్రమ నిల్వలపై అధికారుల దాడులు

Fri,June 21, 2019 02:05 AM

వైరా, నమస్తే తెలంగాణ, జూన్ 20 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సరిహద్దు ప్రాంతమైన వైరా మండలంలోని గన్నవరం, ఖానాపురం గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన గన్నవరం గ్రామంలో జరుగుతున్న తెరచాటు వ్యాపారాలపై గురువారం నమస్తే తెలంగాణ దినపత్రికలో అక్రమార్కులకు గన్నవరం అనే వార్తా కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వైరా తహసీల్దార్ జె.సంజీవ ఈ అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్‌ఐ ఎస్.రవికుమార్ రెవెన్యూ సిబ్బందితో గన్నవరం, ఖానాపురం గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక కుప్పలను పరిశీలించి సీజ్ చేశారు. ఈ ఇసుక కుప్పల చుట్టూ రెవెన్యూ అధికారులు ముగ్గు పోశారు. గన్నవరం, ఖానాపురం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సుమారు 100 ట్రాక్టర్ ట్రక్కుల ఇసుకను సీజ్ చేశారు. ఈ ఇసుకను త్వరలో బహిరంగ వేలం ద్వారా రెవెన్యూ అధికారులు విక్రయించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనంపై జిల్లా పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ స్పందించారు. ఈ అక్రమాలకు సంబంధించి వివరాలను వెంటనే సేకరించాలని పోలీస్ ఉన్నతాధికారులు స్పెషల్ బ్రాంచి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచి అధికారులు గన్నవరం గ్రామం కేంద్రంగా గుట్టుగా గుట్కా వ్యాపారం నిర్వహించే వ్యాపారికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గన్నవరం గ్రామ సమీపంలోని సరిహద్దును రేషన్ బియ్యం దాటిస్తున్న వ్యాపారులెవరో, కోడి పందేలు, పేకాట నిర్వహిస్తున్న నిర్వాహకులెవరో అనే విషయాలపై స్పెషల్ బ్రాంచి అధికారులు క్షుణ్ణంగా వివరాలు సేకరిస్తున్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles