భూ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ గ్రామసభలు..

Thu,June 20, 2019 01:25 AM

జూలూరుపాడు: జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భూ సమస్యలు పరిష్కారం అయ్యోవరకు రెవెన్యూ గామసభలు నిర్వహించాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ స్థ్ధానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని బేతాళపాడు గ్రామసభను బుధవారం ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1950నుంచి 1980వరకు పహణీల్లో కొనసాగిన సర్వే నెంబర్లు 1981 తర్వాత నెంబర్లు మారాయని దీంతో రికార్డుల్లో దొర్లిన తప్పిదాలతో గిరిజన రైతులమైన తమకు అన్యాయం జరుగుతుందని గ్రామానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖాస్ర్తా పహాణీ ఆధారంగా అర్హులైన రైతులను గుర్తించి పట్టదారు పాసు పుస్తకాలు అందజేయాలని స్థ్ధానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గతంలో మూడు పర్యాయాలు అగ్ని ప్రమాదం చోటుచేసుకొని గ్రామంలో సగానికిపైగా ఇళ్లు దగ్ధం అయ్యాయని దీంతో చాలా మంది రైతుల వద్ద ఆధారాలు లేవని గ్రామ సర్పంచ్ గుగులోత్ రాందాస్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం భూమి సాగుచేసుకుంటున్న రైతుల వివరాలను క్షేత్రస్థ్ధాయిలో పరిశీలించి రెవెన్యూ గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి పట్టదారు పాసు పుస్తకాలను అందజేయాలని ఆదేశించారు. పాపకొల్లు రెవెన్యూ పరిధిలో 1400ఖాతాలు ఉండగా 600ఖాతాలు మాత్రమే డిజిటల్ సంతకాలు అయ్యాయని, మిగిలిన వాటిని త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గిరిజనేతర రైతులకు సంబంధించిన దరఖాస్తులను రెవెన్యూ గ్రామసభల్లో అధికారులు తీసుకొని పరిశీలించడం లేదని, కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా 1/70 యాక్ట్‌కు ముందు నుంచి పట్టాలు కల్గి ఉన్న రైతులకు మాత్రమే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల చివరి నాటికి నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. విధుల్లో సిబ్బంది నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వీరి వెంట ఓడీఎఫ్ స్పెషలాఫీసర్ కే.సుధాకర్, తహసీల్దార్ చిట్టోజు రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో పుల్లూరు జగదీశ్వరరావు, ఆర్‌ఐలు వీరభద్రం, రవి పలుశాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ వేగవంతం చేయాలి..: కలెక్టర్
అన్నపురెడ్డిపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. బుధవారం మండల పరిధిలోని పెంట్లం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొని, మండలంలో భూరికార్డుల ప్రక్షాళన పురోగతి, పట్టాదార్ పాస్‌పుస్తకాల మంజూరు వివరాలను తహసీల్దార్ జగదీశ్వర్‌ను అడిగి తెలుసుకొన్నారు. ఆధార్, ఈకేవైసీ లేనివారు, పట్టాదారు చనిపోయిన కేసులు, ఆర్వోఎఫ్‌ఆర్, ట్రైబుల్ సాదాబైనామా తదితర కేసులను సత్వరమే పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

పాత పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నా తమకు నూతనంగా పాస్‌పుస్తకాలు మంజూరు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెంట్లం గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనును పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వలేదని, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీస్‌ను జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రజిత్‌కుమార్ శైనీ మాట్లాడుతూ.. అధికారులు రెవెన్యూ గ్రామాల వారీగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్హలైన రైతులను గుర్తించి పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. పట్టాదార్ మృతి చెందితే వారసులకు పట్టా మంజూరు చేయాలన్నారు. భూరికార్డుల ప్రక్షాళనను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్, ఆర్‌ఐ హరిప్రసాద్, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles