హరితహారానికి అంతా సిద్ధం..

Wed,June 19, 2019 01:19 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మొక్కలే ప్రాణుల మనుగడకు జీవనాధారం... ఈ పచ్చని చెట్లే ప్రాణవాయువును అందించి ప్రాణుల ఆయుష్షును పెంచేవి... అంతే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రాణకోటిని పదిలంగా ఉంచేందుకు పాటుపడుతున్నాయి. ఈ చెట్లే లేకపోతే భూమి కాలుష్యకారణంగా మారి జీవుల మనుగడే ప్రశ్నార్థకమయ్యేది... అటువంటి మొక్కలను విరివిగా నాటి వాటి సంరక్షణకు బాధ్యతలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం... రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించేందుకు ఈ హరితహారం కార్యక్రమం ఎంతగానో ఉయోగపడనుంది. స్వరాష్ట్ర పాలనలో తొలి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ మదిలో పురుడుపోసుకున్న తెలంగాణకు పచ్చలహారం ఈ హరితహారం కార్యక్రమం... హరితహారం కార్యక్రమం ఐదవ విడుతకు సిద్ధమైంది... వర్షాకాలం ఆరంభం కానుండటంతో వచ్చేనెల మొదటి వారంలో హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తోంది... గత కొన్ని నెలల నుంచే జిల్లా యంత్రాంగం నర్సరీల్లో మొక్కలను పెంచుతూ హరితహారం కార్యక్రమం కింద మొక్కలను నాటేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది ఐదవ విడుత హరితహారం కార్యక్రమంలో 1.40 కోట్ల మొక్కలు నాటడమే ధ్యేయంగా జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆధ్వర్యంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు.

హరితహారం విజయవంతానికి ప్రత్యేక కృషి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూలైలో నిర్వహించనున్న ఐదవ విడుత ‘హరితహారం’ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా విజయవంతంగా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. గతేడాదిలాగా కాకుండా ఈ ఏడాది ప్రతీ గ్రామపంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికా రూపకల్పన చేసి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇతర మండలాల నుంచి మొక్కలను తీసుకువచ్చి మొక్కలు నాటేలా కాకుండా ప్రతీ గ్రామపంచాయతీ ఖచ్చితంగా ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచే బాధ్యతను అప్పగించడంతో నర్సరీని ఏర్పాటు చేశారు. ‘ఒక గ్రామపంచాయతీ - ఒక నర్సరీ’ని ఏర్పాటు చేయడంతో మొక్కల పెంపకం, వాటి సంరక్షణ బాధ్యతలను వన సేవకులకు అప్పగించారు. దీంతో వారు గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో విత్తనాలు వేయడం మొదలుకొని విత్తనాలు మొక్కలు ఎదిగే వరకు వన సేవకులు సంరక్షణ చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం మొక్కలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూలైలో ప్రారంభమయ్యే ‘హరితహారం’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా 1.40 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్‌డీఓ) కోటి మొక్కలు, అటవీశాఖ లక్ష్యం 40లక్షలను అధికారులు లెక్క తేల్చారు. ఇప్పటికే డీఆర్‌డీఓ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టారు.

‘వన్‌ జీపీ - వన్‌ నర్సరీ’లో పెరుగుతున్న మొక్కలు
జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలో ప్రతీ గ్రామపంచాయతీకి ఒక నర్సరీ ఉంటే మొక్కలను సులువుగా ఆయా గ్రామాల్లో నాటడంతో పాటు ప్రజలను అత్యధికంగా భాగస్వాములను చేయడం సాధ్యమవుతుందని, ఫలితంగా ఎక్కువగా మొక్కలను సంరక్షించడం జరుగుతుందని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని 479 పంచాయతీలలో 429 నర్సరీలను ఏర్పాటు చేసిన ఆయా నర్సరీలలో మొక్కలను పెంచి సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. ప్రతీ గ్రామపంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ కొన్ని గ్రామపంచాయతీలో స్థలకొరత, నీటి వసతి ఇబ్బంది వల్ల ఆ గ్రామపంచాయతీలో పెంచే మొక్కల లక్ష్యాన్ని, ఆ దగ్గరలోని పంచాయతీలలో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచేందుకు జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతులను తీసుకొని మొక్కలు పెంచారు. 429 గ్రామపంచాయతీలో మొత్తం సుమారు ఒక కోటి మొక్కలను పెంచుతున్నారు.

టేకు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం
గతేడాది కేవలం 21 మండలాల్లో 21 నర్సరీలలో మొక్కలను పెంచగా ఈ ఏడాది ప్రతీ గ్రామపంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని అన్ని పంచాయతీలలో నర్సరీలు ఏర్పాటయ్యాయి. టేకుతో పాటు వెదురు, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయి, కర్జూరం, నిద్ర గన్నేరు, మల్బర్‌ వేప, గానుగ, వేప, కదంబ, గుల్‌మొహర్‌, మారేడు, స్పాంథోడియా, కరివేపాకు, గోరింట, ఉసిరి, చింత, రేగు, ఈత, నేరేడు తదితర మొక్కలు ఈ నర్సరీలో పెంచారు. ఒక్కో నర్సరీలో ఒక వన సేవకుడితో పాటు 10 మంది ఉపాధి హామీ కూలీలను నియమించి ఈ మొక్కల పర్యవేక్షణను చేపట్టారు.
టేకు మొక్కలే అధికం
డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీలలో గతేడాది లాగానే 33లక్షల టేకు మొక్కలు పెంచి నాటనుంది. ఈ టేకు వృక్ష జాతి అంతరించిపోయే దశలో ఉండటం, గృహ, ఫర్నీచర్‌ అవసరాలతో పాటు ఎక్కువ విలువ కలగడంతో టేకు మొక్కలు నాటేలా ప్రభుత్వం నిర్ధేశించింది. ఎలాంటి వాతావరణంలోనైనా టేకు మొక్కలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందునే పెంచనుంది.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles