పక్షం రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలి

Wed,June 19, 2019 01:17 AM

-కొమరారంలో మరుగుదొడ్ల నిర్మాణాలను
-తనిఖీ చేసిన కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ
ఇల్లెందు రూరల్‌ : పక్షం రోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు లక్ష్యాన్ని చేరుకోవాలని, దీనికోసం అన్ని విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. మండలంలోని కొమరారం గ్రామంలో మంగళవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్‌ నాలి కృష్ణవేణి, కార్యదర్శి షర్మిల ఇరువురు మరుగుదొడ్ల నిర్మాణ పనులపై ఉండటాన్ని గమనించి గ్రామపంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పక్షం రోజుల్లో నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునే విధంగా కృషి చేయాలన్నారు. ఇప్పటివరకు కొనసాగిన నిర్మాణాలు సంతృప్తికరంగా లేవని స్పష్టం చేశారు. అనంతరం గ్రామంలో వైద్యశాల, రేషన్‌ దుకాణాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పట్టాభూములకు సంబంధించి అర్హులందరికీ పట్టాదారు పాస్‌పుస్తకాలు అందాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో అర్హులకు అన్యాయం జరిగితే క్షమించబోమని స్పష్టం చేశారు. కొమరారం రెవెన్యూ పరిధిలో పట్టా భూముల విస్తీర్ణం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం షోకాజ్‌ మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గ్రామస్తులతో మాట్లాడుతూ..పోడు భూముల విషయంలో నిబంధనలకు అనుగుణంగా అధికారులు పనిచేస్తారని చెప్పారు. పక్షం రోజుల్లో మరోసారి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకొని ఉండాలని చెప్పారు. అనంతరం డీఆర్‌డీవో పీడీ జగత్‌కుమార్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మరియన్న గ్రామపంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణాలను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ, రెవెన్యూ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles