పంట పెట్టుబడికి సాయం..

Tue,June 18, 2019 12:28 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సమైక్య పాలనలో అష్టకష్టాలు పడ్డాడు. సమయానికి విత్తనాలు, ఎరువులు దొరుకక నానా అగచాట్లు ఎదుర్కొన్నాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర సైతం దొరక్క వ్యవసాయమే దండగ అనే స్థాయికి వచ్చారు. స్వరాష్ట్ర పాలనలో వ్యవసాయానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌ భారీ సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతులకు పెట్టుబడికింద సహాయం అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పంటపెట్టుబడి సాయం కింద ఏడాదికి రెండు దఫాలుగా రూ.5వేల చొప్పున మొత్తం రూ.10వేలను అందిస్తున్నారు. అంతేకాకుండా తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తూ వ్యవసాయ రంగానికి ఊతమిస్తున్నారు. దీంతో రైతు సాధారణంగా పండించే పంట కంటే అధిక దిగుబడి సాధిస్తున్నారు.

గతంలో ఎప్పుడు చూసినా రైతు దగా పడుతూనే ఉండేవాడు. కానీ స్వరాష్ట్ర పాలనలో రైతు సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్‌ రైతులకు రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీలలో ఆధునిక వ్యవసాయ పరికరాలు లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి సమైక్య పాలనలో దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. దీంతో జీతమెక్కువ వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడ్డ యువకులు సైతం వ్యవసాయం వైపు మళ్లీ ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. తొలకరికి ముందే ప్రభుత్వం విత్తనాలను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేస్తుంది. అంతేకాకుండా పంటకు అవసరమయ్యే ఎరువులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసి కొరత లేకుండా చూస్తుంది. దీంతో రైతు ఎన్నడూ లేనంత ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు..
గత పాలకుల కాలంలో విత్తనాలకు, ఎరువులకు కొట్లాటలు కొనసాగేవి. గ్రామం నుంచి రైతు ఉదయాన్నే బయల్దేరి మండల కేంద్రానికి చేరుకొని విత్తనాల కోసం, ఎరువుల కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. నేడు అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయశాఖ అధికారులు బయోమెట్రిక్‌ విధానం ద్వారా మండల కేంద్రాల్లోని ఎరువుల దుకాణాల్లో రైతులకు అందుబాటులో ఉంచారు. దీంతో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. మేలు రకమైన పత్తి, వేరుశనగ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చూస్తోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండు దఫాలుగా రూ.10వేలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతుకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఇటీవల కాలంలో ఏడాదికొకసారి మాత్రమే అందించిన పంట సాయం రెండు దఫాలుగా రూ.10 వేలను అందిస్తూ రైతులకు పెట్టుబడికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోంది. జిల్లాలో 1,22,425 మంది రైతులు ఉండగా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద రూ.190.27 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు మండల స్థాయిలో రైతుల వివరాలను సేకరించి 76,663 మంది రైతులకు సాయం అందించేందుకు వారి పేర్లను ట్రెజరీకి పంపించారు. దీంతో తొలి విడుతగా రూ. 95.45కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కొత్తగా పెంచిన రైతు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ నెల 15 నుంచి 30వ తేదీ వరకు రైతులకు దశల వారీగా పంట పెట్టుబడిసాయం వారి ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు చేశారు.

రైతన్న బిజీబిజీ..
తొలకరి వానలు కురవడంతో రైతన్నలు సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులు దున్ని పలు రకాల విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. వేసవి దుక్కులు చేసిన రైతన్నలు సాగుకు సిద్ధం చేసి విత్తనాలు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వర్షం కురిసి దుక్కులు పదునుండటంతో పలువురు రైతులు పత్తి విత్తనాలు దుక్కుల్లోనే చల్లుతున్నారు. వారం రోజులుగా రైతులు విత్తన దుకాణాల్లో మేలి రకమైన పత్తి విత్తనాలు కొనుగోలు చేసి అదునుకోసం ఎదురుచూస్తున్న రైతులు జిల్లావ్యాప్తంగా కొన్ని రోజుల కింద వర్షం కురియడంతో పదును పోకముందే విత్తనాలు వేశారు. కొంత మంది రైతులు వరి నారు కూడాపోసి పొలాలను వరి నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా రుతుపవనాలు రాకముందే కురిసిన కాస్త వర్షానికి రైతు సాగుకు సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు మరికొంత ఆలస్యమవుతాయని వాతావరణ శాఖాధికారులు చెప్తుండటంతో బావులు, బోర్ల కింద వ్యవసాయం ఉన్న రైతులు విత్తనాలను విత్తి రుతుపవనాల రాకకోసం ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,24,651 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వరి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది, పత్తి, వేరుశనగ, చెరుకు, ఇతర వాణిజ్య, ఆహార పంటలు పండించేందుకు సమాయత్తమయ్యారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 57.9 మిల్లీమీటర్లు నమోదు కాగా, 17.5 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles