అవగాహనతో యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగొచ్చు..!

Tue,June 18, 2019 12:27 AM

కొత్తగూడెం అర్బన్‌: ఆసక్తి, శ్రద్ధ ఉంటే ప్రతిఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగవచ్చని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ సీతారాంనాయక్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌ఆఫీస్‌ ఏరియా అంబేద్కర్‌ భవన్‌లో ‘యూనిట్ల ఏర్పాటు - రుణాల కల్పన’ తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు(యూనిట్‌) ఏర్పాటు చేసేందుకు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగి ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకోవచ్చన్నారు. ఎస్‌.బి.ఐ చీఫ్‌ మేనేజర్‌ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఎంటర్‌ప్రెన్యూర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చన్నారు. ధ్రుపపత్రాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూనిట్‌ అంచనా వ్యయం, రుణ వాయిదాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మార్కెటింగ్‌ అతిముఖ్యమైన పని అన్నారు. అనుభవంతో మెరుగైన లాభాలు అర్జించవచ్చన్నారు. యువత వినూత్నంగా ఆలోచించి ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం(పీఎంఈజీపీ), ఖాదీ విజేల్‌ ఇండస్ట్రీస్‌ కమీషన్‌(కేవీఐసీ), ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు(కేవీఐబీ), తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన టీఎస్‌-ఐపాస్‌, టీ-ప్రైడ్‌, టీ-ఐడియా పథకాలపై యువతీ యువకులకు అవగాహన కల్పించారు. సదస్సులో ఎస్సీ వెల్ఫేర్‌శాఖ ఈడీ పులిరాజు, డీపీఆర్వో శీలం శ్రీనివాసరావు, టీఎస్‌ఐఐసీ జోనల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌, జాబ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ హరికృష్ణ, ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌ బి.పృధ్వీరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ అస్వక్‌, మాధవి, భానుమూర్తి, కొత్తగూడెం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జుగల్‌ కిషోర్‌ ఖండేల్‌వాల్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles