ఉమ్మడి జిల్లాకు 10 బీసీ గురుకులాలు

Wed,June 12, 2019 12:03 AM

-ఈ నెల 17న ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు
-ప్రస్తుత గురుకులాల సంఖ్య 75
-అత్యుత్తమ విద్య, సకల సౌకర్యాలు
ఖమ్మం, నమస్తే తెలంగాణ: ప్రతి నిరుపేద విద్యార్థికి కార్పొరేట్ విద్యను అందించే లక్ష్యంతో గురుకుల విద్యను ముఖ్యమంత్రి కేసీఆర్ బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు ఏర్పడిన తరువాత గత ఐదేళ్లలో గురుకుల విద్యకు ప్రభుత్వం పెద ్దపీట వేసింది. గురుకులాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులను సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకుండా విద్యకు దూరమవుతున్న వర్గాలకు చెందిన వారి కోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ గురుకులాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఒకొక్కటి చొప్పున 10 బీసీ గురుకులాలు మంజూరయ్యాయి. వీటిని ఈ నెల 17న ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఇప్పటికే 75 (ఎస్సీ-23, ఎస్టీ-25, మైనార్టీ-13, బీసీ-14) ఉన్నాయి. కొత్తగా రాబోయే వాటితో కలిపి బీసీ గురుకులాల సంఖ్య 24కు చేరుకుంటుంది. ఈ మొత్తం పాఠశాలల్లో సుమారు 30వేల మంది విద్యార్థులున్నారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా..
ప్రస్తుత సమాజంలో నిరుపేద విద్యార్థి ప్రైవేటు రంగంలో విద్యనభ్యసించాలంటే తలకు మించిన భారంగా మారింది. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలనే ఆశ ఉంటుంది. కానీ, వారి ఆశలకు.. ఆకాంక్షలకు ఆర్ధిక లేమి అడ్డుపడుతోంది. దీనిని గమనించిన ప్రభుత్వం, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందించే లక్ష్యంతో గురుకులాలను ప్రవేశపెట్టింది. పేరొందిన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలకన్నా మెరుగ్గా వీటిని తీర్చిదిద్దుతోంది. వీటిలో సకల సౌకర్యాలున్నాయి. మంచి భోజనం, మినరల్ వాటర్, యూనిఫాం& ఇలా అన్నీ ఉచితంగా అందిస్తోంది. వీటిలో ఐదవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవచ్చు. కార్పొరేట్ స్థాయి (అంతకన్నా మిన్నగా) విద్యను అందించడమే ఈ గురుకులాల లక్ష్యం. లక్షల రూపాయలు పోసి పెద్ద పెద్ద కార్పొరేట్ చదువులు చెప్పించలేని పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పిస్తున్నారు. వీటిని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌ను వేనోళ్ల కొనియాడుతున్నారు.

గురుకులాల ప్రత్యేకతలు...
- ఎల్‌సీడీ టీవీల ద్వారా డిజిటల్ బోధనను ప్రభుత్వం అందిస్తోంది.
- అన్ని రకాల పోషక విలువలతో కూడిన (సన్న బియ్యంతోపాటు చికెన్, మటన్, కోడిగుడ్డు, అరటిపండ్లు, బూస్ట్, పాలు తదితరాలు) చక్కటి రుచికరమైన ఆహారాన్ని, మినరల్ వాటర్ అందిస్తోంది.
- ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది.
- స్టేషనరీ (పెన్నులు, పెన్సిళ్ల్లు తదితరాలు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇస్తోంది.
- మూడు జతల స్కూల్ యూనిఫాం అందిస్తోంది.
- పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూస్ ఇస్తోంది.
- ప్లేట్లు, గ్లాసులు, బెడ్‌షీట్లు, పరుపులు, దిండ్లు, బ్లాంకెట్లు, ట్రంక్ బాక్సులు ఇస్తోంది.
- కాస్మొటిక్ కిట్ ఇస్తోంది.
- కంప్యూటర్ ల్యాబ్, లైఫ్ స్కిల్ స్టూడియో, మ్యాథ్స్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ ఉన్నాయి.
- ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యాబెట్లు (మినీ కంప్యూటర్లు) ఇస్తోంది.
- అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు విద్యావిహార యాత్రలకు తీసుకెళుతోంది.
- 10వ తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది.
- మెరిట్ విద్యార్థులు ఏవైనా పోటీ పరీక్షల్లో పాల్గొన్నప్పుడు అందుకయ్యే అన్ని రకాల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది.
- చదువుతోపాటు ఆటపాటలు, యోగా తదితరాలకు కూడా ప్రాధాన్యముంటోంది.
- ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడేలా, సృజనాత్మకంగా రాయగలిగేలా నైపుణ్యం పెంచే లక్ష్యంతో ఈ-ప్లస్, డబ్ల్యు-ప్లస్ క్లబ్బులను ప్రతి రోజు సాయంత్రం 4.00 నుంచి 4.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు.
- హిందీ భాషపై, సాహిత్యంపై ఆసక్తి పెంచేందుకు అంకూర్ అనే కార్యక్రమం అమలవుతోంది.
- గణితం, సైన్స్ పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు ఎం-ప్లస్, పీ-ప్లస్ క్లబ్బులను (ఆపరేషన్ ఐన్‌స్టీన్) నడుస్తున్నాయి.
- 5,6,7వ తరగతుల విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక కార్యక్రమం (కరాడిపథ్) అమలవుతోంది. మ్యూజిక్, స్టోరీ, యాక్షన్ పద్ధతుల్లో పిల్లల్లో ఆంగ్ల భాష ప్రావీణ్యాన్ని పెంచుతున్నారు.
- ప్రతి క్లాసు నుంచి తెలివైన విద్యార్థులను టీచింగ్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నారు. వెనుకబడిన తమ తోటి విద్యార్థులకు వీరే శిక్షణ ఇస్తున్నారు.
- చిన్నతనంలోనే బోధనానుభవం పెంచే లక్ష్యంతో ఎంపిక చేసిన పిల్లలతో మన టీవీలో టీచర్లుగా రూపొందిస్తున్నారు. బోధనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎస్‌ఆర్ శంకరన్ సూపర్ స్టూడెంట్ ట్రోఫీతోపాటు నగదు బహుమతి ఇస్తున్నారు.
సుశిక్షితులైన ఉపాధ్యాయలు, శిక్షకులు...
- గురుకులాల్లో సమర్థులైన, సుదీర్ఘ బోధనానుభవమున్న ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులపై 24 గంటలపాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటోంది.
- విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు హౌస్ మాస్టర్, హౌస్ పేరెంట్ వ్యవస్థ ఉంది.
- మార్షల్ ఆర్ట్స్, లలిత కళలు, యోగా, క్రీడలు, శారీరక విద్య, కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు శిక్షకులు ఉన్నారు.
- ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న్తారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు.
నిరుపేద పిల్లలకు బంగారు భవిత...
కార్పొరేట్ సంస్థలకన్నా మిన్నగా గురుకులాల్లో విద్యను అందిస్తున్నాం. ధనవంతుల ఇళ్లల్లో లభించని రుచికరమైన పౌష్టికాహారాన్ని గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోంది. క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో పిల్లలకు శిక్షణ అందుతోంది. కేజీ టు పీజీ మిషన్ కింద తెలంగాణలో అదనంగా గురుకులాలను ప్రాంతాలవారీగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
- ప్రత్యూష (ఎస్సీ గురుకులాల మూడు జిల్లాల ఆర్‌సీవో )

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles