అల్లుడు, భార్య పై కత్తితో దాడి

Wed,June 12, 2019 12:01 AM

అశ్వారావుపేట రూరల్, జూన్ 11 : మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో భార్య, అల్లుడిపై భర్త దాడి చేసి గాయపర్చిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆసుపాక గ్రామానికి చెందిన భూక్యా నాగుకు, ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిగోదావరి జిల్లా, చింతలపూడి మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఉమాజాన్వీ జన్మించింది. 10 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి పెద్దల సమక్షంలో విడిపోయారు. ఆ సమయంలో నాగు, నాగమణికి మనోవర్తి కింద ఒక ఎకరం భూమి ఆసుపాకలో ఇచ్చాడు. ఆ తరువాత నుంచి ఆ భూమిలో జామాయిల్ సాగు చేసి దాని పై వచ్చే ఆదాయన్ని నాగమణి తీసుకుంటోంది. నాగమణి కుమర్తె ఉమాజాన్వీని చండ్రుగొండ మండలంలోని వెంకటాయ తండాకు చెందిన గుగులోతు సురేష్‌కు ఇచ్చి వివాహం చేసి, కుమార్తె, అల్లుడికి ఆ ఎకరం భూమి కానుకగా ఇచ్చింది. ఇటీవల భూ ప్రక్షాళనలో ఆ ఎకరం భూమికి పాస్‌పుస్తకం కోసం రెవెన్యు అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది.

దీంతో నాగు ఆ భూమిని కాకుండా మరొక చోట ఉన్న భూమిని నాగమణికి ఇస్తానని చెప్పటంతో జామాయిల్ సాగు చేసి రెండు కటింగ్‌లు చేశానని, నాకు ఇదే భూమి కావాలని పట్టుపట్టింది. నాగు ఆ భూమిని పట్టా చేయించుకున్నాడనే అనుమానంతో రెవెన్యూ అధికారులకు భూమిని సర్వే చేసేందుకు దరఖాస్తు పెట్టింది. సురేష్ ఢిల్లీలో కేంద్రహోంమంత్రిత్వశాఖ ఎస్‌ఎస్‌బీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. సెలవు పై షిర్డీలో సాయిబాబాను సందర్శించుకుని, అక్కడ నుంచి సీతానగరం వచ్చాడు. మంగళవారం ఆసుపాకలోని భూమిని సర్వే చేయించేందుకు అత్త నాగమణి, అల్లుడు సురేష్‌లు అశ్వారావుపేట వచ్చి రెవెన్యు అధికారులను తీసుకుని వెళ్లి భూమిని సర్వే చేయించి సరిహద్దులు నిర్ణయించారు. అక్కడ నుంచి రెవెన్యు అధికారులు అశ్వారావుపేటకు వెళ్లిపోగా, అత్త, అల్లుడు ఆసుపాకలో ఉన్న బంధువు వెంకటేశ్వరరావు ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లుతుండగా ఆ ఇంటి సమీపంలో కాపు కాసి కత్తితో ముందుగా నాగమణిపై దాడి చేయగా ఎడమ మోచేతిపై తీవ్రంగా గాయమైంది. ఆమెను రక్షించేందుకు సురేష్ ప్రయత్నించగా సురేష్ పై దాడి చేయటంతో పొట్టలో గాయమైంది. ఇద్దరిని అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యాశాలకు తరలించిగా ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles